The new districts
-
‘నాగిరెడ్డిపేట’ను కేసీఆర్‌కే వదిలేశాం
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించి తీరుతాం ‘కాళేశ్వరం’తో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి: పాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన అని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయ నాయకుల కోసం కాదని, ప్రజల సౌలభ్యం కోసమేనని స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలాన్ని కొందరు కామారెడ్డి జిల్లాలో ఉంచాలని, మరికొందరు మెదక్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని, దీనిపై నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌కే వదిలేశామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. విప్ గోవర్ధన్, ఎమ్మెల్యేలు రవీందర్‌రెడ్డి, హన్మంత్ సింధేలతో కలిసి సీఎంను కలిశామని.. నాగిరెడ్డిపేటపై ఆయనే నిర్ణయం తీసుకుంటారన్నారు. కామారెడ్డి నూతన జిల్లా ఏర్పాట్లను మంత్రి పోచారం ప్రభుత్వ విప్ గంగ గోవర్ధన్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. కలెక్టరేట్ కోసం ఎంపిక చేసిన భవనాలను పరిశీలించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ జిల్లాలు ఏర్పాటు చేశారని పోచారం పేర్కొన్నారు. బాన్సువాడను డివిజన్ కేంద్రం చేయడం, కొత్త మండలాల ఏర్పాటు ద్వారా కామారెడ్డి జిల్లాకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కామారెడ్డిలో కలెక్టరేట్ కోసం 60 వేల చదరపు అడుగుల వైశాల్యం ఉన్న భవనాలు అందుబాటులో ఉండడం వల్ల పాలనకు ఎంతో అనుకూలంగా ఉందన్నారు. రూ.50 కోట్లతో 2.50 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో అన్ని వసతులు, అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండే విధంగా కొత్త కలెక్టరేట్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ‘మల్లన్నసాగర్’ ఆగదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించి తీరతామని మంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను చూసి, తమకు ఉనికి లేకుండా పోతుందన్న భయంతోనే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని విమర్శించారు. ఎవరు అడ్డుపడ్డా ప్రాజెక్టు నిర్మాణం ఆగదన్నారు. రూ.80 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ. 10 వేల కోట్లతో చేపట్టిన పనులు 80 శాతం పూర్తయ్యాయన్నారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేర్, అక్కడి నుంచి అనంతగిరి రిజర్వాయర్, రంగనాయక సాగర్ల ద్వారా మల్లన్నసాగర్‌కు నీరు వస్తుందని తెలిపారు. ఎల్తైన ప్రదేశంలో ఉన్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తే.. అటు భువనగిరి, ఆలేరు, జనగామలకు, ఇటు కామారెడ్డి, ఎల్లారెడ్డికి, మరోవైపు హల్దివాగు ద్వారా నిజాంసాగర్, శ్రీరాంసాగర్ వరకు గ్రావిటీ ద్వారా సరఫరా అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 10.75 లక్షల ఎకరాల ఆయకట్టు, 18.50 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ అవుతుందన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ, ఆర్డీవో నగేశ్, డీఎస్పీ భాస్కర్, జెడ్పీటీసీ సభ్యుడు మధుసూదన్‌రావు, టీఆర్ఎస్ నేతలు వేణుగోపాల్‌రావు, లక్ష్మారెడ్డి, గోపిగౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, బల్వంత్‌రావ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాల ఏర్పాటుపై 1,424 అప్పీళ్లు
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాలు, రెవె న్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి ఆదివారం రాత్రి వరకు ఆన్లైన్ ద్వారా మొత్తం 1,424 అప్పీళ్లు అం దాయి. వీటిలో కొత్తగా ఏర్పడబోయే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు, మండలాలకు సంబంధించిన అభ్యంతరాలు, సూచనలు ఉన్నాయి. కొత్త జిల్లాలకు సంబందించి అప్పీళ్లను పౌరులు నేరుగా, ఆన్లైన్ ద్వారా కూడా ఫైల్ చేయవచ్చు, ఈవిధానం సులభతరంగా ఉండేలా వెబ్సైట్ ఏర్పాటు చేశారు. అభ్యంతరాలు నమోదు కోసం www.newdistrictsformation.telangana.gov.in వెబ్సైట్లోకి లాగినై వివరాలు తెలియజేయాలి. చేతిరాతతో రాసిన కాగితంకానీ, డీటీపీ ద్వారా తయారు చేసిన డాక్యుమెంట్ స్కాన్‌చేసి మీ అభిప్రాయం వెబ్సైట్లో ఆటాచ్ చేసే అవకాశం ఉంటుంది. మీ అప్పీల్ ఫైల్ అయినట్లు మీ సెల్‌కు సమాచారం వస్తుంది. -
ఆశలు రేపిన కొత్త జిల్లా
బెల్లంపల్లి : కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో మరోమారు తూర్పు ప్రాంత ప్రజల్లో ఆశలు రేగాయి. ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తుందనేది సర్వత్రా ఆసక్తినెలకొంది. వైశాల్యంలో పెద్దదైన ఆదిలాబాద్ జిల్లాను తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విడదీసి తూర్పు ప్రాంతానికి జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి దశాబ్దాల నుంచి వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 14 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అందుకు అనుగుణంగ కసరత్తు కూడా మొదలుపెట్టడంతో మరోమారు ఈ అంశం తెరమీదకు వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఉన్నత స్థాయి కమిటీని నియమించి, నిశితంగా అధ్యయనం చేయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండింటి మధ్య పోటీ.. తూర్పు ప్రాంతంలో మంచిర్యాల, బెల్లంపల్లి రెండు ప్రధాన పట్టణాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల ప్రజలు ఎవరికి వారు కొత్త జిల్లాను తమ ప్రాంతం కేంద్రంగానే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎన్నికల సందర్భంలోనూ ఈ అంశం ప్రతిసారి ప్రస్తావనకు వస్తోంది. మంచిర్యాలను జిల్లా చేస్తామని కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల ముందు ప్రకటించారు. ఇదే క్రమంలో ప్రభుత్వ భూములు, మౌలిక వసతులు అపారంగా ఉన్న బెల్లంపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాజకీయ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. రెండు ప్రాంతాల ప్రజలు పోటీ పడి ఎవరికి వారు అనుగుణంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యయన కమిటీ మౌలిక అంశాలను పరిశీలించి ఏ ప్రాంతాన్ని కొత్త జిల్లాకు అనుకూలంగా ప్రకటిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. పుష్కలంగా మౌలిక వసతులు కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రకటించినట్లుగా మౌలిక వసతులు ప్రధానం అనేది సుస్పష్టమైంది. కొత్త జిల్లా పరిశీలనకు వచ్చిన ప్రాంతాలను అధ్యయన కమిటీ స్వయంగా పరిశీలించి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. కొత్త జిల్లా ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు బెల్లంపల్లిలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు ప్రాంతంలోని చెన్నూర్, మంచిర్యాల, సిర్పూర్(టి), ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు బెల్లంపల్లి కేంద్ర బిందువుగా ఉంది. ఏఆర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్, అడిషనల్ ఎస్పీ కార్యాలయం బెల్లంపల్లిలో ఉండటం మరో అదనపు అర్హతగా పేర్కొంటున్నారు. అపారమైన ప్రభుత్వ భూములు కలిగి ఉండటంతోపాటు సింగరేణి భవనాలు, క్వార్టర్లు, రోడ్డు, రైల్వే రవాణ సౌకర్యాలు కలిసి వచ్చే అంశంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంచిర్యాలలో జిల్లా కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ భూములు తగినంత లేకపోవడం ప్రతికూలంశంగా మారే అవకాశాలు ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. భౌగోళిక స్వరూపం, రవాణ, వసతులు, జనాభా తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఎక్కడ కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వానికి అధ్యయన కమిటీ సూచించనుంది. మరోపక్క కొత్త జిల్లాలను ఒకేసారి కాకుండా దశలవారీగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏదిఏమైనా కొత్త జిల్లా ఏ ప్రాంతమవుతుందనేది అధ్యయన కమిటీపైనే ఆధారపడి ఉందనేది గమనార్హం.