no objection certificate
-
Rahul Gandhi: పాస్‌పోర్టు కోసం.. లైన్ క్లియర్
సాక్షి, ఢిల్లీ: పాస్‌పోర్టు వ్యవహారంలో.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టు ఊరట ఇచ్చింది. మూడు సంవత్సరాలపాటు సాధారణ(రెగ్యులర్) పాస్‌పోర్ట్ పొందేందుకు అనుమతిస్తూ శుక్రవారం ఎన్వోసీ ఆదేశాలు జారీ చేసింది. ఎంపీగా పార్లమెంట్ అనర్హత వేటు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ.. తన డిప్టోమేటిక్ పాస్‌పోర్ట్‌ను తిరిగి అప్పగించారు. పాస్పోర్టుతో పాటు అన్ని రకాల ప్రయాణ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. అనంతరం కొత్త పాస్‌పోర్టు(సాధారణ) దరఖాస్తు చేసుకునేందుకు నో అబ్జక్షన్ సర్టిఫికేట్(NOC) కోసం రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారాయన. అందుకు కారణం.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన నిందితుడిగా ఉండడమే. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన మనీలాండరింగ్, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసు ఇది. దీంతో రెగ్యులర్ పాస్‌పోర్టు కోసం ఆయన ఎన్వోసీ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ఇవాళ కోర్టు ఆదేశాలిస్తూ అయితే రాహుల్ కోరినట్లు పదేళ్లకు కాకుండా మూడేళ్లకు మాత్రమే సాధారణ పాస్‌పోర్ట్ కోసం ఎన్వోసీ ఇస్తున్నట్లు తెలిపింది. Delhi's Rouse Avenue Court partly allows Congress leader Rahul Gandhi's plea seeking NOC for issuance of a fresh ordinary passport. The court has granted NOC for 3 years. pic.twitter.com/laElsJqELR — ANI (@ANI) May 26, 2023 అంతకు ముందు బుధవారం విచారణ సందర్భంగా.. పాస్‌పోర్టు నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోరుతూ గాంధీ చేసిన అభ్యర్థనపై శుక్రవారంలోగా సమాధానం ఇవ్వాలని బీజేపీ మాజీ ఎంపి స్వామిని కోర్టు కోరింది. ఇక ఇవాళ్టి తీర్పు సందర్భంగా.. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వైభవ్ మెహతా ప్రయాణించే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాణాలపై కోర్టు ఆంక్షలు విధించలేదని తెలిపింది. అలాగే.. 2015 డిసెంబరులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేస్తున్నప్పుడు, కోర్టు అతని ప్రయాణంపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని, ఆంక్షలు విధించాలంటూ స్వామి చేసిన విజ్ఞప్తిని ఆ సమయంలోనూ తిరస్కరించారని మేజిస్ట్రేట్ ఈ సందర్భంగా గుర్తు చేశారు కూడా. -
ఎన్వోసీ లభించక.. ఇంటికి చేరుకోలేక.. పాపం మనోడు
మోర్తాడ్ (బాల్కొండ): ఉపాధికోసం విజిట్ వీసాపై మలేసియాకు వెళ్లిన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెంకు చెందిన కూన గంగాధర్ పక్షవాతంతో మంచం పట్టాడు. వీసా గడువు ముగిసిపోవడంతో అతడిని ఇంటికి పంపించడానికి మలేసియా ప్రభుత్వం భారత విదేశాంగ శాఖ ద్వారా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)ను కోరుతోంది. అయితే ఎన్వోసీని జారీ చేయడంలో భారత విదేశాంగ శాఖ తాత్సారం చేయడంవల్ల అనారోగ్యంతో అవస్థలు పడుతున్న కూన గంగాధర్ ఇంటికి చేరుకోలేకపోతున్నాడు. గంగాధర్ నాలుగు నెలల క్రితం మలేసియాకు వెళ్లాడు. అక్కడ ఒక కంపెనీలో పని చేస్తున్నాడు. పదిహేను రోజుల కిందట పని ముగించుకుని తన గదికి చేరుకున్న తరువాత గంగాధర్‌కు పక్షవాతం వచ్చింది. దీంతో అతనితో పాటు ఉన్న తెలంగాణ వాసులు అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పక్షవాతంతో బాధపడుతున్న గంగాధర్‌ను ఇంటికి పంపించడానికి తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు యనమల వెంకటస్వామి, శుభ్రలు ప్రయత్నిస్తున్నారు. విజిట్ వీసాపై వెళ్లిన గంగాధర్ మలేసియాలో చట్టవిరుద్ధంగా ఉండిపోవడంతో అతడిని ఇంటికి పంపించడానికి రూ.25 వేల జరిమానా చెల్లించడంతో పాటు భారత రాయబార కార్యాలయం నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంది. జరిమానా చెల్లించడానికి బాధితుని పక్షాన తెలంగాణ వాసులు సిద్ధంగా ఉన్నారు. ఎన్వోసీ జారీ చేయడానికి విదేశాంగ శాఖ అధికారులు స్పందించకపోవడంతో పదిహేను రోజులుగా గంగాధర్ ఆస్పత్రిలోనే ఉండిపోయాడు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కూన గంగాధర్‌ను ఇంటికి పంపడానికి వేగంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. (క్లిక్ చేయండి: పాస్‌పోర్టులో ఇంటి పేరు ఉండాల్సిందే) -
బండి బదిలీ.. భలే బురిడీ
సాక్షి, హైదరాబాద్: వాహనాల యాజమాన్య బదిలీల్లో అక్రమాల దందా కొనసాగుతోంది. ఆలస్యంగా నమోదయ్యే వాహనాలపై పెనాల్టీలు విధించాల్సి ఉండగా కొందరు ఆర్టీఏ అధికారులు దళారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా వాహనాలు ఒకరి నుంచి ఒకరికి యాజమాన్య బదిలీ చేసేందుకు మోటారు వాహన నిబంధనల ప్రకారం 30 రోజుల గడువు విధిస్తారు. గడువులోపు కొనుగోలు చేసిన వాహనదారు తనకు విక్రయించిన వ్యక్తి నుంచి నిరభ్యంతర పత్రం (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకొని తన పేరిట వాహనాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. కానీ కొందరు వాహనదారులు ఎన్ఓసీ తీసుకున్న తర్వాత కొన్ని నెలల పాటు వాహనాలను తమ పేరిట నమోదు చేసుకోకుండానే తిరుగుతున్నారు. ఇలా వాహన యాజమాన్య బదిలీ కాకుండా తిరిగే వాహనాలపై ఎన్ఓసీలు జారీ చేసినప్పటి నుంచి నమోదయ్యే గడువు వరకు పెనాలిటీలు విధిస్తారు. ఇది ద్విచక్ర వాహనాలకు నెలకు రూ.300, కార్లకు రూ.500 చొప్పున ఉంటుంది. కొంతమంది వాహనదారులు ఎన్ఓసీలు తీసుకొన్న తర్వాత కూడా సకాలంలో వాహనాలను బదిలీ చేసుకోకపోవడంతో భారీ మొత్తంలో పెనాల్టీలు చెల్లించాల్సి వస్తోంది. ఇక్కడే కొందరు ఆర్టీఏ సిబ్బంది దళారులతో కలిసి చక్రం తిప్పుతున్నారు. వాహనదారులు చెల్లించాల్సిన పెనాల్టీలను నామమాత్రంగా విధించి మిగతా మొత్తాన్ని జేబులో వేసుకుంటున్నారు. ఎన్ఓసీ తీసుకున్న తర్వాత నెలల తరబడి నమోదు కాకుండా తిరిగే వాహనాలపై సగటున రూ.5000 నుంచి రూ.10,000 వరకూ పెనాల్టీలు నమోదవుతాయి. కానీ దాన్ని రూ.1000కు పరిమితం చేస్తున్నట్లు తెలిసింది. (చదవండి: ఆసియాలోనే తొలిసారిగా ‘థోరాసిక్ రోబోటిక్ సర్జరీ’) -
పీవీఆర్, ఐనాక్స్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజాలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ మధ్య విలీనానికి స్టాక్ ఎక్సే్ఛంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అనుమతించాయి. రెండు ఎక్సే్ఛంజీలూ ఇందుకు నో అబ్జక్షన్ ప్రకటించినట్లు పీవీఆర్, ఐనాక్స్ లీజర్ పేర్కొన్నాయి. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), ఇతర నియంత్రణ సంస్థల నుంచి పీవీఆర్, ఐనాక్స్ లీజర్ విలీనానికి తొలుత స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు అనుమతించవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ ఏడాది మార్చి 27న రెండు సంస్థలూ విలీన అంశాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. విలీన కంపెనీ 1,500కుపైగా తెరలతో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్‌గా ఆవిర్భవించనుంది. సంయుక్త సంస్థను పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్‌గా వ్యవహరించనున్నారు. ఈ వార్తల నేపథ్యంలో పీవీఆర్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 6 శాతం దూసుకెళ్లి రూ. 1,788 వద్ద నిలవగా.. ఐనాక్స్ లీజర్ 5.3 శాతం జంప్‌చేసి రూ. 482 వద్ద ముగిసింది. -
Akasa Air: ఝున్‌ఝున్‌వాలాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Akasa Airlines Rakesh Jhunjhunwala: కొత్త విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్’కు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇన్వెస్ట్మెంట్ గురు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మద్దతు ఉన్న ఈ సంస్థకు.. పౌర విమానయాన శాఖ ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)’ జారీ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. దీనితో 2022 వేసవి నాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని ఆకాశ ఎయిర్ హోల్డింగ్ సంస్థ ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది. ‘ఎన్వోసీ జారీ చేసినందుకు, మద్దతుగా నిలుస్తున్నందుకు పౌర విమానయాన శాఖకు ధన్యవాదాలు‘ అని ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే తెలిపారు. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్ చేస్తున్న ఆకాశ ఎయిర్ బోర్డులో ప్రైవేట్ రంగ ఎయిర్‌లైన్స్ దిగ్గజం ఇండిగో మాజీ ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ కూడా ఉన్నారు. సీఈవోగా నియమితులైన దూబే గతంలో జెట్ ఎయిర్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఎయిర్‌బస్, బోయింగ్‌తో చర్చలు జరుపుతోందని సమాచారం. వచ్చే నాలుగేళ్లలో సుమారు 70 విమానాలను ఆపరేట్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. చదవండి: బిగ్‌బుల్‌ను కలిశా.. సంతోషం: ప్రధాని మోదీ ఇదీ చదవండి: ఝున్‌ఝున్‌వాలా ఏం చేయబోతున్నాడు? సర్వత్రా ఆసక్తి -
ఐపీఎల్: ఆసీస్ ఆటగాళ్లకు సీఏ కీలక సూచన
సిడ్నీ: ఐపీఎల్ 14వ సీజన్లో పాల్గొనేందుకు తమ ఆటగాళ్లను అనుమతిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తాత్కాలిక సీఈవో నిక్ హాక్లీ బుధవారం తెలిపాడు. అయితే ఆటగాళ్లు ఐపీఎల్లో పాల్గొనాలంటే ఎన్వోసీ(నిరభ్యంతర పత్రం) తప్పనిసరిగా పొందాలంటూ పేర్కొన్నాడు. ఐపీఎల్ ప్రారంభ సమయానికి ఆటగాళ్లకు గాయాల సమస్యలు ఉంటే తప్ప ఎన్వోసీ జారీ చేయడంలో ఎటువంటి సమస్య ఉండబోదని సీఏ స్పష్టం చేసింది. కాగా ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికా టూర్‌ను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో కరోనా స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా పర్యటనను నిరవదిక వాయిదా వేసుకున్నట్లు సీఏ ఇప్పటికే తెలిపింది. కాగా ఆసీస్ జట్టుకు న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ తర్వాత ఐపీఎల్ ముగిసేవరకు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. దీంతో ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్ పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. చదవండి: 'నేను కావాలని చేయలేదు.. క్షమించండి' గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌కు ఆస్ట్రేలియా నుంచి 20 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. కాగా ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా ఐపీఎల్ మినీ వేలం జరగనుంది.. ఈ వేలంలో ఆసీస్ ఆటగాళ్లైన స్మిత్, మ్యాక్స్‌వెల్, ఆరోన్ ఫించ్‌లకు మంచి ధర దక్కే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఐపీఎల్ ఎప్పుడు నిర్వహించాలనేదానిపై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్‌లో బిజీ కానుంది.ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్ మార్చి 28తో ముగియనుంది. దీంతో వారం వ్యవధిలో.. అంటే ఏప్రిల్ మొదటి వారంలో ఐపీఎల్ 2021 జరిగే అవకాశం ఉంది. కాగా ఈసారి ఐపీఎల్‌ను మాత్రం స్వదేశంలోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. మొత్తం 8 జట్టు ఉండడంతో ఇంటా బయటా నిర్వహించాల్సి రావడంతో వేదిక విషయంలో తర్జన భర్జన పడుతుంది. చదవండి: ఆ రికార్డు బంగ్లా క్రికెటర్‌కే సాధ్యమైంది -
1,456 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు షాక్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 1,456 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఈసారి అనుబంధ గుర్తింపు లభించే పరిస్థితి లేకుండాపోయింది. అగ్నిమాపక శాఖ తమ నిబంధనలను మార్పు చేయడంతో వాటిన్నింటికి ఆ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇచ్చే పరిస్థితి లేదు. ఫైర్ ఎన్వోసీ లేకుండా ఇంటర్మీడియట్ బోర్డు కాలేజీలను నడిపేందుకు అనుబంధ గుర్తింపును జారీ చేసే పరిస్థితి లేదు. దీంతో ఆయా కాలేజీల పరిస్థితి గందరగోళంలో పడింది. దీనిపై ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సాయంత్రం అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామ్‌చంద్రన్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్‌తో ఉన్నత స్థాయి కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. అందులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో సమావేశం అర్ధంతరంగానే ముగిసింది. అయితే రాష్ట్రంలో 1,586 కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీలుంటే అందులో కేవలం 130 కాలేజీలు మాత్రమే అగ్నిమాపక శాఖ తాజా నిబంధనల ప్రకారం ఉండటంతో వాటికి మాత్రమే ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపునిచ్చే అవకాశముంది. మిగతా 1,456 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించే అవకాశం లేకుండా పోయింది. అసలేం జరిగిందంటే.. రాష్ట్రంలో 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న విద్యా సంస్థల భవనాలకు ఫైర్ ఎన్వోసీ అవసరం లేదని, అంతకంటే ఎక్కువ ఎత్తున్న భవనాలకే ఫైర్ ఎన్వోసీ అవసరమని అగ్నిమాపక శాఖ 2017లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ గతేడాది హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ కేసులో వాదనల సందర్భంగా అంతకుముందు ఉన్న ఉత్తర్వులను సవరిస్తున్నామని, 6 మీటర్లలోపు ఎత్తు మాత్రమే ఉన్న భవనాలకు ఎన్వోసీ ఇస్తామని, అంతకంటే ఎత్తున్న భవనాలకు ఎన్వోసీ ఇవ్వబోమని ఉత్తర్వులను సవరించింది. ఈ మేరకు 2020 ఫిబ్రవరి 22న సవరణ ఉత్తర్వులను జారీ చేసింది. అదే విషయాన్ని హైకోర్టుకు తెలియజేసింది. అయితే 2020–21 విద్యా సంవత్సరంలో కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఫైర్ ఎన్వోసీ లేకుండాపోయింది. 1,456 కాలేజీలు 6 మీటర్లకంటే ఎక్కువ ఎత్తున్నవే. వాటికి అగ్నిమాపక శాఖ ఫైర్ ఎన్వోసీ జారీ చేయలేదు. దీంతో యాజమాన్యాలు బోర్డు అధికారులకు, విద్యాశాఖ మంత్రికి పలుమార్లు విన్నవించారు. దీంతో మంత్రి మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు చేరే ఆ కాలేజీలకు ఫైర్ ఎన్వోసీ లేకుండా, అనుబంధ గుర్తింపు ఇవ్వకుండా కొనసాగించడం ఎలా అన్న దానిపై చర్చించారు. అయితే తాము ఏమీ చేయలేమని, నిబంధనలను మార్పు చేసి హైకోర్టుకు విషయాన్ని చెప్పినందున ఆ నిబంధనలను ఇప్పుడు సవరించడం కుదరదని, నిబంధనల మేరకు ఉన్నవాటికే ఎన్వోసీ జారీ చేస్తామని అగ్నిమాపక శాఖ పేర్కొంది. కావాలనుకుంటే తమ ఉత్తర్వులను కోర్టులో సవాల్ చేయడం, లేదా కాలేజీలను ఫైర్ ఎన్వోసీ నుంచి మినహాయిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చుకొని ముందుకు సాగవచ్చని సూచించింది. అయితే ఫైర్ ఎన్వోసీ నుంచి మినహాయిస్తూ తాము ఉత్తర్వులు ఇవ్వలేమని, అలా ఇస్తే ఇరుక్కుంటామని విద్యాశాఖ కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్ పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో సమస్యకు పరిష్కారం లభించలేదు. దీనిపై సీఎంతో చర్చిస్తానని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. -
మలింగాకు లంక బోర్డు నో పర్మిషన్
కొలంబో: శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగా ఐపీఎల్లో ఆడే అవకాశాలు లేనట్టే. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకుగాను మలింగాకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇచ్చేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు తిరస్కరించింది. మలింగా ప్రస్తుత ఫిట్నెస్ పరిస్థితిని తెలుసుకోవాల్సిన అవసరముందని, ఆ తర్వాతే ఎన్ఓసీ ఇచ్చే విషయాన్ని నిర్ణయిస్తామని లంక క్రికెట్ బోర్డు చీఫ్ తిలంగ సుమతిపాల చెప్పారు. తమ అనుమతి లేకుండా మలింగా ఐపీఎల్లో ఆడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. తిలంగ సుమతిపాలకు, మలింగాకు మధ్య ఇటీవల సంబంధాలు దెబ్బతిన్నట్టు సమాచారం. టి-20 ప్రపంచ కప్‌నకు ముందు లంక కెప్టెన్ పదవి నుంచి మలింగాను తప్పించారు. ఈ టోర్నీకి మలింగా ఎంపికైనా ఫిట్నెస్ సమస్యలు చూపి జట్టు నుంచి వైదొలిగాడు. దీంతో ప్రధాన బౌలర్ లేకుండానే లంక ప్రపంచ కప్‌లో బరిలో దిగాల్సివచ్చింది. లంక ఓటమికి ఇది కూడా ఓ కారణం. -
ఒక్క ఎన్ఓసీ చాలు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇంటి నిర్మాణం అంటే మున్సిపల్ పర్మిషన్ నుంచి మొదలు పెడితే జలమండలి, అగ్ని మాపక, పోలీస్, విద్యుత్, కాలుష్య నియంత్రణ మండలి ఇలా దాదాపు 22 ప్రభుత్వ విభాగాల అనుమతి తీసుకోవాలి. దీంతో స్థిరాస్తి ప్రాజెక్టులకు నిరభ్యంతర ధృవీకరణ పత్రం (ఎన్ఓసీ) తీసుకోవడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతోంది. దీంతో ఒక్కో ప్రాజెక్ట్‌పై 40 శాతం వడ్డీ భారం పడుతోంది. అందుకే కనీసం 30 శాతం అధిక ధరకు ఫ్లాట్లను విక్రయించాల్సి వస్తోందని’’ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) చెబుతోంది. అదే గుజరాత్ (గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్- గిఫ్ట్)లో అయితే అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఒక్క ఎన్ఓసీ తీసుకుంటే సరిపోతుంది. దీంతో నిర్మాణ సంస్థలకు భారం తగ్గడంతో పాటు పరిశ్రమల స్థాపనకు దేశ, విదేశీ సంస్థలు ముందుకొస్తాయని క్రెడాయ్ అభిప్రాయపడింది. అదే మాదిరిగా మన రాష్ట్రంలోనూ ఒకే ఎన్ఓసీ, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ (ఈసీ)లను తీసుకునేలా ప్రభుత్వ విభాగాలను సమన్వయ పరచాలని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి కోరారు. ఈనెల 29 నుంచి 31 వరకు హైటెక్స్‌లో జరగనున్న స్థిరాస్తి ప్రదర్శన సందర్భంగా గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. {పాజెక్ట్ అనుమతులను పొందేందుకు ఏకగవాక్ష పద్ధతిని తీసుకురావాలి. దీంతో ధరలు 10 నుంచి 25 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ నిర్మించే ప్రాంతాన్ని డిజిటలైజేషన్ ద్వారా చూపించే వెసలుబాటును కల్పించాలి. దీంతో ఏ ప్రాంతంలో ఎంత ఎత్తులో నిర్మాణాలు చేపట్టాలో ఇట్టే తెలిసిపోతుంది. దీంతో అవినీతి తగ్గడమే కాకుండా సమయం వృథా కాదు. వైఫై, హెల్త్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, సినిమా వంటి సిటీల ఏర్పాటుకు రాష్ర్ట ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో నగరం నలువైపులా అభివృద్ధి చెందుతుంది. మెట్రో రైలును 200 కి.మీ. వరకూ పొడిగించడం, ఇప్పటికే ట్రయల్ రన్ ఆరంభం కావటంతో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ స్థిరాస్తి ప్రదర్శనలో 150 మంది బిల్డర్లు, డెవలపర్లు పాల్గొంటారు. దాదాపు రూ.35 లక్షల నుంచి రూ.2.5 కోట్ల విలువ గల ఫ్లాట్లు, విల్లాలు, స్థలాల వివరాలను తెలియజేస్తారు. ఈ సమావేశంలో క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ఎస్ రాంరెడ్డి, జాయింట్ సెక్రటరీ జీ రాంరెడ్డి, హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ జైవీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బొగ్గు అక్రమ రవాణా గుట్టు రట్టు
బెల్లంపల్లి : బెల్లంపల్లి ఏరియాలో మరో బొగ్గు అక్రమ రవాణా వ్యవహారం వెలుగుచూసింది. తప్పుడు (నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్)ఎన్వోసీతో బొగ్గును అక్రమంగా తరలించేందుకు చేసిన యత్నాలు వెలుగుచూడటం బెల్లంపల్లి ఏరియాలో కలకలం రేపింది. ఈ ఘటనపై సింగరేణి విజిలెన్స్ విభాగం అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. బెల్లంపల్లి ఏరియాలోని రేచిని రోడ్ రైల్వేస్టేషన్ నుంచి కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీసీఎల్)కు ఆనంద్ ట్రాన్స్‌పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ బొగ్గు రవాణా చేసేందుకు కాంట్రాక్ట్‌ను చేజిక్కించుకుంది. ప్రస్తుతం ఆ ట్రాన్స్‌పోర్టు సంస్థ కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు బొగ్గును రవాణా చేసేందుకు గోదావరి ఎంటర్‌ప్రైజెస్‌కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లు తెలిసింది. ఆనంద్ ట్రాన్స్‌పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీదనే గోదావరి ఎంటర్‌ప్రెజైస్ బొగ్గు సరఫరా చేస్తోంది. ఎప్పటి మాదిరిగానే ఈ నెల 17వ తేదీన కేపీసీఎల్‌కు బొగ్గును సరఫరా చేసేందుకు సింగరేణి నుంచి 924 నంబర్‌తో ఎన్ఓసీ తీసుకుంది. ఆ ప్రకారంగా ఒక రేక్ (54 వ్యాగన్లు కలిగిన గూడ్స్ రైలు) 4 వేల టన్నుల బొగ్గును లోడ్ చేసి రవాణాకు సిద్ధం చేసుకుంది. అంతలోనే రైల్వే అధికారులు ఎందుకో అనుమానం వచ్చి సదరు ట్రాన్స్‌పోర్టు సంస్థ అందజేసిన ఎన్వోసీని నిశితంగా పరిశీలించారు. ఆ ఎన్వోసీపై వైట్నర్తో దిద్ది కేపీసీఎల్‌కు బదులు కేపీవీటీ అని రాసి ఉండటంతో బొగ్గు రవాణా చేసేందుకు రైల్వే అధికారులు నిరాకరించారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెంటనే సింగరేణి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ అక్రమ బొగ్గు రవాణా వ్యవహారం బయట పడింది. వెంటనే స్పందించిన సింగరేణి అధికారులు రేచిని రోడ్ రైల్వేస్టేషన్‌కు వచ్చి సదరు ఎన్వోసీని పరిశీలించి అందులో దిద్దుబాటు జరిగినట్లు రూడీ చేసుకున్నారు. ఫార్వర్డ్ నోట్, ఇండెంట్ కాపీలపై కేపీసీఎల్ రాసి ఉండటంతో ఆ తర్వాత ఏరియా ఎస్వోటూ జీఎం సంతకంతో మరో ఎన్వోసీ తయారు చేయించి కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు లోడ్ చేసిన రేక్‌లోడ్ బొగ్గును అదే రోజు రాత్రి పంపిం చేశారు. ఆ ఎన్వోసీని ఎవరి ప్రోద్బలంతో వైట్నర్ పెట్టి దిద్దారో, ఈ వ్యవహారం వెనుక ఎందరు సింగరేణి అధికారుల హస్తం ఉందో అనేది చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు ఇలాగే ఎన్ని రేక్‌ల బొగ్గు అక్రమ రవాణా జరిగిందనేది ప్రశ్నార్థకంగా మారింది. బెల్లంపల్లి ఏరియాలో రూ.కోట్లు విలువ చేసే బొగ్గు అక్రమ రవాణా జరిగిన విషయం ఇంకా మరువకముందే తాజాగా మరో ఘటన వెలుగుచూడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. విచారణ చేస్తున్న విజిలెన్స్ అధికారులు తప్పుడు ఎన్వోసీతో బొగ్గు రవాణాకు యత్నించిన ఘటనపై సింగరేణి విజిలెన్స్ విభాగం అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. సింగరేణి విజిలెన్స్ ఏజీఎం నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో బుధవారం రేచిని రోడ్ రైల్వేస్టేషన్, సదరు ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి వెళ్లి రికార్డులు పరిశీలించారు. దిద్దుబాటు చేసిన ఎన్వోసీని స్వాధీనం చేసుకొని దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ ఘటనపై సింగరేణి డెరైక్టర్(పా) విజయ్‌కుమార్ సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. గురువారం విజిలెన్స్ అధికారులు దర్యాప్తు నివేదికను డెరైక్టర్(పా)కు నివేదించనున్నట్లు తెలుస్తోంది. నిజాయితీ కలిగిన అధికారులతో దర్యాప్తు చేయిస్తే ఈ అక్రమ బొగ్గు రవాణా గుట్టు వెలుగుచూసే అవకాశాలు ఉన్నట్లు కార్మికులు పేర్కొంటున్నారు. -
అగ్నిమాపక శాఖ అధికారి రూ.70 వేలు లంచం
