బాలాజీనగర్‌కు చిరుతల భయం
తిరుమలలో చిరుతల సంచారం పెరిగిపోయింది. బాలాజీనగర్ వాసులు కంటి మీద కునుకులేకుండా భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సివస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
తిరుమల: బాలాజీనగర్‌లోని తూర్పు ప్రాంతంలో మూడు చిరుతలు సంచరిస్తున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి కాకుల కొండ మీదుగా డంపింగ్‌యార్డ్ వద్ద అవి తిరుగుతాయి. చీకటి పడిన తర్వాత స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ తూర్పు ప్రాంతానికి చేరుకుంటాయి. రాత్రి 10 గంటలకు జనం చప్పుడు తగ్గిన తర్వాత రాకపోకలు సాగిస్తున్నాయి. గంటల తరబడి తూర్పు ప్రాంతం నుంచి పాచికాల్వ గంగమ్మ గుడి ప్రాంతం వరకు ఉండే ఇళ్ల ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరిగిపోయింది.
పొంచిఉన్న ప్రమాదం
బాలాజీనగర్ ప్రాంతంలో పగలు, రాత్రి లేకుండా చిరుతలు సంచరిస్తున్నాయి. ఇవి ఎవరిపైనైనా దాడి చేసే అవకాశం ఉంది. బాలాజీనగర్ వాసులు తూర్పుప్రాంతంలోని నీటి గుంట వద్ద బట్టలు ఉతికేందుకు వెళుతుంటారు. ఆ ప్రాంతం అంతా దట్టమైన చెట్లు, ముళ్ల పొదలతో నిండి ఉంది.
సీసీ కెమెరా పెట్టే ఆలోచనలో ఫారెస్ట్ అధికారులు
ఇటీవల కాలంలో చిరుతల సంచారం పెరిగిపోవడంతో సీసీ కెమెరాలు పెట్టాలని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. నిత్యం అవి వచ్చివెళ్లే దారుల్లో సీసీ కెమెరాలు పెట్టి వాటి జాడలు గుర్తించాలని అధికారులు నిర్ణయించారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. చిరుతల సంచారం నిర్దారించాక పరిస్థితి అధికమిస్తే వాటిని పట్టుకునేందు ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.