బెల్లంపల్లి : కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో మరోమారు తూర్పు ప్రాంత ప్రజల్లో ఆశలు రేగాయి. ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తుందనేది సర్వత్రా ఆసక్తినెలకొంది. వైశాల్యంలో పెద్దదైన ఆదిలాబాద్ జిల్లాను తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విడదీసి తూర్పు ప్రాంతానికి జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి దశాబ్దాల నుంచి వస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో 14 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అందుకు అనుగుణంగ కసరత్తు కూడా మొదలుపెట్టడంతో మరోమారు ఈ అంశం తెరమీదకు వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఉన్నత స్థాయి కమిటీని నియమించి, నిశితంగా అధ్యయనం చేయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రెండింటి మధ్య పోటీ..
తూర్పు ప్రాంతంలో మంచిర్యాల, బెల్లంపల్లి రెండు ప్రధాన పట్టణాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల ప్రజలు ఎవరికి వారు కొత్త జిల్లాను తమ ప్రాంతం కేంద్రంగానే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎన్నికల సందర్భంలోనూ ఈ అంశం ప్రతిసారి ప్రస్తావనకు వస్తోంది. మంచిర్యాలను జిల్లా చేస్తామని కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల ముందు ప్రకటించారు.
ఇదే క్రమంలో ప్రభుత్వ భూములు, మౌలిక వసతులు అపారంగా ఉన్న బెల్లంపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాజకీయ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. రెండు ప్రాంతాల ప్రజలు పోటీ పడి ఎవరికి వారు అనుగుణంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యయన కమిటీ మౌలిక అంశాలను పరిశీలించి ఏ ప్రాంతాన్ని కొత్త జిల్లాకు అనుకూలంగా ప్రకటిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
పుష్కలంగా మౌలిక వసతులు
కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రకటించినట్లుగా మౌలిక వసతులు ప్రధానం అనేది సుస్పష్టమైంది. కొత్త జిల్లా పరిశీలనకు వచ్చిన ప్రాంతాలను అధ్యయన కమిటీ స్వయంగా పరిశీలించి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. కొత్త జిల్లా ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు బెల్లంపల్లిలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు ప్రాంతంలోని చెన్నూర్, మంచిర్యాల, సిర్పూర్(టి), ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు బెల్లంపల్లి కేంద్ర బిందువుగా ఉంది.
ఏఆర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్, అడిషనల్ ఎస్పీ కార్యాలయం బెల్లంపల్లిలో ఉండటం మరో అదనపు అర్హతగా పేర్కొంటున్నారు. అపారమైన ప్రభుత్వ భూములు కలిగి ఉండటంతోపాటు సింగరేణి భవనాలు, క్వార్టర్లు, రోడ్డు, రైల్వే రవాణ సౌకర్యాలు కలిసి వచ్చే అంశంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంచిర్యాలలో జిల్లా కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ భూములు తగినంత లేకపోవడం ప్రతికూలంశంగా మారే అవకాశాలు ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు.
భౌగోళిక స్వరూపం, రవాణ, వసతులు, జనాభా తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఎక్కడ కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వానికి అధ్యయన కమిటీ సూచించనుంది. మరోపక్క కొత్త జిల్లాలను ఒకేసారి కాకుండా దశలవారీగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏదిఏమైనా కొత్త జిల్లా ఏ ప్రాంతమవుతుందనేది అధ్యయన కమిటీపైనే ఆధారపడి ఉందనేది గమనార్హం.
ఆశలు రేపిన కొత్త జిల్లా
Published Wed, Sep 10 2014 12:28 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement
Advertisement