Vigilance and the police inquiry
-
భారీగా గుట్కా నిల్వల సీజ్
సాక్షి, ఒంగోలు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేస్తారని భావించి రెండు నెలలకుపైగా అవసరమని భావించి గుట్కా ప్యాకెట్లను ముందుగానే సిద్ధం చేసుకున్న ఓ వ్యాపారి ఇంటిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అదనపు ఎస్పీ ఎం.రజని ఆదేశాల మేరకు డీఎస్పీ ఎల్.అంకయ్య ఆధ్వర్యంలో అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక లాయరుపేట సాయిబాబా ఆలయం ఎదురుగా ఉన్న హరేరామ బజార్‌లోని అమరా బాలకృష్ణ నివాసంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ సీఐలు బీటీ నాయక్, కేవీ రాఘవేంద్ర ఎస్ఐ అహ్మద్ జానీ, ఆడిటర్ శ్యామ్‌పాల్, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు ప్రసాద్, వెంకట్, లక్ష్మణ్, ఒన్‌టౌన్ ఎస్ఐ సుమన్, హెడ్‌కానిస్టేబుల్ సీతారామయ్యలు దాడులకు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఇంటిపైన ఉన్న మూడో అంతస్తులో స్టాకు నిల్వలు గుర్తించారు. పెద్ద పెద్ద బస్తాల్లో నిల్వ ఉన్న గుట్కా ప్యాకెట్లను గుర్తించి వాటిని సీజ్ చేశారు. వాటి విలువ రూ.9,37,700 ఉంటుందని భావించారు. ఈ సందర్భంగా వ్యాపారి అమరా బాలకృష్ణను ప్రాథమికంగా విచారించారు. అనంతపురం నుంచి నరేష్ అనే వ్యక్తి తనకు బుధవారం రాత్రి స్టాకు పంపినట్లు వివరించాడు. ఈ నేపథ్యంలో స్టాకును, నిందితుడైన బాలకృష్ణను ఒన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఒన్‌టౌన్ ఎస్ఐ సుమన్ తెలిపారు. బాలకృష్ణ స్థానిక నూతన కూరగాయల మార్కెట్లో ఓ షాపు నిర్వహిస్తూ ఉంటాడు. గతంలో కూడా ఇతడిపై గుట్కాలకు సంబంధించి కేసు కూడా నమోదై ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో రెండో దఫా కూడా పెద్ద ఎత్తున స్టాకు నిల్వ ఉంచడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
బొగ్గు దొంగలపై ఆరా
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు అక్రమ రవాణా గుట్టు విప్పిన ‘సాక్షి’ కథనాలపై అధికార గణం స్పందించింది. సాక్షిలో డిసెంబర్ 27వ తేదీన ‘బొగ్గు దొంగలు’, ఈ నెల 7వ తేదీన ‘ఆగని దందా’ శీర్షికలతో సమరసాక్షి పేరిట కథనాలు వరుసగా ప్రచురితమైన విషయం విధితమే. సింగరేణి విజిలెన్స్ అధికారులు అక్రమార్కుల బొగ్గు దందాపై కొరడా ఝుళిపించేందుకు రంగంలోకి దిగారు. కోల్ మాఫియాపై పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టడంతో అక్రమార్కులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ మేరకు సింగరేణి విజిలెన్స్ ఏజీఎం నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి ఏరి యాలో విస్తృతంగా విచారణ సాగుతోంది. ఏరియాలోని డోర్లి, డోర్లి-2 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు, ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో బొగ్గు రవాణాకు సంబంధించిన రికార్డులను విజి లెన్స్ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నా రు. గడిచిన ఆరు నెలల్లో బొగ్గు అక్రమంగా ఎంత మేరకు రవాణా జరిగింది? రవాణాకు పాల్పడిన ముఠా సభ్యులు ఎవరు? ఆ ముఠాకు సహకరించిన సింగరేణి అధికారులు ఎవరు? ఏ మార్గంలో, ఏ విధంగా బొగ్గు రవాణా జరిగిందనే కోణంపై ఆరా తీస్తున్నారు. గుట్టుగా సాగుతున్న విజిలెన్స్ విచారణతో కోల్‌మాఫియా, సింగరేణి అధికారుల్లో గుబులు మొదలైంది. బొగ్గు దందా అక్రమాలు ఎవరి మెడకు చుట్టుకుంటాయనేది చర్చనీయాంశంగా మారింది. మరోపక్క పోలీసులు బొగ్గు దందాపై విచారణ చేస్తున్నారు. ఈ మేరకు కొందరు అనుమానితులను రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు తెలిసిం ది. తాండూర్ పోలీసులు బొగ్గు అక్రమ రవాణాపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ విచారణ బొగ్గు కుంభకోణదారులను ఏ మేరకు రట్టు చేస్తుందో వేచి చూడాల్సిందే.