బొగ్గు అక్రమ రవాణా గుట్టు రట్టు | coal smuggling opened | Sakshi
Sakshi News home page

బొగ్గు అక్రమ రవాణా గుట్టు రట్టు

Published Thu, Aug 21 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

coal smuggling opened

బెల్లంపల్లి : బెల్లంపల్లి ఏరియాలో మరో బొగ్గు అక్రమ రవాణా వ్యవహారం వెలుగుచూసింది. తప్పుడు (నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్)ఎన్‌వోసీతో బొగ్గును అక్రమంగా తరలించేందుకు చేసిన యత్నాలు వెలుగుచూడటం బెల్లంపల్లి ఏరియాలో కలకలం రేపింది. ఈ ఘటనపై సింగరేణి విజిలెన్స్ విభాగం అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. బెల్లంపల్లి ఏరియాలోని రేచిని రోడ్ రైల్వేస్టేషన్ నుంచి కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీసీఎల్)కు ఆనంద్ ట్రాన్స్‌పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ బొగ్గు రవాణా చేసేందుకు కాంట్రాక్ట్‌ను చేజిక్కించుకుంది.

 ప్రస్తుతం ఆ ట్రాన్స్‌పోర్టు సంస్థ కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు బొగ్గును రవాణా చేసేందుకు గోదావరి ఎంటర్‌ప్రైజెస్‌కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లు తెలిసింది. ఆనంద్ ట్రాన్స్‌పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీదనే గోదావరి ఎంటర్‌ప్రెజైస్ బొగ్గు సరఫరా చేస్తోంది. ఎప్పటి మాదిరిగానే ఈ నెల 17వ తేదీన కేపీసీఎల్‌కు బొగ్గును సరఫరా చేసేందుకు సింగరేణి నుంచి 924 నంబర్‌తో  ఎన్‌ఓసీ తీసుకుంది. ఆ ప్రకారంగా ఒక రేక్ (54 వ్యాగన్లు కలిగిన గూడ్స్ రైలు) 4 వేల టన్నుల బొగ్గును లోడ్ చేసి రవాణాకు సిద్ధం చేసుకుంది.

అంతలోనే రైల్వే అధికారులు ఎందుకో అనుమానం వచ్చి సదరు ట్రాన్స్‌పోర్టు సంస్థ అందజేసిన ఎన్‌వోసీని నిశితంగా పరిశీలించారు. ఆ ఎన్‌వోసీపై వైట్నర్‌తో దిద్ది కేపీసీఎల్‌కు బదులు కేపీవీటీ అని రాసి ఉండటంతో బొగ్గు రవాణా చేసేందుకు రైల్వే అధికారులు నిరాకరించారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెంటనే సింగరేణి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ అక్రమ బొగ్గు రవాణా వ్యవహారం బయట పడింది. వెంటనే స్పందించిన సింగరేణి అధికారులు రేచిని రోడ్ రైల్వేస్టేషన్‌కు వచ్చి సదరు ఎన్‌వోసీని పరిశీలించి అందులో దిద్దుబాటు జరిగినట్లు రూడీ చేసుకున్నారు.

ఫార్వర్డ్ నోట్, ఇండెంట్ కాపీలపై కేపీసీఎల్ రాసి ఉండటంతో ఆ తర్వాత ఏరియా ఎస్‌వోటూ జీఎం సంతకంతో మరో ఎన్‌వోసీ తయారు చేయించి కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు లోడ్ చేసిన రేక్‌లోడ్ బొగ్గును అదే రోజు రాత్రి పంపిం చేశారు. ఆ ఎన్‌వోసీని ఎవరి ప్రోద్బలంతో వైట్నర్ పెట్టి దిద్దారో, ఈ వ్యవహారం వెనుక ఎందరు సింగరేణి అధికారుల హస్తం ఉందో అనేది చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు ఇలాగే ఎన్ని రేక్‌ల బొగ్గు అక్రమ రవాణా జరిగిందనేది ప్రశ్నార్థకంగా మారింది. బెల్లంపల్లి ఏరియాలో రూ.కోట్లు విలువ చేసే బొగ్గు అక్రమ రవాణా జరిగిన విషయం ఇంకా మరువకముందే తాజాగా మరో ఘటన వెలుగుచూడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

 విచారణ చేస్తున్న విజిలెన్స్ అధికారులు
 తప్పుడు ఎన్‌వోసీతో బొగ్గు రవాణాకు యత్నించిన ఘటనపై సింగరేణి విజిలెన్స్ విభాగం అధికారులు ముమ్మర  దర్యాప్తు చేస్తున్నారు. సింగరేణి విజిలెన్స్ ఏజీఎం నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో బుధవారం రేచిని రోడ్ రైల్వేస్టేషన్, సదరు ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి వెళ్లి రికార్డులు పరిశీలించారు. దిద్దుబాటు చేసిన ఎన్‌వోసీని స్వాధీనం చేసుకొని దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ ఘటనపై సింగరేణి డెరైక్టర్(పా) విజయ్‌కుమార్ సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. గురువారం విజిలెన్స్ అధికారులు దర్యాప్తు నివేదికను డెరైక్టర్(పా)కు నివేదించనున్నట్లు తెలుస్తోంది. నిజాయితీ కలిగిన అధికారులతో దర్యాప్తు చేయిస్తే ఈ అక్రమ బొగ్గు రవాణా గుట్టు వెలుగుచూసే అవకాశాలు ఉన్నట్లు కార్మికులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement