ఉత్తమ పోలీస్ అధికారులు చిరంజీవులు | Best Police Officers day in tenali | Sakshi
Sakshi News home page

ఉత్తమ పోలీస్ అధికారులు చిరంజీవులు

Published Sun, Sep 4 2016 7:15 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

Best Police Officers day in tenali

-ప్రజలు ఎప్పుడూ మరచిపోలేరు
-ఐపీఎస్ అధికారి ఉమేష్‌చంద్ర దీనికి నిదర్శనం
- సంస్మరణ సభలో గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్
తెనాలి

 తమకు మంచి చేసిన పోలీసు అధికారులను ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని, అందుకు ఐపీఎస్ అధికారి ఉమేష్‌చంద్ర నిదర్శనమని గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ చెప్పారు. మావోయిస్టుల కాల్పుల్లో మృతిచెందిన యువ ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేష్‌చంద్ర 17వ వర్ధంతి రోజయిన ఆదివారం తెనాలిలో సంస్మరణ సభను నిర్వహించారు. ఏటా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర విభజనతో స్వస్థలమైన తెనాలికి మార్పుచేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌తో కలిసి ఇక్కడి చెంచుపేటలోని తెనాలి-నారాకోడూరు రోడ్డులోగల ఉమేష్‌చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పద్మావతి కళ్యాణమండపంలో సంస్మరణసభకు ఉమేష్‌చంద్ర తండ్రి సి.వేణుగోపాలరావు స్వాగతం పలికారు. ఐజీ సంజయ్ ప్రసంగిస్తూ... అధికారిగా మావోయిస్టులను ఎదుర్కొనే వ్యూహాలనే కాకుండా ప్రత్యేకంగా కళాబృందాలను ఏర్పాటుచేసి ప్రజాచైతన్యానికి ఉమేష్‌చంద్ర కృషిచేసినట్టు చెప్పారు. ప్రజలు సంక్షేమానికి, శాంతిభద్రతల పరిరక్షణకు, పోలీసు ఉద్యోగుల సంక్షేమానికి కూడా తనదైన ప్రత్యేకతతో పనిచేశారని వివరించారు. ఉమేష్‌చంద్ర స్ఫూర్తితో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ పోలీసు విధులు నిర్వర్తించాలని సూచించారు. ట్రైనీ అధికారిగా వున్నపుడు ఉమేష్‌చంద్రను కలిసిన జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి తన ప్రసంగంలో ఉమేష్‌చంద్ర ధైర్యసాహసాలను కొనియాడారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ, గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ నారాయణ నాయక్, అదనపు ఎస్పీ రామాంజనేయులు, తెనాలి ఆర్డీవో జి.నర్సింహులు తమ ప్రసంగాల్లో ఉమేష్‌చంద్ర సేవలను ప్రశంసించారు. నేటితరం యువత, పోలీసులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తొలుత రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉత్తమంగా విధులు అందిస్తున్న వివిధ కేటగిరిల పోలీసు ఉద్యోగులు, అధికారులను అతిధుల చేతులమీదుగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ప్రొబెషనరీ పోలీసులు 90 మంది ప్రత్యేకంగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాధ్, వివిధ రంగాల ప్రముఖులు కొత్త సుబ్రహ్మణ్యం, నన్నపనేని సుధాకర్, కొడాలి సుదర్శనబాబు, కంభంపాటి క్రాంతి, నిమ్మగడ్డ జనార్ధనరావు, ఉమేష్‌చంద్ర సతీమణి నాగరాణి, కుమారుడు భరత్ మోహన్ చంద్ర హాజరయ్యారు. కుటుంబసభ్యులు చదలవాడ హరినారాయణ, భుజంగరావు (చిన్నా), చదలవాడ సతీష్‌చంద్ర పర్యవేక్షించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement