
పవన్‌కల్యాణ్
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : ప్రముఖ సినీ నటుడు పవన్‌కల్యాణ్ శుక్రవారం జనసేన పార్టీని లాంఛనంగా ప్రకటించారు. పార్టీ ఏర్పాటు ప్రకటనను ప్రత్యక్షంగా తిలకించేందుకు బెల్లంపల్లిలోని సింగరేణి తిలక్ స్టేడియంలో లైవ్‌షోను భారీ స్క్రీన్‌తో ఏర్పాటు చేశారు. కొత్తగా పవన్‌కల్యాణ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరగడంతో యువకులు, విద్యార్థులు సింగరేణి కార్మికులు తరలివచ్చారు. జనసేన పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం పవన్‌కల్యాణ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగం ప్రారంభించే ముందు జనం సుమారు వెయ్యి వరకు కనిపించగా ఆ తర్వాత తగ్గారు.
యువకులు, కార్మికులు ద్విచక్ర వాహనాలపై వచ్చి కేవలం పది, పదిహేను నిమిషాలు ప్రసంగాన్ని విని ఆ తర్వాత ఇంటిదారి పట్టారు. పవన్‌కల్యాణ్ ప్రసంగం ముగిసే వరకు కేవలం 500 లోపు మాత్రమే ఉన్నారు. సినిమా డైలాగుల మాదిరిగా ప్రసంగించడంతో యువకులను ఆకట్టుకోలేక పోయింది.
వచ్చిన జనంలో ఒక్కరు కూడా మహిళలు లేకపోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో పవన్‌కల్యాణ్ అభిమాన సంఘం జిల్లా నాయకులు బి.శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.