లంచం తీసుకుంటూ పట్టుబడిన కారు డ్రైవర్ రాజ్‌కుమార్, ఎస్సై భాస్కర్‌రావు
సాక్షి, బెల్లంపల్లి: స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం తీసుకున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూటౌన్ ఎస్సై కే.భాస్కర్‌రావును కరీంనగర్ అవినీతి నిరోధక శాఖ అధికారులు(ఏసీబీ) బుధవారం వలపన్ని పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ కే.భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ శివారు బాహుపేటకు చెందిన తండ్రీకొడుకులు అల్లె సత్యనారాయణ, అల్లె వేణు బెల్లంపల్లి కాల్‌టెక్స్ ఏరియాకు చెందిన ఓ వ్యక్తికి లారీని లీజుకు ఇచ్చి ఆ లారీ ఇంజిన్, చాసిస్ నంబరు మార్చి వేరే వ్యక్తుల పేర్లపై మార్పిడి చేసి తప్పుడు పద్ధతిలో రుణం పొంది మోసం చేశారని ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ ఫిర్యాదు చేయడంతో వారిద్దరిపై 2019 నవంబర్ 12న బెల్లంపల్లి టూటౌ న్‌లో కేసు నమోదైంది. వారికి బెయిల్ మంజూరు కోసం అల్లె నవీన్ కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్సై భాస్కర్‌రావు రూ.2లక్షలు డిమాండ్ చేశాడు.
నవీన్ ప్రాధేయపడడంతో చివరికి రూ.1.20లక్షలకు ఒప్పందం కుదిరింది. బుధవారం డబ్బు తీసుకుని బెల్లంపల్లికి వచ్చినట్లు నవీన్ ఎస్సైకి సమాచారం ఇచ్చాడు. తన ప్రైవేటు కారు డ్రైవర్ రాజ్‌కుమార్ టూటౌన్ ముందున్న రహదారిపై ఉంటాడని, అతనికి ఇవ్వాలని ఎస్సై భాస్కర్‌రావు సూచించాడు. నవీన్ రాజ్‌కుమార్‌కు డబ్బు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు టూటౌన్‌కు చేరుకుని నగదు స్వాధీనం చేసుకున్నా రు. ఎస్సై భాస్కర్‌రావు, రాజ్‌కుమార్ చేతులకు ర సాయనిక పరీక్ష చేయగా పాజిటివ్‌గా వచ్చిందని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. ఎస్సై భాస్కర్‌రావు, రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేశామని, గురువారం కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజ రు పరుస్తామని తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు ఎస్‌పీ.రవీందర్, సంజీవ్, ఎస్సైలు పాల్గొన్నారు.
ఖాకీల్లో కలకలం
ఎస్సై ఏసీబీకి చిక్కడంతో జిల్లాలో సంచలనం, పోలీ సుశాఖలో కలకలం సృష్టించింది. ఏడేళ్ల తర్వాత ఓ పోలీసు అధికారి చిక్కడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భీమిని మండలానికి చెందిన ఓ ఎంఈవో మెట్‌పల్లి(ఏసయ్యపల్లె) గ్రామానికి చెందిన సాక్షర భారత్ కోఆర్డినేటర్ నుంచి లంచం తీసుకుంటుండగా బెల్లంపల్లి లో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. బెల్లంపల్లి ఆబ్కారీ సీఐ గురవయ్య గౌడ కులస్తుల నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఆ ఘట నల తర్వాత ఎస్సై స్థాయి అధికారి పట్టుబడడం పోలీసు శాఖను ఉలిక్కిపాటుకు గురి చేసింది.
సీఐ ప్రమోషన్‌లో ఉండి..
బెల్లంపల్లి టూటౌన్ ఎస్సైగా భాస్కర్‌రావు 2019 న వంబర్ 7న విధుల్లో చేరారు. అంతకుముందు కాసిపేట పోలీసుస్టేషన్‌లో పనిచేశారు. సాధారణ బదిలీల్లో భాగంగా బెల్లంపల్లి టూటౌన్‌కు వచ్చిన తర్వాత ప్రత్యేక శైలీ అలవర్చుకున్నారనే ఆరోపణలున్నాయి. మరికొన్ని కేసుల్లోనూ స్టేషన్ బెయిల్‌కు నిందితులను ఇబ్బందులకు గురి చేశారనే విమర్శలు వచ్చాయి. ఒకట్రెండు నెలల్లో బదిలీ కానున్నారనే ప్రచారం జరిగింది. మరోవైపు పోలీసుశాఖలో పదోన్నతుల కల్పనకు కసరత్తు చేస్తుండగా ఆయన పేరు ఐదో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఐగా బదిలీపై వెళ్లాలనే తలంపులో ఉన్న ఆయనకు ఏసీబీతో ఎదురుదెబ్బ తగిలింది.
Comments
Please login to add a commentAdd a comment