ఆవిర్భవించిన బెల్లంపల్లి
90 దశాబ్దాల క్రితం కుగ్రామం..
బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. బొగ్గు పుట్టుకతో బెల్లంపల్లి ఆవిర్భవించింది. నల్ల బంగారం నేలగా ప్రసిద్ధిగాంచిన బెల్లంపల్లి తొమ్మిది దశాబ్దాల క్రితం కుగ్రామంగా ఉండేది. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటైంది. 90 ఏళ్ల ప్రస్థానంలో బెల్లంపల్లి ఎన్నో మైళ్లు రాళ్లను అధిగమించి ప్రత్యేకతను ఏర్పర్చుకుంది.
బొగ్గు గనుల అంకురార్పణతో..
బెల్లంపల్లి ప్రాంతం బొగ్గు గనుల అంకురార్పణతో వెలుగుచూసింది. బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త సర్‌విలియం కింగ్ అన్వేషణ ఫలించి ఈ ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. సింగరేణి చరిత్రలో ప్రప్రథమంగా ఖమ్మం జిల్లా ఇల్లెందులోని సింగరేణి గ్రామంలో నల్ల బంగారం కనుగొనగా, ఆతర్వాత బెల్లంపల్లిలోనే బొగ్గు పుట్టుక ఆరంభమైంది. 1926 ప్రాంతంలో బొగ్గు అన్వేషణ సాగించి 1927 నుంచి బెల్లంపల్లిలో బొగ్గు గనుల తవ్వకాలు చేపట్టారు. ప్రప్రథమంగా మార్గన్స్‌ఫిట్ గనితో ఇక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించారు. ఆతర్వాత అనేక గనులు విస్తరించి బెల్లంపల్లి సింగరేణికి తలమాణికంగా బాసిల్లింది. ఆ తీరుగా బెల్లంపల్లి పారిశ్రామికంగా రూపాంతరం చెందింది.
అనుబంధ గ్రామంగా చంద్రవెల్లి..
బొగ్గు గనులు విస్తరించి వేలాది మంది కార్మికులతో వృద్ధిలోకి వచ్చిన బెల్లంపల్లి 30 ఏళ్ల క్రితం వరకు ఓ కుగ్రామంగా ఉండేది. బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి జీపీలో అనుబంధ గ్రామంగా కొనసాగింది. 1981లో జరిగిన చంద్రవెల్లి జీపీ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు ఉన్న బెల్లంపల్లి కార్మిక క్షేత్రం నుంచి పోటీచేసిన కార్మికనేత చిప్ప నర్సయ్య సర్పంచ్‌గా విజయం సాధించారు.
ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత 1987లో బెల్లంపల్లిని అప్పటి ప్రభుత్వం ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా ప్రకటించింది. ఆ ప్రకారంగా దశాబ్దాల అనుబంధం కలిగిన చంద్రవెల్లి గ్రామపంచాయతీ నుంచి బెల్లంపల్లి వేరు పడింది. ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బెల్లంపల్లి ప్రముఖ పట్టణంగా ఉండేది. ఆసిఫాబాద్ ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బెల్లంపల్లికి చెందిన దాసరి నర్సయ్య(కాంగ్రెస్), గుండా మల్లేశ్(సీపీఐ), ఎ.శ్రీదేవి, పి.సుభద్ర(టీడీపీ) నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొంది ప్రత్యేకతను చాటుకున్నారు. 2009లో జరిగిన పునర్విభజనలో బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటైంది.
జిల్లా కోసం పోటీ పడి..
నూతన జిల్లాల పునర్విభజనలో బెల్లంపల్లి జిల్లా కేంద్రం కోసం మంచిర్యాలతో పోటీ పడింది. మౌలిక సదుపాయాలు, ఇతర వనరులు పుష్కలంగా ఉన్న బెల్లంపల్లిని జిల్లా చేయాలని ఈ ప్రాంత ప్రజలు పట్టుబట్టిన ప్రభుత్వం మాత్రం నిరాకరించింది. రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో నూతన జిల్లా కోసం పోటీపడిన బెల్లంపల్లి ఎట్టకేలకు రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటైంది. బొగ్గుగనుల తవ్వకాలతో మొదలైన బెల్లంపల్లి ప్రస్థానం క్రమక్రమంగా రెవెన్యూ డివిజన్ స్థాయికి చేరుకుంది.
బొగ్గు గనుల పుట్టుకతో..
Published Sat, Oct 15 2016 12:07 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
Advertisement
Advertisement