నిర్మాణ రంగ కార్మికులకూ ఈఎస్‌ఐసీలో చోటు
► రాష్ట్రవ్యాప్తంగా 44,468 కుటుంబాలకు లబ్ధి
► ఈఎస్‌ఐసీ ప్రాంతీయ సంచాలకులు అరుణ్‌పాండే
సాక్షి, హైదరాబాద్: ఈఎస్‌ఐ పథకంలో కేంద్రం చేపట్టిన సంస్కరణలతో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగిందని కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) ప్రాంతీయ సంచాలకుడు అరుణ్‌పాండే పేర్కొన్నారు. ఈఎస్‌ఐసీ ద్వారా కార్మికులకు అందిస్తున్న సేవలు, సంక్షేమ పథకాల పురోగతిని శనివారం ఆయన మీడియాకు వివరించారు. ఈ ఏడాది భవన నిర్మాణ రంగ కార్మికులకూ ఈఎస్‌ఐలో చోటు కల్పించామని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 44,468 కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు.
అదేవిధంగా వేతన గరిష్ట పరిమితిని రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంచడంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. అదేవిధంగా యాజమాన్యాల వాటాను 4.75 శాతంనుంచి 3 శాతానికి తగ్గించి కంపెనీలకు వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. అంతేకాకుండా ఉద్యోగుల వాటాను 1.75 శాతం నుంచి ఒక శాతానికి తగ్గించి ఉద్యోగిపై కూడా భారం తగ్గించామన్నారు. ఈ ఏడాది జనవరి 20 నుంచి మహిళా ఉద్యోగులకు ఇచ్చే ప్రసూతి సెలవులను 12వారాల నుంచి 26 వారాలకు పెంచడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో పలు ఈఎస్‌ఐసీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని, మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో ఈఎస్‌ఐసీ మోడల్ డిస్పెన్సరీ కమ్ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను తెరిచామన్నారు. అదేవిధంగా గోషామహల్‌లో వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశామని, తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా మొబైల్ డిస్పెన్సరీలు ఏర్పాటు చేసి కార్మికులకు మెరుగైన సేవలను ముంగిట్లో అందిస్తున్నామన్నారు. అత్యవసర సేవలకు సూచనలిచ్చేందుకు ప్రత్యేకంగా 1800 11 3839 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు.