కొడుతున్న ఎస్‌ఐ, మృతుడు మురుగేషన్
సాక్షి, చెన్నై : మద్యం మత్తులో మోటారు సైకిల్ మీద దూసుకొచ్చిన మందుబాబుపై ఓ ఖాకీ జులుం ప్రదర్శించాడు. లాఠీతో చితక్కొట్టాడు. ఈ దెబ్బలకు స్పృహ తప్పిన ఆ మందుబాబు ఆస్పత్రిలో మరణించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పెషల్ పార్టీ ఎస్‌ఐపై హత్య కేసు నమోదైంది. ఆయన్ని సస్పెండ్ చేయడంతో పాటు అరెస్టు చేశారు. సేలం జిల్లా వాలప్పాడి పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు..
రాష్ట్రంలోని కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం తదితర 11 జిల్లాల్లో ఇంకా మద్యం దుకాణాలు తెరచుకోలేదు. దీంతో మందుబాబులు పొరుగు జిల్లాల వైపుగా పోటెత్తుతున్నారు. అలాగే, సారా జోరు పెరగడంతో కట్టడి లక్ష్యంగా ఆయా జిల్లాల పరిధిలో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎట్టపట్టిలో కిరాణా కొట్టు నడుపుతున్న మురుగేషన్ తన మిత్రులతో కలిసి కరుమందం గ్రామంలో మద్యం తాగాడు.
మంగళవారం సాయంత్రం మోటారు సైకిల్‌పై తిరుగు పయనం అయ్యాడు. ఒకే మోటారు సైకిల్‌పై ముగ్గురు వ్యక్తులు రావడాన్ని పాపనాయకన్ పట్టి చెక్ పోస్ట్ సిబ్బంది గుర్తించి అడ్డుకున్నారు. ఆ ముగ్గురు మత్తుకు చిల్తై ఉండటం, ఇందులో మురుగేషన్ పోలీసుల మీద తిరబడడం.. విధుల్లో ఉన్న స్పెషల్ ఎస్‌ఐ పెరియస్వామిలో ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో మురుగేషన్‌ను ఆయన చితక్కొట్టేశాడు. ఈ దృశ్యాల్ని మురుగేషన్‌తో వచ్చిన మిత్రుడు సెల్ ఫోన్లో చిత్రీకరించాడు.
మరో మిత్రుడు ఎస్‌ఐ కాళ్లా.. వేళ్లా పడినా ఎస్‌ఐ మురుగేషన్‌ను వదిలిపెట్టలేదు. దెబ్బలకు తాళలేక మురుగేషన్ స్పృహ తప్పాడు. దీంతో అంబులెన్స్‌ను రప్పించి ఆత్తూరు ఆస్పత్రికి తరలించారు. మురుగేషన్ తలకు బలమైన గాయమైనట్టు ఆత్తూరు వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం సేలం ఆస్పత్రికి తరలించగా, బుధవారం వేకువ జామున మురుగేషన్ మరణించాడు. మద్యం మత్తులో కిందపడడంతో మృతి చెందినట్లు తొలుత అందరూ భావించారు. అయితే మృతుడి మిత్రుడు చిత్రీకరించిన వీడియో వైరల్ కావడంతో ఎస్‌ఐ పైశాచికత్వం తెలిసింది. దీంతో బాధిత కుటుంబం న్యాయం కోసం ఏటావూర్ పోలీసు స్టేషన్ ముట్టడించారు.
డీఐజీ సీరియస్..
ఆ వీడియో వైరల్‌తో సేలం ఎస్పీ శ్రీఅభినవ్ తొలుత స్పందించారు. ఆ చెక్ పోస్టులో ఉన్న సిబ్బందిని విచారించారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్‌ఐపై కేసు నమోదుకు ఆదేశించారు. ఎస్‌ఐను అరెస్టు చేశారు. ఇక నిందితుడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీఐజీ మహేశ్వరి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, బాధిత కుటుంబం న్యాయం కోసం పట్టుబడుతూ గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగింది. మృతుడికి భార్య, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకునే ప్రసక్తే లేదని తేల్చారు.
దీంతో అధికారులు వారిని బుజ్జగిస్తున్నారు. ఈ వ్యవహారం చివరకు అసెంబ్లీకి చేరింది. ప్రతిపక్ష నేత పళనిస్వామి అసెంబ్లీలో ప్రస్తావిస్తూ బాధిత కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్పందించిన సీఎం స్టాలిన్ విచారణ సాగుతోందని, ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, గత ఏడాది జూన్ 22వ తేదీన పోలీసుల దాడిలో తూత్తుకుడి జిల్లా సాత్తాన్ కులంలో తండ్రి కుమారులు మరణించి సరిగ్గా ఏడాదైన సమయంలో తాజాగా మరోమారు ఓ ఖాకీ రూపంలో పోలీసు యంత్రాంగం రచ్చకెక్కింది. కాగా తాజా ఘటననపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సమగ్ర విచారణతో నివేదిక సమర్పించాలని సేలం జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది.
చదవండి: 'ఆ రూపాయి నాణేం కోటికి కొంటాను'
Comments
Please login to add a commentAdd a comment