Eastern Region
-
బాలాజీనగర్‌కు చిరుతల భయం
తిరుమలలో చిరుతల సంచారం పెరిగిపోయింది. బాలాజీనగర్ వాసులు కంటి మీద కునుకులేకుండా భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సివస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తిరుమల: బాలాజీనగర్‌లోని తూర్పు ప్రాంతంలో మూడు చిరుతలు సంచరిస్తున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి కాకుల కొండ మీదుగా డంపింగ్‌యార్డ్ వద్ద అవి తిరుగుతాయి. చీకటి పడిన తర్వాత స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ తూర్పు ప్రాంతానికి చేరుకుంటాయి. రాత్రి 10 గంటలకు జనం చప్పుడు తగ్గిన తర్వాత రాకపోకలు సాగిస్తున్నాయి. గంటల తరబడి తూర్పు ప్రాంతం నుంచి పాచికాల్వ గంగమ్మ గుడి ప్రాంతం వరకు ఉండే ఇళ్ల ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరిగిపోయింది. పొంచిఉన్న ప్రమాదం బాలాజీనగర్ ప్రాంతంలో పగలు, రాత్రి లేకుండా చిరుతలు సంచరిస్తున్నాయి. ఇవి ఎవరిపైనైనా దాడి చేసే అవకాశం ఉంది. బాలాజీనగర్ వాసులు తూర్పుప్రాంతంలోని నీటి గుంట వద్ద బట్టలు ఉతికేందుకు వెళుతుంటారు. ఆ ప్రాంతం అంతా దట్టమైన చెట్లు, ముళ్ల పొదలతో నిండి ఉంది. సీసీ కెమెరా పెట్టే ఆలోచనలో ఫారెస్ట్ అధికారులు ఇటీవల కాలంలో చిరుతల సంచారం పెరిగిపోవడంతో సీసీ కెమెరాలు పెట్టాలని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. నిత్యం అవి వచ్చివెళ్లే దారుల్లో సీసీ కెమెరాలు పెట్టి వాటి జాడలు గుర్తించాలని అధికారులు నిర్ణయించారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. చిరుతల సంచారం నిర్దారించాక పరిస్థితి అధికమిస్తే వాటిని పట్టుకునేందు ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. -
ఆశలు రేపిన కొత్త జిల్లా
బెల్లంపల్లి : కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో మరోమారు తూర్పు ప్రాంత ప్రజల్లో ఆశలు రేగాయి. ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తుందనేది సర్వత్రా ఆసక్తినెలకొంది. వైశాల్యంలో పెద్దదైన ఆదిలాబాద్ జిల్లాను తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విడదీసి తూర్పు ప్రాంతానికి జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి దశాబ్దాల నుంచి వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 14 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అందుకు అనుగుణంగ కసరత్తు కూడా మొదలుపెట్టడంతో మరోమారు ఈ అంశం తెరమీదకు వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఉన్నత స్థాయి కమిటీని నియమించి, నిశితంగా అధ్యయనం చేయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండింటి మధ్య పోటీ.. తూర్పు ప్రాంతంలో మంచిర్యాల, బెల్లంపల్లి రెండు ప్రధాన పట్టణాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల ప్రజలు ఎవరికి వారు కొత్త జిల్లాను తమ ప్రాంతం కేంద్రంగానే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎన్నికల సందర్భంలోనూ ఈ అంశం ప్రతిసారి ప్రస్తావనకు వస్తోంది. మంచిర్యాలను జిల్లా చేస్తామని కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల ముందు ప్రకటించారు. ఇదే క్రమంలో ప్రభుత్వ భూములు, మౌలిక వసతులు అపారంగా ఉన్న బెల్లంపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాజకీయ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. రెండు ప్రాంతాల ప్రజలు పోటీ పడి ఎవరికి వారు అనుగుణంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యయన కమిటీ మౌలిక అంశాలను పరిశీలించి ఏ ప్రాంతాన్ని కొత్త జిల్లాకు అనుకూలంగా ప్రకటిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. పుష్కలంగా మౌలిక వసతులు కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రకటించినట్లుగా మౌలిక వసతులు ప్రధానం అనేది సుస్పష్టమైంది. కొత్త జిల్లా పరిశీలనకు వచ్చిన ప్రాంతాలను అధ్యయన కమిటీ స్వయంగా పరిశీలించి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. కొత్త జిల్లా ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు బెల్లంపల్లిలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు ప్రాంతంలోని చెన్నూర్, మంచిర్యాల, సిర్పూర్(టి), ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు బెల్లంపల్లి కేంద్ర బిందువుగా ఉంది. ఏఆర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్, అడిషనల్ ఎస్పీ కార్యాలయం బెల్లంపల్లిలో ఉండటం మరో అదనపు అర్హతగా పేర్కొంటున్నారు. అపారమైన ప్రభుత్వ భూములు కలిగి ఉండటంతోపాటు సింగరేణి భవనాలు, క్వార్టర్లు, రోడ్డు, రైల్వే రవాణ సౌకర్యాలు కలిసి వచ్చే అంశంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంచిర్యాలలో జిల్లా కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ భూములు తగినంత లేకపోవడం ప్రతికూలంశంగా మారే అవకాశాలు ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. భౌగోళిక స్వరూపం, రవాణ, వసతులు, జనాభా తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఎక్కడ కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వానికి అధ్యయన కమిటీ సూచించనుంది. మరోపక్క కొత్త జిల్లాలను ఒకేసారి కాకుండా దశలవారీగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏదిఏమైనా కొత్త జిల్లా ఏ ప్రాంతమవుతుందనేది అధ్యయన కమిటీపైనే ఆధారపడి ఉందనేది గమనార్హం. -
అన్వేషణ
బెల్లంపల్లి : తూర్పు ప్రాంతంలో గుట్టుగా డంప్‌ల కోసం వేట కొనసాగుతోంది. నిషేధిత మావోయిస్టులకు చెందిన డంప్ కొన్ని ముఠాలు అన్వేషణ సాగిస్తున్నాయి. అణువణువున అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ దందా నిత్యకృత్యంగా సాగుతోంది. ఇప్పటివరకు ఏ ముఠాకుడంప్లు దొరికినట్లు ఆధారాలు లేకపోయినా అన్వేషణ ఆగడం లేదు. తూర్పు ప్రాంతంలోని తిర్యాణి, సిర్పూర్(టి), బెజ్జూర్, కౌటాల, కాసిపేట, చెన్నూర్, జైపూర్, మందమర్రి, వేమనపల్లి, జన్నారం, నెన్నెల, బెల్లంపల్లి తదితర ప్రాంతాలు సుమారు దశాబ్ధంన్నర క్రితం వరకు మావోయిస్టులకు కేంద్రాలుగా ఉన్నాయి. ఆయా ప్రాంతాలలోని అడవులను షెల్టర్జోన్లుగా చేసుకొని మావోయిస్టులు ఉద్యమ నిర్మాణం చేపట్టారు. ఉధృత స్థాయిలో కార్యకలాపాలు సాగించారు. ఆ తర్వా త పోలీసు నిర్బంధం పెరగడం, ఎదురుకాల్పుల్లో ముఖ్య నాయకులు మృతి చెందడం, మరికొంత మంది ప్రభుత్వానికి లొంగిపోవడంతో మావోయిస్టుల ప్రభావం సన్నగిల్లింది. ప్రస్తుతం ఉద్యమంలో కొంతమంది నేతలు పని చేస్తున్న పోలీసు నిర్బంధం రీత్యా దండకారణ్యంలోకి వెళ్లారు. ఆ ప్రాంతంలోనే ఉద్యమాలలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో మావోయిస్టుల అలికిడి పూర్తిగా లేకుండా పోయింది. ఇదే అదునుగా భావించిన కొందరు ముఠాలుగా ఏర్పడి మావోయిస్టులు దాచిపెట్టిన డంప్‌ల కోసం గాలిస్తున్నారు. ఈ చర్యలో కొందరు మాజీలు ముఠా సభ్యులకు సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అత్యాశతో.. కష్టపడకుండా, తక్కువ సమయంలో ధనవంతులు కావాలనే కాంక్షతో కొందరు మావోయిస్టుల డంప్‌లపై దృష్టి సారించారు. మావోయిస్టులు కచ్చితంగా డంప్‌ల్లో భారీ మొత్తంలో డబ్బులు దాచిపెట్టి ఉంటారనే నమ్మకంతో అదే పనిగా అన్వేషణ చేస్తున్నారు. అటవీ ప్రాంతం శివారు గ్రామాల ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని డంప్‌ల వేట సాగిస్తున్నారు. కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన వ్యక్తులే డంప్‌ల అన్వేషణలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూపులుగా ఏర్పడి రాత్రిపూట అడవులను గాలిస్తున్నారు. ఎక్కడ అనుమానం వచ్చిన ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నారు. రోజువారీగా అదే పనిలో ముఠాలు నిమగ్నం కావడం తూర్పు ప్రాంతంలో చర్చనీయాంశమైంది. అన్వేషణలో భాగంగానే.. గుట్టుగా సాగుతున్న అన్వేషణలో భాగంగానే ఇటీవలి కాలంలో జిల్లాలో పలు చోట్ల మావోయిస్టుల డంప్‌లు బయటపడినట్లు తెలుస్తోంది. ముందస్తు అందిన పక్కా సమాచారంతో అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరిపి డంప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ ఏడాది మే 23న కాసిపేట మం డలం వెంకటాపూర్ గ్రామ శివారు ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో పోలీసులకు డంప్ దొరికింది. జూన్ 30న తిర్యాణి మండలం బీరల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో మరో డంప్ పోలీసుల చేతికి చిక్కింది. అంతకుముందు గతేడాది జనవరి నెలలో బెల్లంపల్లి-మందమర్రి మండలాల మధ్యలోని దట్టమైన అటవీ ప్రాంతంలో డంప్ పోలీసులకు దొరికింది. మావోయిస్టులకు చెందిన ఈ మూడు డంప్ల్లోనూ భారీ మొత్తం లో పేలుడు పదార్థాలు, ఆయుధాలు, విప్లవ సాహిత్యం, యూనిఫాంలు, ఇతర సామగ్రి లభ్యమైన సంగతి తెలిసిందే. రహస్యంగా డంప్‌ల కోసం వెతుకుతున్న ముఠాల చేతికి ఇంత వరకు డబ్బు దొరికిన ఆనవాళ్లు లేకపోయిన అదే తంతుగా వేటను సాగిస్తున్నారు.