బెల్లంపల్లి : తూర్పు ప్రాంతంలో గుట్టుగా డంప్‌ల కోసం వేట కొనసాగుతోంది. నిషేధిత మావోయిస్టులకు చెందిన డంప్ కొన్ని ముఠాలు అన్వేషణ సాగిస్తున్నాయి. అణువణువున అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ దందా నిత్యకృత్యంగా సాగుతోంది. ఇప్పటివరకు ఏ ముఠాకుడంప్‌లు దొరికినట్లు ఆధారాలు లేకపోయినా అన్వేషణ ఆగడం లేదు. తూర్పు ప్రాంతంలోని తిర్యాణి, సిర్పూర్(టి), బెజ్జూర్, కౌటాల, కాసిపేట, చెన్నూర్, జైపూర్, మందమర్రి, వేమనపల్లి, జన్నారం, నెన్నెల, బెల్లంపల్లి తదితర ప్రాంతాలు సుమారు దశాబ్ధంన్నర క్రితం వరకు మావోయిస్టులకు కేంద్రాలుగా ఉన్నాయి.
ఆయా ప్రాంతాలలోని అడవులను షెల్టర్‌జోన్‌లుగా చేసుకొని మావోయిస్టులు ఉద్యమ నిర్మాణం చేపట్టారు. ఉధృత స్థాయిలో కార్యకలాపాలు సాగించారు. ఆ తర్వా త పోలీసు నిర్బంధం పెరగడం, ఎదురుకాల్పుల్లో ముఖ్య నాయకులు మృతి చెందడం, మరికొంత మంది ప్రభుత్వానికి లొంగిపోవడంతో మావోయిస్టుల ప్రభావం సన్నగిల్లింది. ప్రస్తుతం ఉద్యమంలో కొంతమంది నేతలు పని చేస్తున్న పోలీసు నిర్బంధం రీత్యా దండకారణ్యంలోకి వెళ్లారు. ఆ ప్రాంతంలోనే ఉద్యమాలలో పాల్గొంటున్నారు.
ప్రస్తుతం జిల్లాలో మావోయిస్టుల అలికిడి పూర్తిగా లేకుండా పోయింది. ఇదే అదునుగా భావించిన కొందరు ముఠాలుగా ఏర్పడి మావోయిస్టులు దాచిపెట్టిన డంప్‌ల కోసం గాలిస్తున్నారు. ఈ చర్యలో కొందరు మాజీలు ముఠా సభ్యులకు సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అత్యాశతో..
కష్టపడకుండా, తక్కువ సమయంలో ధనవంతులు కావాలనే కాంక్షతో కొందరు మావోయిస్టుల డంప్‌లపై దృష్టి సారించారు. మావోయిస్టులు కచ్చితంగా డంప్‌ల్లో భారీ మొత్తంలో డబ్బులు దాచిపెట్టి ఉంటారనే నమ్మకంతో అదే పనిగా అన్వేషణ చేస్తున్నారు. అటవీ ప్రాంతం శివారు గ్రామాల ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని డంప్‌ల వేట సాగిస్తున్నారు.
కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన వ్యక్తులే డంప్‌ల అన్వేషణలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూపులుగా ఏర్పడి రాత్రిపూట అడవులను గాలిస్తున్నారు. ఎక్కడ అనుమానం వచ్చిన ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నారు. రోజువారీగా అదే పనిలో ముఠాలు నిమగ్నం కావడం తూర్పు ప్రాంతంలో చర్చనీయాంశమైంది.
అన్వేషణలో భాగంగానే..
గుట్టుగా సాగుతున్న అన్వేషణలో భాగంగానే ఇటీవలి కాలంలో జిల్లాలో పలు చోట్ల మావోయిస్టుల డంప్‌లు బయటపడినట్లు తెలుస్తోంది. ముందస్తు అందిన పక్కా సమాచారంతో అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరిపి డంప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ ఏడాది మే 23న కాసిపేట మం డలం వెంకటాపూర్ గ్రామ శివారు ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో పోలీసులకు డంప్ దొరికింది. జూన్ 30న తిర్యాణి మండలం బీరల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో మరో డంప్ పోలీసుల చేతికి చిక్కింది.
అంతకుముందు గతేడాది జనవరి నెలలో బెల్లంపల్లి-మందమర్రి మండలాల మధ్యలోని దట్టమైన అటవీ ప్రాంతంలో డంప్ పోలీసులకు దొరికింది. మావోయిస్టులకు చెందిన ఈ మూడు డంప్‌ల్లోనూ భారీ మొత్తం లో పేలుడు పదార్థాలు, ఆయుధాలు, విప్లవ సాహిత్యం, యూనిఫాంలు, ఇతర సామగ్రి లభ్యమైన సంగతి తెలిసిందే. రహస్యంగా డంప్‌ల కోసం వెతుకుతున్న ముఠాల చేతికి ఇంత వరకు డబ్బు దొరికిన ఆనవాళ్లు లేకపోయిన అదే తంతుగా వేటను సాగిస్తున్నారు.
అన్వేషణ
Published Wed, Sep 10 2014 12:26 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement