బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : సింగరేణి బొగ్గు అక్రమ దందాలో గురువారం పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో సింగరేణి అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సింగరేణిలోనే సంచలనం కలిగించిన బొగ్గు కుంభకోణంలో టిప్పర్ యజమానులు, మధ్యవర్తులను మాత్రమే దోషులుగా తేల్చారు. ఈ అక్రమ వ్యవహారంలో ఏ ఒక్క సింగరేణి అధికారికి బొగ్గు మసి అంటకపోవడం చర్చనీయాంశమైంది. ఏరియాలోని డోర్లి-2 ఓసీ ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి తవ్వకాలు ప్రారంభమైనప్పటి నుంచి బొగ్గు అక్రమ దందాకు తెరలేచినట్లు సమాచారం.
బడా కోల్ కాంట్రాక్టర్లు, టిప్పర్ యజమానులు కొందరు బొగ్గు అక్రమ దందాకు శ్రీకారం చుట్టారు. రోజువారీగా టన్నుల కొద్ది బొగ్గు అక్రమ రవాణా చేసి కొందరు సింగరేణి అధికారులకు నెలవారీగా ముడుపులు అందజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలోనే ఆ గని ముఖ్య అధికారిని ఏరియా స్థాయి ముఖ్య అధికారి మరో ప్రాంతానికి బదిలీ చేయించినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత వచ్చిన గని ముఖ్య అధికారితో ఏరియా స్థాయి ముఖ్య అధికారి సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకొని అక్రమ దందా వ్యవహారంలో ముడుపులు పుచ్చుకొని బొగ్గు దందాను యథేచ్ఛగా కొనసాగేలా చూస్తున్నట్లు సమాచారం.
ఫిర్యాదులో 64.. బయటపడింది 620 ట్రిప్పులు..
‘సాక్షి’ దినపత్రికలో అక్రమ బొగ్గు దందాపై వరుసగా మూడు కథనాలు ప్రచురితం అయ్యాయి. ఇందుకు స్పందించిన 50 రోజులకుపైగా విచారణ జరిపి కేవలం 64 ట్రిప్పుల బొగ్గు రవాణా జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాండూర్‌లోని కోల్‌ట్రాన్స్‌పోర్టు యజమానులపై ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. కానీ, పోలీసుల విచారణలో మాత్రం అతి కొద్ది కాలంలో 620 ట్రిప్పుల బొగ్గు అక్రమ రవాణా జరిగినట్లు తేలింది. అంత భారీస్థాయిలో టిప్పర్ల యజమానులు ఏకపక్షంగా బొగ్గు అక్రమ రవాణా చేయడం ఏ మాత్రం వీలు కాదన్నది నగ్నసత్యం. సింగరేణి అధికారుల పాత్ర లేకపోతే ఏ కోశాన బొగ్గు అక్రమ రవాణా చేసేందుకు అవకాశాలు ఉండవని కార్మికులు సుస్పష్టంగా పేర్కొంటున్నారు.
తిలాపాపం తలాపిడికెడు..
సాధారణంగా బొగ్గు రవాణా జరగాలంటే బంకర్ దగ్గర నుంచి మొదలుకుని చెక్‌పోస్టుల వరకు ఎన్నో తనిఖీలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆయా విభాగాలకు చెందిన అధికారులు తనిఖీ చేసి అంత సవ్యంగా ఉందని నిర్ధారించిన తర్వాతే రవాణాకు అనుమతి లభిస్తోంది. వే బిల్లులో చిన్నపాటి పొరపాట్లు ఉంటే బొగ్గు రవాణాను నిలిపివేసే అవకాశం ఉంటుంది. పటిష్టమైన భద్రత వ్యవస్థను కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న సింగరేణిలో అతి సులువుగా ఏళ్ల కొద్ది బొగ్గు అక్రమ రవాణా జరగడం అసాధ్యమని కార్మికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బంకర్ వద్ద విధులు నిర్వహించే ట్రిప్ చైన్‌మన్, టెరెక్స్‌లోడ్ వద్ద ఉండే ట్రిప్‌మన్, వేబ్రిడ్జి వద్ద విధులు నిర్వహించే కోల్‌బ్రాంచి అధికారులు, క్లర్క్‌లు, చెక్‌పోస్టు వద్ద ఉండే ఎస్‌అండ్‌పీసీ, సీఐఎస్‌ఎఫ్ జవాన్ల కళ్లుకప్పి బొగ్గు అక్రమంగా తరలిపోతుందంటే నమ్మశక్యం కాని పరిస్థితి. వీళ్లకు తోడు ఎప్పటికప్పుడు ఎస్‌అండ్‌పీసీ జవాన్లు రహదారిపై ప్రత్యేక నిఘా పెట్టి పహారా కాస్తుంటారు. వీరిపై విజిలెన్స్ అధికారులు కన్నేసి ఉంచుతారు.
అంతటి భద్రత వ్యవస్థ కలిగిన సింగరేణిలో టిప్పర్ల యజమానులు బొగ్గు అక్రమ రవాణా చేయడం కష్టసాధ్యమనేది తేటతెల్లమవుతోంది. కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతినెల ముడుపులు ముడితేనే ఈ తంతు యథేచ్ఛగా సాగే అవకాశం ఉందని కార్మికులు బాహాటంగానే పేర్కొంటున్నారు. సింగరేణి సిబ్బంది, అధికారుల పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపితే మరిన్నీ అక్రమాలు వెలుగుచూసే అవకాశాలు ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు.
అధికారులు నిర్దోషులేనా?
Published Sat, Feb 15 2014 2:54 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement