డంప్ కలకలం | possession of explosive substances | Sakshi
Sakshi News home page

డంప్ కలకలం

Published Sun, May 25 2014 12:49 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

possession of explosive substances

బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : మావోయిస్టులకు చెందిన మరో డంప్ శనివారం పోలీసులకు లభ్యమైంది. డంప్‌లోని మారణాయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన తూర్పు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బెల్లంపల్లి పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని కాసిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో లభ్యమైన డంప్‌లో భారీగా మారణాయుధాలు, పేలుడు పదార్థాలు ఉన్నాయి.

చెరువు పైభాగంలోని భూగర్భంలో ఆరు గ్రేనెడ్లు, నాలుగు టిఫిన్ బాంబులు, నాలుగు ఎస్‌బీఎంఎల్ తుపాకులు, ఆరు ఎస్‌బీబీఎల్ బ్యారెల్స్, పాయింట్ 38 రివాల్వర్, ఏడు లైవ్‌రౌండ్స్, నాలుగు పాయింట్ త్రినాట్‌త్రీ రైఫిల్స్ మ్యాగ్జిన్స్, మూడు మ్యాగ్జిన్ బాక్సులు, 23 ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, నాలుగు స్ప్రింగ్స్, ఐదు పిన్‌బోల్ట్స్, తొమ్మిది టీ టైప్ పిన్‌బోల్ట్స్ దాచి ఉంచారు. కొన్నేళ్ల క్రితం దాచడంతో ప్రస్తుతం అవి పూర్తిగా తప్పుపట్టి పనికి రాకుండా తయారయ్యాయి. మావోయిస్టుల కదలికలు ఏమాత్రం లేకపోయినా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచడంతో డంప్ లభ్యమైంది.

  2013 జనవరి నెలలోనూ బెల్లంపల్లి పోలీసులు మావోయిస్టుల డంప్‌ను కనిపెట్టారు. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి-మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో పక్కా సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించి డంప్‌ను కనుగొన్నారు. చెట్ల పొదల్లో గోతులు తవ్వి పెద్ద సైజ్ స్టీల్ డబ్బాల్లో దాచిపెట్టిన సుమారు 1600 జిలెటిన్‌స్ట్రిక్స్, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు.
 
2013 జనవరి 29న బెజ్జూర్ మండలం ప్రాణహిత సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు ఐదుగురు మావోయిస్టు కొరియర్లు, సానుభూతిపరులను అరెస్ట్ చేశారు. సరిహద్దు ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా అటవీ ప్రాంతంలోని మురళిగూడ వద్ద ఎనుముల వెంకటి(అగర్‌గూడ), మడె శంకర్, తలండి గణపతి(లోహ), ఎ.రమేశ్‌రెడ్డి(మంగెనపల్లి), ఎ.రోషిరెడ్డి(రాజారాం) అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని సోదాచేశారు.

 వీరి వద్ద 8 ఎంఎం రౌండ్స్ 44, 22 జిలెటిన్ స్టిక్స్, ఏడు డిటోనేటర్లు లభించాయి. మావోయిస్టు జిల్లా కార్యదర్శి మైలారపు అడెళ్లు ఉరఫ్ భాస్కర్‌ను సరిహద్దు అటవీ ప్రాంతంలో కలిసి తిరిగి వస్తుండగా ఐదుగురు పోలీసులకు చిక్కారు. అదే ఏడాది మే 12న తిర్యాణి మండలం పంగిడి మాదారం పంచాయతీ పరిధి లొద్దిగూడ అటవీ ప్రాంతంలో మరో డంప్‌ను పోలీసులు కనుగొన్నారు. ఆ డంప్‌లో పోలీసులకు పెద్ద మొత్తంలో విద్యుత్ వైర్ల బెండల్స్, ఆలీవ్‌గ్రీన్ దుస్తులు, మందులు, 303, 9ఎంఎం రౌండ్స్ 200లకుపైగా లభించాయి.

 అప్రమత్తతతోనే..
 మావోయిస్టుల కదలికలు జిల్లాలో అంతగాలేకపోయిన పోలీసు బలగాలు మాత్రం నిత్యం అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో మావోయిస్టులు పట్టు సాధించకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలం ప్రాణహిత నదీ తీరం వెంట గస్తీని ముమ్మరం చేసి సరిహద్దు ప్రాంతం నుంచి మావోయిస్టులు జిల్లాలో చొరబడకుండా నిరంతరం పహారా కాస్తున్నారు. మావోయిస్టుల అలికిడి ఏమాత్రం వినిపించిన పోలీసు బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించి శాంతిభద్రతలకు భంగం కలగకుండా వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మర్ వ్యవస్థను అప్రమత్తం చేయడంతో డంప్‌లు స్వాధీనం అవుతున్నాయి.

 మావోల డంప్‌లు ఎన్నో ఉన్నాయి : ఎస్పీ
 జిల్లా సేఫ్‌జోన్‌గా భావించి మావోయిస్టులు అటవీ ప్రాంతంలో ఇబ్బడిముబ్బడిగా డంప్‌లు దాచిపెట్టారని జిల్లా ఎస్పీ గజరావుభూపాల్ తెలిపారు. శనివారం బెల్లంపల్లిలోని అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టుల డంప్‌లు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయని తెలిపారు. ఎన్నో ఏళ్ల క్రితం మావోయిస్టులు డంప్ దాచారని అన్నారు. జిల్లాలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో మావోయిస్టులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారని పేర్కొన్నారు. అడపాదడపా ఆర్గనైజేషన్ చేయడానికి మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నా ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నామని అన్నారు.

రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారి జిల్లాలో రావడానికి మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మావోయిస్టులకు జిల్లాలో చొరబడే అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణలో రాబోయే ప్రభుత్వం కూడా మావోయిస్టుల పట్ల కఠినంగానే వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్‌భూషణ్, మందమర్రి సీఐ విజయ్‌కుమార్, దేవాపూర్ ఎస్సై జె.సురేశ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement