బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు అక్రమ రవాణా గుట్టు విప్పిన ‘సాక్షి’ కథనాలపై అధికార గణం స్పందించింది. సాక్షిలో డిసెంబర్ 27వ తేదీన ‘బొగ్గు దొంగలు’, ఈ నెల 7వ తేదీన ‘ఆగని దందా’ శీర్షికలతో సమరసాక్షి పేరిట కథనాలు వరుసగా ప్రచురితమైన విషయం విధితమే. సింగరేణి విజిలెన్స్ అధికారులు అక్రమార్కుల బొగ్గు దందాపై కొరడా ఝుళిపించేందుకు రంగంలోకి దిగారు. కోల్ మాఫియాపై పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టడంతో అక్రమార్కులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ మేరకు సింగరేణి విజిలెన్స్ ఏజీఎం నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి ఏరి యాలో విస్తృతంగా విచారణ సాగుతోంది. ఏరియాలోని డోర్లి, డోర్లి-2 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు, ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో బొగ్గు రవాణాకు సంబంధించిన రికార్డులను విజి లెన్స్ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నా రు.
గడిచిన ఆరు నెలల్లో బొగ్గు అక్రమంగా ఎంత మేరకు రవాణా జరిగింది? రవాణాకు పాల్పడిన ముఠా సభ్యులు ఎవరు? ఆ ముఠాకు సహకరించిన సింగరేణి అధికారులు ఎవరు? ఏ మార్గంలో, ఏ విధంగా బొగ్గు రవాణా జరిగిందనే కోణంపై ఆరా తీస్తున్నారు. గుట్టుగా సాగుతున్న విజిలెన్స్ విచారణతో కోల్‌మాఫియా, సింగరేణి అధికారుల్లో గుబులు మొదలైంది. బొగ్గు దందా అక్రమాలు ఎవరి మెడకు చుట్టుకుంటాయనేది చర్చనీయాంశంగా మారింది. మరోపక్క పోలీసులు బొగ్గు దందాపై విచారణ చేస్తున్నారు. ఈ మేరకు కొందరు అనుమానితులను రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు తెలిసిం ది. తాండూర్ పోలీసులు బొగ్గు అక్రమ రవాణాపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ విచారణ బొగ్గు కుంభకోణదారులను ఏ మేరకు రట్టు చేస్తుందో వేచి చూడాల్సిందే.
బొగ్గు దొంగలపై ఆరా
Published Fri, Jan 10 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement
Advertisement