కర్నూలు అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నర్సింగ్ హోం యజమాని నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటూ జిల్లా సహాయ అగ్నిమాపక శాఖ అధికారి(ఏడీఎఫ్‌ఓ) రామన్న బుధవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆదోని పట్టణానికి చెందిన డాక్టర్ బి.శ్రీనివాసులు స్థానికంగా 51 పడకలతో ఆదిత్య నర్సింగ్ హోం నిర్వహిస్తున్నాడు. వైద్యారోగ్య శాఖ నుంచి నర్సింగ్ హోంకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందాలంటే ముందుగా అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంది. ఇందుకు గత నెలలో కర్నూలు బీక్యాంప్‌లో ఉన్న అగ్నిమాపక శాఖ జిల్లా కార్యాలయంలో డాక్టర్ శ్రీనివాసులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా అగ్నిమాపక శాఖాధికారి, సహాయ అగ్నిమాపక శాఖాధికారి, ఆదోని ఫైర్‌ఆఫీసర్ కలిసి నర్సింగ్ హోంను తనిఖీ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు హైదరాబాద్ రీజినల్ కార్యాలయం అధికారులకు సిఫారసు చేయాల్సి ఉంది. అందుకోసం రూ.1.50 లక్షలు ఇవ్వాలని రామన్న డిమాండ్ చేశారు. తప్పని సరి పరిస్థితుల్లో డాక్టర్ శ్రీనివాసులు 1.20 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించి అడ్వాన్స్ కింద గత నెలలోనే రూ.50 వేలు ముట్టజెప్పాడు. మిగిలిన డబ్బుల కోసం ఈనెల 3వ తేదీన రామన్న ఆదోనికి వెళ్లి శ్రీనివాసులుతో కలిసి డబ్బులు డిమాండ్ చేశాడు. రెండు, మూడు రోజుల్లోగా డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించిన శ్రీనివాసులు మంగళవారం కర్నూలులోని సీక్యాంప్ సెంటర్లో ఉన్న ఏసీబీ కార్యాలయంలో అధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు రామన్నపై నిఘా వేశారు. డబ్బులు తీసుకుని ఎక్కడికి రమ్మంటావని డాక్టర్ చేత ఫోన్ చేయించారు. తన కార్యాలయం వద్దకు రమ్మని రామన్న సూచించగా సంభాషణను రికార్డ్ చేసి డీఎస్పీ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో సీఐలు క్రిష్ణారెడ్డి, ప్రసాదరావు, సీతారామారావు, పోలీస్ సిబ్బందితో కార్యాలయం వద్దకు చేరుకుని మాటు వేశారు. శ్రీనివాసుల నుంచి డబ్బులు తీసుకుంటుండగా రామన్నను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయంలోనే కెమికల్ పరీక్షల అనంతరం కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు. -
ఏడేళ్లుగా రిజిస్ట్రేషన్లు లేవు
సాక్షి, నరసరావుపేట: ఏడేళ్లుగా ఆ గ్రామంలోని భూములు రిజిస్ట్రేషన్లకు నోచుకోవడంలేదు. గ్రామంలోని భూములన్నీ తమవేనంటూ పుష్పగిరి పీఠాధిపతులు దేవాదాయశాఖను ఆశ్రయించడంతో ఆ భూములకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలంటూ దేవాదాయశాఖ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు 2007లో జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుంచి గ్రామస్తులకు కష్టాలు మొదలయ్యాయి. పుష్పగిరి మఠానికి లింగంగుంట్లలో 1 నుంచి 335 సర్వే నంబర్లలోని 1452 ఎకరాల భూమి ఉందని, వీటి రిజిస్ట్రేషన్లు ఆపాలని దేవాదాయశాఖ అధికారులు ఇచ్చిన ఆర్డర్లో ఉంది. దీనికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమవద్ద నో అబ్జక్షన్ సర్టిఫికెట్ పొందాలని నిబంధన విధించారు. లింగంగుంట్లలోని 1 నుంచి 72 బ్లాకులలో ఉన్న 1959 ఎకరాల భూమికి నరసరావుపేట రిజిస్ట్రార్ కార్యాలయంలో వందేళ్లుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పుష్పగిరి పీఠాధిపతులకు సంబంధించిన 1452 ఎకరాలు పోను మిగతా భూములకు రిజిస్ట్రేషన్లు చేయాలని గ్రామస్తులు ఎన్నిసార్లు విన్నవించినా కమిషనర్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఒక్క ఎకరాకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ పొందాలన్నా హైదరాబాద్‌లోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెవెన్యూ అధికారుల ద్వారా రికార్డులు తెప్పించుకుని స్వయంగా విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నా కమిషనర్ పట్టించుకోలేదు. గ్రామకంఠం భూములు, ఈనాం బీ రిజిస్టర్ ప్రకారం రైతులవేనని చెబుతున్న 507 ఎకరాల భూములకు తమకు ఎటువంటి సంబంధమూ లేదని పుష్పగిరి పీఠాధిపతులు అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. పీఠాధిపతులకు ఎంత భూమి ఉంది, రైతులకు ఎంత ఉంది అనే విషయాన్ని తేల్చకుండా రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తుండటంతో సమస్య జఠిలంగా తయారైంది. తమ భూములు తమకు ఇప్పించాలని గ్రామ రైతులు అప్పటి కలెక్టర్ ఆలీ రఫత్‌కు విన్నవించగా గ్రామంలోని భూములకు సర్వే నిర్వహించాలని ఆయన ఆదేశాలిచ్చారు. తమ 1452 ఎకరాల్లో సర్వే నిర్వహించవద్దని పుష్పగిరి పీఠాధిపతులు కోర్టును ఆశ్రయించడాన్ని అధికారులు సాకుగా చూపుతూ మిగిలిన భూముల్లో సైతం సర్వే నిర్వహించకుండా వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్యం తదితర అవసరాలకు భూమిని విక్రయించుకునే అవకాశం లేకుండా పోయింది. బ్యాంకుల నుంచి రుణాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జగన్ సీఎం అయితే పరిష్కారం.. మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి చొరవతో 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రామస్తుల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. దురదృష్టవశాత్తు ఆయన మరణించడంతో లింగంగుంట్ల గ్రామస్తుల సమస్య ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయింది. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావడంలేదని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని గ్రామస్తులు అంటున్నారు. బడాబాబుల పైరవీలు.. పైరవీలతో చిక్కుముడులను సరిచేసుకొని తక్కువ ధరలకు విలువైన భూములు కాజేసేందుకు కొందరు బడాబాబులు రంగంలోకి దిగారు. అధికార పార్టీ నాయకులతో ప్రభుత్వ అధికారులకు చెప్పించుకొని ఫైళ్లను చక చకా కదుపుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇన్నేళ్లుగా తాము పోరాటం చేస్తున్నా పట్టించుకోని అధికారులు, బడాబాబులకు మాత్రం కొమ్ము కాస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇటీవల గ్రామాన్ని సందర్శించి బడాబాబులకు అనుకూలంగా నివేదికలు అందించేందుకు సమాయత్తమైనట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. దేవాదాయశాఖ ఆర్జేసీ శ్రీనివాస్ ఇటీవల గ్రామాన్ని సందర్శించినప్పటికీ గ్రామస్తులకు సమాచారం ఇవ్వలేదు. స్థానిక దేవదాయశాఖ అధికారులు సైతం ఆయన రాకను గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. -
ఎయిర్ఏషియా ఇండియా టేకాఫ్‌కు లైన్‌క్లియర్
న్యూఢిల్లీ: దేశీయంగా విమానయాన సర్వీసులు ప్రారంభించేందుకు కీలకమైన ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)’ లభించినట్లు ఎయిర్ఏషియా ఇండియా తెలిపింది. పౌర విమానయాన శాఖ దీన్ని గత వారమే ఇచ్చిందని, ప్రస్తుతం లాంఛనంగా ఇది వెల్లడిస్తున్నామని కంపెనీ మాతృ సంస్థ ఎయిర్ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్.. సోషల్ నెట్వర్కింగ్ సైటు ట్విటర్లో పేర్కొన్నారు. ఎన్వోసీ చేతికి రావడంతో, సర్వీసులు వేగవంతంగా ప్రారంభించే దిశగా.. షెడ్యూల్డ్ ఆపరేటర్స్ పర్మిట్ (ఫ్లయింగ్ పర్మిట్) పొందేందుకు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కి దరఖాస్తు చేసుకోనున్నట్లు ఎయిర్ఏషియా ఇండియా సీఈవో మిట్టు చాండిల్య పేర్కొన్నారు. భారత్‌లో విమానయానాన్ని మరింత అందుబాటు స్థాయిలోకి తెచ్చి, ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చగలమన్నారు. మలేషియన్ సంస్థ ఎయిర్ఏషియా, టాటా గ్రూప్, టెలిస్ట్రా కలిసి ఎయిర్ఏషియా ఇండియాను ఏర్పాటు చేశాయి. ముందుగా చెన్నై, బెంగళూరు, తిరుచిరాపల్లి, కొచ్చి, కోల్‌కతా వంటి నగరాలకు ఎయిర్ఏషియా ఇం డియా సర్వీసులు ప్రారంభించాలని భావిస్తోంది.