coal smuggling
-
అధికారులు నిర్దోషులేనా?
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : సింగరేణి బొగ్గు అక్రమ దందాలో గురువారం పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో సింగరేణి అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సింగరేణిలోనే సంచలనం కలిగించిన బొగ్గు కుంభకోణంలో టిప్పర్ యజమానులు, మధ్యవర్తులను మాత్రమే దోషులుగా తేల్చారు. ఈ అక్రమ వ్యవహారంలో ఏ ఒక్క సింగరేణి అధికారికి బొగ్గు మసి అంటకపోవడం చర్చనీయాంశమైంది. ఏరియాలోని డోర్లి-2 ఓసీ ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి తవ్వకాలు ప్రారంభమైనప్పటి నుంచి బొగ్గు అక్రమ దందాకు తెరలేచినట్లు సమాచారం. బడా కోల్ కాంట్రాక్టర్లు, టిప్పర్ యజమానులు కొందరు బొగ్గు అక్రమ దందాకు శ్రీకారం చుట్టారు. రోజువారీగా టన్నుల కొద్ది బొగ్గు అక్రమ రవాణా చేసి కొందరు సింగరేణి అధికారులకు నెలవారీగా ముడుపులు అందజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలోనే ఆ గని ముఖ్య అధికారిని ఏరియా స్థాయి ముఖ్య అధికారి మరో ప్రాంతానికి బదిలీ చేయించినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత వచ్చిన గని ముఖ్య అధికారితో ఏరియా స్థాయి ముఖ్య అధికారి సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకొని అక్రమ దందా వ్యవహారంలో ముడుపులు పుచ్చుకొని బొగ్గు దందాను యథేచ్ఛగా కొనసాగేలా చూస్తున్నట్లు సమాచారం. ఫిర్యాదులో 64.. బయటపడింది 620 ట్రిప్పులు.. ‘సాక్షి’ దినపత్రికలో అక్రమ బొగ్గు దందాపై వరుసగా మూడు కథనాలు ప్రచురితం అయ్యాయి. ఇందుకు స్పందించిన 50 రోజులకుపైగా విచారణ జరిపి కేవలం 64 ట్రిప్పుల బొగ్గు రవాణా జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాండూర్లోని కోల్‌ట్రాన్స్‌పోర్టు యజమానులపై ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. కానీ, పోలీసుల విచారణలో మాత్రం అతి కొద్ది కాలంలో 620 ట్రిప్పుల బొగ్గు అక్రమ రవాణా జరిగినట్లు తేలింది. అంత భారీస్థాయిలో టిప్పర్ల యజమానులు ఏకపక్షంగా బొగ్గు అక్రమ రవాణా చేయడం ఏ మాత్రం వీలు కాదన్నది నగ్నసత్యం. సింగరేణి అధికారుల పాత్ర లేకపోతే ఏ కోశాన బొగ్గు అక్రమ రవాణా చేసేందుకు అవకాశాలు ఉండవని కార్మికులు సుస్పష్టంగా పేర్కొంటున్నారు. తిలాపాపం తలాపిడికెడు.. సాధారణంగా బొగ్గు రవాణా జరగాలంటే బంకర్ దగ్గర నుంచి మొదలుకుని చెక్‌పోస్టుల వరకు ఎన్నో తనిఖీలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆయా విభాగాలకు చెందిన అధికారులు తనిఖీ చేసి అంత సవ్యంగా ఉందని నిర్ధారించిన తర్వాతే రవాణాకు అనుమతి లభిస్తోంది. వే బిల్లులో చిన్నపాటి పొరపాట్లు ఉంటే బొగ్గు రవాణాను నిలిపివేసే అవకాశం ఉంటుంది. పటిష్టమైన భద్రత వ్యవస్థను కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న సింగరేణిలో అతి సులువుగా ఏళ్ల కొద్ది బొగ్గు అక్రమ రవాణా జరగడం అసాధ్యమని కార్మికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంకర్ వద్ద విధులు నిర్వహించే ట్రిప్ చైన్మన్, టెరెక్స్లోడ్ వద్ద ఉండే ట్రిప్మన్, వేబ్రిడ్జి వద్ద విధులు నిర్వహించే కోల్‌బ్రాంచి అధికారులు, క్లర్క్‌లు, చెక్‌పోస్టు వద్ద ఉండే ఎస్అండ్పీసీ, సీఐఎస్ఎఫ్ జవాన్ల కళ్లుకప్పి బొగ్గు అక్రమంగా తరలిపోతుందంటే నమ్మశక్యం కాని పరిస్థితి. వీళ్లకు తోడు ఎప్పటికప్పుడు ఎస్అండ్పీసీ జవాన్లు రహదారిపై ప్రత్యేక నిఘా పెట్టి పహారా కాస్తుంటారు. వీరిపై విజిలెన్స్ అధికారులు కన్నేసి ఉంచుతారు. అంతటి భద్రత వ్యవస్థ కలిగిన సింగరేణిలో టిప్పర్ల యజమానులు బొగ్గు అక్రమ రవాణా చేయడం కష్టసాధ్యమనేది తేటతెల్లమవుతోంది. కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతినెల ముడుపులు ముడితేనే ఈ తంతు యథేచ్ఛగా సాగే అవకాశం ఉందని కార్మికులు బాహాటంగానే పేర్కొంటున్నారు. సింగరేణి సిబ్బంది, అధికారుల పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపితే మరిన్నీ అక్రమాలు వెలుగుచూసే అవకాశాలు ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు. -
బొగ్గు దొంగలపై ఆరా
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు అక్రమ రవాణా గుట్టు విప్పిన ‘సాక్షి’ కథనాలపై అధికార గణం స్పందించింది. సాక్షిలో డిసెంబర్ 27వ తేదీన ‘బొగ్గు దొంగలు’, ఈ నెల 7వ తేదీన ‘ఆగని దందా’ శీర్షికలతో సమరసాక్షి పేరిట కథనాలు వరుసగా ప్రచురితమైన విషయం విధితమే. సింగరేణి విజిలెన్స్ అధికారులు అక్రమార్కుల బొగ్గు దందాపై కొరడా ఝుళిపించేందుకు రంగంలోకి దిగారు. కోల్ మాఫియాపై పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టడంతో అక్రమార్కులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ మేరకు సింగరేణి విజిలెన్స్ ఏజీఎం నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి ఏరి యాలో విస్తృతంగా విచారణ సాగుతోంది. ఏరియాలోని డోర్లి, డోర్లి-2 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు, ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో బొగ్గు రవాణాకు సంబంధించిన రికార్డులను విజి లెన్స్ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నా రు. గడిచిన ఆరు నెలల్లో బొగ్గు అక్రమంగా ఎంత మేరకు రవాణా జరిగింది? రవాణాకు పాల్పడిన ముఠా సభ్యులు ఎవరు? ఆ ముఠాకు సహకరించిన సింగరేణి అధికారులు ఎవరు? ఏ మార్గంలో, ఏ విధంగా బొగ్గు రవాణా జరిగిందనే కోణంపై ఆరా తీస్తున్నారు. గుట్టుగా సాగుతున్న విజిలెన్స్ విచారణతో కోల్‌మాఫియా, సింగరేణి అధికారుల్లో గుబులు మొదలైంది. బొగ్గు దందా అక్రమాలు ఎవరి మెడకు చుట్టుకుంటాయనేది చర్చనీయాంశంగా మారింది. మరోపక్క పోలీసులు బొగ్గు దందాపై విచారణ చేస్తున్నారు. ఈ మేరకు కొందరు అనుమానితులను రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు తెలిసిం ది. తాండూర్ పోలీసులు బొగ్గు అక్రమ రవాణాపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ విచారణ బొగ్గు కుంభకోణదారులను ఏ మేరకు రట్టు చేస్తుందో వేచి చూడాల్సిందే. -
బొగ్గు దొంగలు
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : కోల్ మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. సింగరేణి నుంచి బొగ్గు అక్రమంగా రవాణా చేస్తోంది. అనుమతి లేకుండా పవర్ప్లాంట్లు, సిమెంట్, సిరామిక్స్ ఫ్యాక్టరీ లు, ఇటుక తయారీ కేంద్రాలు, ఇతర పరిశ్రమలకు తరలిస్తోంది. ఇన్నాళ్లు గుట్టుగా సాగిన దందా ప్రస్తుతం యథేచ్ఛగా కొనసాగుతోంది. మామూళ్ల మత్తులో పడి అధికారులు బొగ్గు అక్రమ రవాణాను ‘మామూలు’గానే తీసుకుంటున్నారు. బెల్లంపల్లి ఏరియాలో భూగర్భ గని గోలేటీ-1ఎ, కైరిగూ డ, డోర్లి-1, డోర్లి-2 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి నుంచి వెలికితీసిన బొగ్గును టిప్పర్లు, లారీల ద్వారా తాండూర్ మండలంలోని రేచిని రోడ్ రైల్వేస్టేషన్, బోయపల్లి శివారులోని మామిడి తోటలలో ఏర్పాటు చేసిన కోల్ యార్డులలో డంప్ చేయాలి. అక్కడ నుంచి ప్ర త్యేక రైలు వ్యాగన్ల ద్వారా సింగరేణితో ఒప్పం దం కుదుర్చుకున్న పరిశ్రమలకు బొగ్గు రవాణా అవుతోంది. మరోపక్క బొగ్గు గనుల నుంచి నేరుగా రామకృష్ణాపూర్(ఆర్కేపీ) పరిధిలోని ఆర్కే-1, ఆర్కే-5 సీఎస్పీలకు టిప్పర్లలో బొగ్గు సరఫరా అవుతోంది. షిప్ట్లవారీగా ఉత్పత్తి చేసి న బొగ్గును లారీలు, టిప్పర్లలో కోల్ ట్రాన్స్‌పోర్టుల ద్వారా చేరవేస్తుంటారు. ఇది సాధారణంగా జరిగే బొగ్గు రవాణా ప్రక్రియ. సరిగ్గా ఈ తరహాలోనే బొగ్గు అక్రమ రవాణా జరుగుతుండటం చేదు నిజం. జరుగుతున్న తీరు.. తాండూర్ మండలం బోయపల్లి శివారులో ఐ దు కోల్‌యార్డులు ఉన్నాయి. గనుల నుంచి బొ గ్గును టిప్పర్లు, లారీలు నేరుగా ఆయా కోల్యార్డులకు, ఆర్కేపీ సీఎస్పీలకు చేరవేయాలి. అలా కాకుండా తాండూర్ ఐబీ చౌరస్తా సమీపంలో ఉన్న సింగరేణి చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేసిన తర్వాత రాత్రి టిప్పర్లు, లారీల వారు దర్జాగా కొన్ని సిమెంట్, సిరామిక్స్ ఫ్యాక్టరీలకు, ఇటుక బట్టిలకు బొగ్గును చేరవేస్తున్నారు. కోల్ యార్డులలో బొగ్గు డంప్ చేయకుండానే ఆ రకంగా దం దా నిర్వహిస్తున్నారు. మరోవైపు గోలేటీ టౌన్షిప్ మీదుగా మహారాష్ట్రకు లారీలలో బొగ్గును అక్రమంగా తరలిస్తున్నారు. ప్రతినెలా లారీలు, టిప్పర్లలో బొగ్గు అక్రమ రవాణా అవుతోంది. అదెలా సాధ్యమంటే.. సాధారణంగా ఏదేని పరిశ్రమకు బొగ్గును రవా ణా చేయాలంటే లోడైన గని నుంచి సదరు పరి శ్రమ వరకు తీసుకెళ్లడానికి వే బిల్లు ఉండాలి. అదేమి లేకుండానే బొగ్గును మాఫియా రవాణా చేస్తూ అక్రమ దందాలో గుత్తాధిపత్యం చెలాయిస్తోంది. కొన్ని కోల్యార్డులలో పనిచేస్తున్న కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది, సింగరేణి ఎస్అండ్పీసీ అధికారులు మాఫియాతో చేతులు కలపడం మూలంగానే అక్రమ దందా జోరుగా సాగుతోంది. కోల్‌యార్డులో బొగ్గు డంప్ కాకపోయిన సిబ్బంది డంప్ అయినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి మాఫియాకు సహకరిస్తున్నారు. బొగ్గు వే బిల్లు లేకుండా తరలివెళ్తున్న నిఘా పెట్టి పట్టుకోవల్సిన సింగరేణి ఎస్అండ్పీసీ, విజిలెన్స్, పోలీసు, రవాణా శాఖల అధికారులు రూ.లక్షలు ముడుపులు పుచ్చుకొని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కరీంనగర్, గోదావరిఖని ప్రాంతాల మాఫియా కాకుండా మంచిర్యాల, బెల్లంపల్లి, తాండూర్, మందమర్రి, గోలేటీ ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కొందరు కోల్మాఫియాతో చేతులు కలిపి అక్రమ దందాకు సహకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా బొగ్గు అక్రమ రవాణాను అరికట్టి, మాఫియా గుత్తాధిపత్యాన్ని నిరోధించాల్సిన అవసరం ఉంది. అవినీతి అధికారులను బదిలీ చేసి నిజాయితీ కలిగిన అధికారులను నియమిస్తే తప్పా బొగ్గు అక్రమ రవాణా ఆగే అవకాశాలు ఉండవని పలువురు పేర్కొంటున్నారు.