బొగ్గు దొంగలు | Coal thieves in district | Sakshi
Sakshi News home page

బొగ్గు దొంగలు

Published Fri, Dec 27 2013 5:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

సింగరేణి నుంచి బొగ్గు అక్రమంగా రవాణా చేస్తోంది. అనుమతి లేకుండా పవర్‌ప్లాంట్‌లు, సిమెంట్, సిరామిక్స్ ఫ్యాక్టరీ లు, ఇటుక తయారీ కేంద్రాలు, ఇతర పరిశ్రమలకు తరలిస్తోంది.

 బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : కోల్ మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. సింగరేణి నుంచి బొగ్గు అక్రమంగా రవాణా చేస్తోంది. అనుమతి లేకుండా పవర్‌ప్లాంట్‌లు, సిమెంట్, సిరామిక్స్ ఫ్యాక్టరీ లు, ఇటుక తయారీ కేంద్రాలు, ఇతర పరిశ్రమలకు తరలిస్తోంది. ఇన్నాళ్లు గుట్టుగా సాగిన దందా ప్రస్తుతం యథేచ్ఛగా కొనసాగుతోంది. మామూళ్ల మత్తులో పడి అధికారులు బొగ్గు అక్రమ రవాణాను ‘మామూలు’గానే తీసుకుంటున్నారు. బెల్లంపల్లి ఏరియాలో భూగర్భ గని గోలేటీ-1ఎ, కైరిగూ డ, డోర్లి-1, డోర్లి-2 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి నుంచి వెలికితీసిన బొగ్గును టిప్పర్లు, లారీల ద్వారా తాండూర్ మండలంలోని రేచిని రోడ్ రైల్వేస్టేషన్, బోయపల్లి శివారులోని మామిడి తోటలలో ఏర్పాటు చేసిన కోల్ యార్డులలో డంప్ చేయాలి.

అక్కడ నుంచి ప్ర త్యేక రైలు వ్యాగన్ల ద్వారా సింగరేణితో ఒప్పం దం కుదుర్చుకున్న పరిశ్రమలకు బొగ్గు రవాణా అవుతోంది. మరోపక్క బొగ్గు గనుల నుంచి నేరుగా రామకృష్ణాపూర్(ఆర్‌కేపీ) పరిధిలోని ఆర్‌కే-1, ఆర్‌కే-5 సీఎస్‌పీలకు టిప్పర్లలో బొగ్గు సరఫరా అవుతోంది. షిప్ట్‌లవారీగా ఉత్పత్తి చేసి న బొగ్గును లారీలు, టిప్పర్‌లలో కోల్ ట్రాన్స్‌పోర్టుల ద్వారా చేరవేస్తుంటారు. ఇది సాధారణంగా జరిగే బొగ్గు రవాణా ప్రక్రియ. సరిగ్గా ఈ తరహాలోనే బొగ్గు అక్రమ రవాణా జరుగుతుండటం చేదు నిజం.
 జరుగుతున్న తీరు..
 తాండూర్ మండలం బోయపల్లి శివారులో ఐ దు కోల్‌యార్డులు ఉన్నాయి. గనుల నుంచి బొ గ్గును టిప్పర్లు, లారీలు నేరుగా ఆయా కోల్‌యార్డులకు, ఆర్‌కేపీ సీఎస్పీలకు చేరవేయాలి. అలా కాకుండా తాండూర్ ఐబీ చౌరస్తా సమీపంలో ఉన్న సింగరేణి చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేసిన తర్వాత రాత్రి టిప్పర్లు, లారీల వారు దర్జాగా కొన్ని సిమెంట్, సిరామిక్స్ ఫ్యాక్టరీలకు, ఇటుక బట్టిలకు బొగ్గును చేరవేస్తున్నారు. కోల్ యార్డులలో బొగ్గు డంప్ చేయకుండానే ఆ రకంగా దం దా నిర్వహిస్తున్నారు. మరోవైపు గోలేటీ టౌన్‌షిప్ మీదుగా మహారాష్ట్రకు లారీలలో బొగ్గును అక్రమంగా తరలిస్తున్నారు. ప్రతినెలా లారీలు, టిప్పర్లలో బొగ్గు అక్రమ రవాణా అవుతోంది.
 అదెలా సాధ్యమంటే..
 సాధారణంగా ఏదేని పరిశ్రమకు బొగ్గును రవా ణా చేయాలంటే లోడైన గని నుంచి సదరు పరి శ్రమ వరకు తీసుకెళ్లడానికి వే బిల్లు ఉండాలి. అదేమి లేకుండానే బొగ్గును మాఫియా రవాణా చేస్తూ అక్రమ దందాలో గుత్తాధిపత్యం చెలాయిస్తోంది. కొన్ని కోల్‌యార్డులలో పనిచేస్తున్న కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది, సింగరేణి ఎస్‌అండ్‌పీసీ అధికారులు మాఫియాతో చేతులు కలపడం మూలంగానే అక్రమ దందా జోరుగా సాగుతోంది. కోల్‌యార్డులో బొగ్గు డంప్ కాకపోయిన సిబ్బంది డంప్ అయినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి మాఫియాకు సహకరిస్తున్నారు.

బొగ్గు వే బిల్లు లేకుండా తరలివెళ్తున్న నిఘా పెట్టి పట్టుకోవల్సిన సింగరేణి ఎస్‌అండ్‌పీసీ, విజిలెన్స్, పోలీసు, రవాణా శాఖల అధికారులు రూ.లక్షలు ముడుపులు పుచ్చుకొని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కరీంనగర్, గోదావరిఖని ప్రాంతాల మాఫియా కాకుండా మంచిర్యాల, బెల్లంపల్లి, తాండూర్, మందమర్రి, గోలేటీ ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కొందరు కోల్‌మాఫియాతో చేతులు కలిపి అక్రమ దందాకు సహకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా బొగ్గు అక్రమ రవాణాను అరికట్టి, మాఫియా గుత్తాధిపత్యాన్ని నిరోధించాల్సిన అవసరం ఉంది. అవినీతి అధికారులను బదిలీ చేసి నిజాయితీ కలిగిన అధికారులను నియమిస్తే తప్పా బొగ్గు అక్రమ రవాణా ఆగే అవకాశాలు ఉండవని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement