సాక్షి, హైదరాబాద్: ‘‘ఇంటి నిర్మాణం అంటే మున్సిపల్ పర్మిషన్ నుంచి మొదలు పెడితే జలమండలి, అగ్ని మాపక, పోలీస్, విద్యుత్, కాలుష్య నియంత్రణ మండలి ఇలా దాదాపు 22 ప్రభుత్వ విభాగాల అనుమతి తీసుకోవాలి. దీంతో స్థిరాస్తి ప్రాజెక్టులకు నిరభ్యంతర ధృవీకరణ పత్రం (ఎన్‌ఓసీ) తీసుకోవడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతోంది. దీంతో ఒక్కో ప్రాజెక్ట్‌పై 40 శాతం వడ్డీ భారం పడుతోంది.
అందుకే కనీసం 30 శాతం అధిక ధరకు ఫ్లాట్లను విక్రయించాల్సి వస్తోందని’’ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) చెబుతోంది. అదే గుజరాత్ (గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్- గిఫ్ట్)లో అయితే అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఒక్క ఎన్‌ఓసీ తీసుకుంటే సరిపోతుంది. దీంతో నిర్మాణ సంస్థలకు భారం తగ్గడంతో పాటు పరిశ్రమల స్థాపనకు దేశ, విదేశీ సంస్థలు ముందుకొస్తాయని క్రెడాయ్ అభిప్రాయపడింది.
అదే మాదిరిగా మన రాష్ట్రంలోనూ ఒకే ఎన్‌ఓసీ, ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్ (ఈసీ)లను తీసుకునేలా ప్రభుత్వ విభాగాలను సమన్వయ పరచాలని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి కోరారు. ఈనెల 29 నుంచి 31 వరకు హైటెక్స్‌లో జరగనున్న స్థిరాస్తి ప్రదర్శన సందర్భంగా గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇంకా ఏమన్నారంటే..
{పాజెక్ట్ అనుమతులను పొందేందుకు ఏకగవాక్ష పద్ధతిని తీసుకురావాలి. దీంతో ధరలు 10 నుంచి 25 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ నిర్మించే ప్రాంతాన్ని డిజిటలైజేషన్ ద్వారా చూపించే వెసలుబాటును కల్పించాలి. దీంతో ఏ ప్రాంతంలో ఎంత ఎత్తులో నిర్మాణాలు చేపట్టాలో ఇట్టే తెలిసిపోతుంది. దీంతో అవినీతి తగ్గడమే కాకుండా సమయం వృథా కాదు.
వైఫై, హెల్త్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, సినిమా వంటి సిటీల ఏర్పాటుకు రాష్ర్ట ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో నగరం నలువైపులా అభివృద్ధి చెందుతుంది. మెట్రో రైలును 200 కి.మీ. వరకూ పొడిగించడం, ఇప్పటికే ట్రయల్ రన్ ఆరంభం కావటంతో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి.
మూడు రోజుల పాటు జరిగే ఈ స్థిరాస్తి ప్రదర్శనలో 150 మంది బిల్డర్లు, డెవలపర్లు పాల్గొంటారు. దాదాపు రూ.35 లక్షల నుంచి రూ.2.5 కోట్ల విలువ గల ఫ్లాట్లు, విల్లాలు, స్థలాల వివరాలను తెలియజేస్తారు. ఈ సమావేశంలో క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ఎస్ రాంరెడ్డి, జాయింట్ సెక్రటరీ జీ రాంరెడ్డి, హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ జైవీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒక్క ఎన్‌ఓసీ చాలు
Published Fri, Aug 22 2014 11:56 PM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement