తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ విద్యుత్(పీఎస్‌పీ) ప్లాంట్లు నిర్మించేందుకు అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ మేరకు తెహ్రీ జలవిద్యుత్ అభివృద్ధి సంస్థ(టీహెచ్‌డీసీ) సర్వే అందుకు సంబంధించిన అంశాలను వెల్లడించింది. ఈ సర్వేలోని వివరాల ప్రకారం..మొత్తం 9 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్న పీఎస్‌పీలను నిర్మించవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం అవకాశమిస్తే ప్లాంట్ల నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక అందజేస్తామని టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ తెలిపింది. ఈ సంస్థ అధికారులు ఇటీవల హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) అధికారులతో చర్చించినట్లు తెలిసింది. శ్రీశైలం డ్యాం దిగువన 1200 మెగావాట్లు, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ఆధారంగా 900 మెగావాట్లు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్ల వద్ద మరో 2 వేల మెగావాట్లు, రాష్ట్రంలోని ఇతర జలాశయాల వద్ద మిగిలిన ప్లాంట్లను నిర్మించవచ్చని ప్రాథమిక సర్వేలో తెలిపింది. తెలంగాణలో ఈ ప్లాంట్లు నిర్మించేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. జెన్‌కోకు శ్రీశైలం, నాగార్జునసాగర్ వద్ద నిర్మాణానికి మంచి అవకాశాలున్నాయని తెహ్రీ సంస్థ తెలిపింది. నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది.
పీఎస్పీ అంటే..
పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ అనేది ఒక రకమైన జల విద్యుత్ శక్తి నిల్వ ప్రాజెక్టు. దీనిని వేర్వేరు ఎత్తులలో ఉన్న రెండు నీటి రిజర్వాయర్లపై నిర్మిస్తారు. ఈ ప్లాంట్లు సంప్రదాయ జల విద్యుత్ ప్లాంట్లలానే పనిచేస్తాయి. వీటికి అదనంగా అదే నీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకునే సామర్థ్యం ఉంటుంది. అంతేకాదు పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లలో పగటిపూట చార్జింగ్ సౌర ఫలకల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
రాత్రి వేళ జలాశయం ద్వారా ఎగువ రిజర్వాయర్ నుంచి దిగువ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయడం వల్ల టర్బైన్ కిందకి కదిలి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఒక సారి నిర్మించిన ప్రాజెక్టు ఎనభై ఏళ్ల వరకూ పనిచేస్తుంది. 1890 కాలంలో ఇటలీ, స్విట్జర్లాండ్‌లో మొదలైన పీఎస్పీ సాంకేతికత 1930లో యునైటెడ్ స్టేట్స్‌లో అడుగుపెట్టింది. ఇప్పుడిది ప్రపంచమంతా విస్తరించింది. తాజాగా మన దేశంలో పీఎస్పీల స్థాపనలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా అవతరించింది.
ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం.. వర్క్‌ఫ్రం హాస్పిటల్!
ఏపీలో ఇలా..
దేశం మొత్తం మీద 2030–31 నాటికి 18.8 గిగావాట్ల సామర్థ్యం ఉన్న పీఎస్‌పీల అవసరం ఉందని కేంద్ర ఇంధన శాఖ అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎగువ సీలేరులో 1,350 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్‌పీ నిర్మాణానికి కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) అనుమతి కూడా ఇచ్చింది. ప్రైవేటు రంగంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పిన్నాపురంలో గ్రీన్ కో గ్రూప్ 1,680 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment