‘నాగిరెడ్డిపేట’ను కేసీఆర్‌కే వదిలేశాం | Nagireddipeta | Sakshi
Sakshi News home page

‘నాగిరెడ్డిపేట’ను కేసీఆర్‌కే వదిలేశాం

Published Tue, Sep 20 2016 10:17 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

‘నాగిరెడ్డిపేట’ను కేసీఆర్‌కే వదిలేశాం

‘నాగిరెడ్డిపేట’ను కేసీఆర్‌కే వదిలేశాం

  • మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మించి తీరుతాం
  • ‘కాళేశ్వరం’తో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం
  • వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
  • కామారెడ్డి:
    పాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన అని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయ నాయకుల కోసం కాదని, ప్రజల సౌలభ్యం కోసమేనని స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలాన్ని కొందరు కామారెడ్డి జిల్లాలో ఉంచాలని, మరికొందరు మెదక్‌ జిల్లాలో కలపాలని డిమాండ్‌ చేస్తున్నారని, దీనిపై నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌కే వదిలేశామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. విప్‌ గోవర్ధన్, ఎమ్మెల్యేలు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌ సింధేలతో కలిసి సీఎంను కలిశామని.. నాగిరెడ్డిపేటపై ఆయనే నిర్ణయం తీసుకుంటారన్నారు. కామారెడ్డి నూతన జిల్లా ఏర్పాట్లను మంత్రి పోచారం ప్రభుత్వ విప్‌ గంగ గోవర్ధన్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. కలెక్టరేట్‌ కోసం ఎంపిక చేసిన భవనాలను పరిశీలించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్‌ జిల్లాలు ఏర్పాటు చేశారని పోచారం పేర్కొన్నారు.
    బాన్సువాడను డివిజన్‌ కేంద్రం చేయడం, కొత్త మండలాల ఏర్పాటు ద్వారా కామారెడ్డి జిల్లాకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కామారెడ్డిలో కలెక్టరేట్‌ కోసం 60 వేల చదరపు అడుగుల వైశాల్యం ఉన్న భవనాలు అందుబాటులో ఉండడం వల్ల పాలనకు ఎంతో అనుకూలంగా ఉందన్నారు. రూ.50 కోట్లతో 2.50 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో అన్ని వసతులు, అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండే విధంగా కొత్త కలెక్టరేట్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
    ‘మల్లన్నసాగర్‌’ ఆగదు..
    ఎట్టి పరిస్థితుల్లోనూ మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును నిర్మించి తీరతామని మంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి సీఎం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలను చూసి, తమకు ఉనికి లేకుండా పోతుందన్న భయంతోనే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని విమర్శించారు. ఎవరు అడ్డుపడ్డా ప్రాజెక్టు నిర్మాణం ఆగదన్నారు. రూ.80 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ. 10 వేల కోట్లతో చేపట్టిన పనులు 80 శాతం పూర్తయ్యాయన్నారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేర్, అక్కడి నుంచి అనంతగిరి రిజర్వాయర్, రంగనాయక సాగర్‌ల ద్వారా మల్లన్నసాగర్‌కు నీరు వస్తుందని తెలిపారు. ఎల్తైన ప్రదేశంలో ఉన్న మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తే.. అటు భువనగిరి, ఆలేరు, జనగామలకు, ఇటు కామారెడ్డి, ఎల్లారెడ్డికి, మరోవైపు హల్దివాగు ద్వారా నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌ వరకు గ్రావిటీ ద్వారా సరఫరా అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 10.75 లక్షల ఎకరాల ఆయకట్టు, 18.50 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ అవుతుందన్నారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ ముజీబొద్దీన్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మ, ఆర్డీవో నగేశ్, డీఎస్పీ భాస్కర్, జెడ్పీటీసీ సభ్యుడు మధుసూదన్‌రావు, టీఆర్‌ఎస్‌ నేతలు వేణుగోపాల్‌రావు, లక్ష్మారెడ్డి, గోపిగౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, బల్వంత్‌రావ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement