సాక్షి, నరసరావుపేట: ఏడేళ్లుగా ఆ గ్రామంలోని భూములు రిజిస్ట్రేషన్లకు నోచుకోవడంలేదు. గ్రామంలోని భూములన్నీ తమవేనంటూ పుష్పగిరి పీఠాధిపతులు దేవాదాయశాఖను ఆశ్రయించడంతో ఆ భూములకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలంటూ దేవాదాయశాఖ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు 2007లో జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుంచి గ్రామస్తులకు కష్టాలు మొదలయ్యాయి. పుష్పగిరి మఠానికి లింగంగుంట్లలో 1 నుంచి 335 సర్వే నంబర్‌లలోని 1452 ఎకరాల భూమి ఉందని, వీటి రిజిస్ట్రేషన్లు ఆపాలని దేవాదాయశాఖ అధికారులు ఇచ్చిన ఆర్డర్‌లో ఉంది.
దీనికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమవద్ద నో అబ్జక్షన్ సర్టిఫికెట్ పొందాలని నిబంధన విధించారు. లింగంగుంట్లలోని 1 నుంచి 72 బ్లాకులలో ఉన్న 1959 ఎకరాల భూమికి నరసరావుపేట రిజిస్ట్రార్ కార్యాలయంలో వందేళ్లుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పుష్పగిరి పీఠాధిపతులకు సంబంధించిన 1452 ఎకరాలు పోను మిగతా భూములకు రిజిస్ట్రేషన్లు చేయాలని గ్రామస్తులు ఎన్నిసార్లు విన్నవించినా కమిషనర్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఒక్క ఎకరాకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ పొందాలన్నా హైదరాబాద్‌లోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
రెవెన్యూ అధికారుల ద్వారా రికార్డులు తెప్పించుకుని స్వయంగా విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నా కమిషనర్ పట్టించుకోలేదు. గ్రామకంఠం భూములు, ఈనాం బీ రిజిస్టర్ ప్రకారం రైతులవేనని చెబుతున్న 507 ఎకరాల భూములకు తమకు ఎటువంటి సంబంధమూ లేదని పుష్పగిరి పీఠాధిపతులు అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. పీఠాధిపతులకు ఎంత భూమి ఉంది, రైతులకు ఎంత ఉంది అనే విషయాన్ని తేల్చకుండా రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తుండటంతో సమస్య జఠిలంగా తయారైంది. తమ భూములు తమకు ఇప్పించాలని గ్రామ రైతులు అప్పటి కలెక్టర్ ఆలీ రఫత్‌కు విన్నవించగా గ్రామంలోని భూములకు సర్వే నిర్వహించాలని ఆయన ఆదేశాలిచ్చారు.
తమ 1452 ఎకరాల్లో సర్వే నిర్వహించవద్దని పుష్పగిరి పీఠాధిపతులు కోర్టును ఆశ్రయించడాన్ని అధికారులు సాకుగా చూపుతూ మిగిలిన భూముల్లో సైతం సర్వే నిర్వహించకుండా వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్యం తదితర అవసరాలకు భూమిని విక్రయించుకునే అవకాశం లేకుండా పోయింది. బ్యాంకుల నుంచి రుణాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
జగన్ సీఎం అయితే పరిష్కారం.. మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి చొరవతో 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రామస్తుల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. దురదృష్టవశాత్తు ఆయన మరణించడంతో లింగంగుంట్ల గ్రామస్తుల సమస్య ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయింది. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావడంలేదని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని గ్రామస్తులు అంటున్నారు.
బడాబాబుల పైరవీలు.. పైరవీలతో చిక్కుముడులను సరిచేసుకొని తక్కువ ధరలకు విలువైన భూములు కాజేసేందుకు కొందరు బడాబాబులు రంగంలోకి దిగారు.
అధికార పార్టీ నాయకులతో ప్రభుత్వ అధికారులకు చెప్పించుకొని ఫైళ్లను చక చకా కదుపుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇన్నేళ్లుగా తాము పోరాటం చేస్తున్నా పట్టించుకోని అధికారులు, బడాబాబులకు మాత్రం కొమ్ము కాస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇటీవల గ్రామాన్ని సందర్శించి బడాబాబులకు అనుకూలంగా నివేదికలు అందించేందుకు సమాయత్తమైనట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. దేవాదాయశాఖ ఆర్‌జేసీ శ్రీనివాస్ ఇటీవల గ్రామాన్ని సందర్శించినప్పటికీ గ్రామస్తులకు సమాచారం ఇవ్వలేదు. స్థానిక దేవదాయశాఖ అధికారులు సైతం ఆయన రాకను గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
ఏడేళ్లుగా రిజిస్ట్రేషన్లు లేవు
Published Mon, Jan 13 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
Advertisement