
ఎన్నికల విధులకు వెళ్లి.... అదృశ్యమైంది
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించడానికి వచ్చి న ఓ మహిళా ఉపాధ్యాయురాలు అదృశ్యమైంది. ఈ సంఘటన గురువారం వెలుగు చూసింది. వన్‌టౌన్ అదనపు ఎస్సై సుధాకర్ కథనం ప్రకారం.. ఆసిఫాబాద్‌లోని సందీప్‌నగర్‌కు చెందిన వివాహిత దురువ శైలజ అదే మండలంలోని మోవాడ్ ప్రభుత్వ పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు బెల్లంపల్లిలోని రాంనగర్ పోలింగ్ కేంద్రంలో డ్యూటీ వేశారు.
ఈ మేరకు శైలజ గత నెల 29న తోటి ఉద్యోగులతో కలిసి వచ్చి 30న ఎన్నికల విధులు నిర్వర్తించింది. అదే రోజు సాయంత్రం తన తల్లి విజయలక్ష్మీతో సెల్‌ఫోన్‌లో మాట్లాడింది. సాయంత్రం 6 గంటల తర్వాత విధులు ముగించుకుని ఎవరికీ కనిపించకుండా పోయింది. ఎన్నికల విధులకు వెళ్లిన కూతురు ఇంటికి రాకపోవడంతో శైలజ తల్లిదండ్రులు మిత్రులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో శైలజ తండ్రి దురువ శంకర్ గురువారం రాత్రి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.