వివాదాస్పదమవుతున్న ‘ఖాకీ’లు
బెల్లంపల్లి : బెల్లంపల్లి ప్రాంతంలో కొందరు పోలీసుల వ్యవహార శైలి వివాదాలకు దారితీస్తోంది. ప్రజలతో సఖ్యత గా మెలిగి శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ కారణంగా పోలీ సు, ప్రజల మధ్య సంబంధాలు దూరమవుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో బెల్లంపల్లిలో మూడు సంఘటన లు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇవీ సంఘటనలు
1. బెల్లంపల్లికి చెందిన న్యాయవాది ఆరకొండ శేఖర్‌ను ఓ స్వల్ప సంఘటనలో పోలీసు ఉన్నతాధికారులు చితకబాదడం వివాదాస్పదమైంది. గత నెల 23వ తేదీన జరిగిన ఆ ఘటనలో బాధ్యులైన బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ , కాసిపేట ఎస్సై, గన్‌మెన్ , కానిస్టేబుల్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి న్యాయవాదులు వారం రోజుల నుంచి సామూహికంగా విధులను బహిష్కరించి ఆందోళనబాట పట్టారు. పోలీసు అధికారులపై రాష్ట్ర మానవ హక్కుల కమీషన్, ఎస్సీ, ఎస్టీ కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. కోర్టులో ప్రైవేట్ కేసు కూడా పెట్టారు.
2. న్యాయవాదిపై దాడి ఘటన మర్చిపోకముందే దసరా పర్వదినం రోజు పాతబస్టాండ్ వద్ద వాహనాల క్రమబద్ధీకరణ చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు బెల్లంపల్లి రైల్వేస్టేషన్ ఏరియాకు చెందిన పి.ధీరజ్‌కుమార్ అనే యువకుడిపై జులుం ప్రదర్శించి పరుషపదజాలంతో దూషించారు. అంతటితో ఆగకుండా టేకులబస్తీలోని ఓ ఇంటి వద్ద నిలిపి ఉంచిన తన వాహనం అద్దాలను సదరు కానిస్టేబుళ్లు పగలగొట్టినట్లు ధీరజ్‌కుమార్ బెల్లంపల్లి డీఎస్పీ కె.ఈశ్వర్‌రావుకు ఈ నెల 5వ తేదీ రాత్రి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
3. ఇక తాజాగా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఓ యువతితో సాగించిన వ్యభిచారం గుట్టు రట్టయింది. జననివాసాల మధ్య తన క్వార్టర్‌లో పట్టపగలు ఓ యువతిని తీసుకువచ్చి వ్యభిచారం చేస్తుండగా చుట్టుపక్కల వారు పట్టుకునే లోపే సదరు కానిస్టేబుల్, యువతి ఇంటి వెనుక వైపు నుంచి గోడ దూకి పారిపోయారు. ఈ ఘటన పోలీసుల పరువుకు మచ్చగా మిగిలింది. ఇలా పక్షం రోజుల్లో మూడు సంఘటనలు జరగడం ప్రజల్లో చర్చకు దారితీసింది.
మారని ఖాకీమార్క్
రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో సంస్కరణలు చేపట్టిన కొందరు ఖాకీల్లో మార్పు కనిపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓ వైపు ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై ప్రజాభి ప్రాయ సేకరణ నిర్వహిస్తూనే మరో పక్క దూకుడుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎలా వ్యవహరించాలి, ప్రజలతో ఏ విధంగా నడుచుకోవాలి, నేరాల అదుపులో ప్రజల సహకారం తదితర అంశాలపై పోలీసులు అభిప్రాయ సేకరణ నిర్వహించడంపై ప్రజల్లో ఒకింత సానుకూల దృక్పథం ఏర్పడింది.
పోలీసులలో మార్పు వస్తుందని ప్రజలు భావించిన క్రమంలోనే అనూహ్యంగా జరిగిన సంఘటనలు ఖాకీ మార్క్‌ను గుర్తు చేస్తున్నాయి. యాదృచ్ఛికంగా ఏదేని సంఘటన జరి గితే వెంటనే స్పందించి సామరస్యపూర్వకంగా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారులు ఆ దిశగా యత్నాలు చేయకపోవడంతో స్వల్ప సంఘటనలు కూడా పెద్దవి గా మారుతున్నాయి. పోలీసు శాఖపై ప్రజలకున్న అపోహలు, అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికైనా నూతన సంస్కరణలకు అనుగుణంగా పోలీసు అధికారులు ప్రజలపై సత్సంబంధాలు కలిగి ఉండి శాంతిభద్రతలు పర్యవేక్షించాలని పలువురు కోరుతున్నారు.