power plant project
-
రాష్ట్రంలో మరిన్ని పీఎస్పీ ప్లాంట్లకు అవకాశం.. అసలు అవేంటో తెలుసా..
తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ విద్యుత్(పీఎస్పీ) ప్లాంట్లు నిర్మించేందుకు అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ మేరకు తెహ్రీ జలవిద్యుత్ అభివృద్ధి సంస్థ(టీహెచ్‌డీసీ) సర్వే అందుకు సంబంధించిన అంశాలను వెల్లడించింది. ఈ సర్వేలోని వివరాల ప్రకారం..మొత్తం 9 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్న పీఎస్పీలను నిర్మించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అవకాశమిస్తే ప్లాంట్ల నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక అందజేస్తామని టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ తెలిపింది. ఈ సంస్థ అధికారులు ఇటీవల హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) అధికారులతో చర్చించినట్లు తెలిసింది. శ్రీశైలం డ్యాం దిగువన 1200 మెగావాట్లు, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ఆధారంగా 900 మెగావాట్లు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్ల వద్ద మరో 2 వేల మెగావాట్లు, రాష్ట్రంలోని ఇతర జలాశయాల వద్ద మిగిలిన ప్లాంట్లను నిర్మించవచ్చని ప్రాథమిక సర్వేలో తెలిపింది. తెలంగాణలో ఈ ప్లాంట్లు నిర్మించేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. జెన్కోకు శ్రీశైలం, నాగార్జునసాగర్ వద్ద నిర్మాణానికి మంచి అవకాశాలున్నాయని తెహ్రీ సంస్థ తెలిపింది. నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. పీఎస్పీ అంటే.. పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ అనేది ఒక రకమైన జల విద్యుత్ శక్తి నిల్వ ప్రాజెక్టు. దీనిని వేర్వేరు ఎత్తులలో ఉన్న రెండు నీటి రిజర్వాయర్లపై నిర్మిస్తారు. ఈ ప్లాంట్లు సంప్రదాయ జల విద్యుత్ ప్లాంట్లలానే పనిచేస్తాయి. వీటికి అదనంగా అదే నీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకునే సామర్థ్యం ఉంటుంది. అంతేకాదు పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లలో పగటిపూట చార్జింగ్ సౌర ఫలకల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. రాత్రి వేళ జలాశయం ద్వారా ఎగువ రిజర్వాయర్ నుంచి దిగువ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయడం వల్ల టర్బైన్ కిందకి కదిలి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఒక సారి నిర్మించిన ప్రాజెక్టు ఎనభై ఏళ్ల వరకూ పనిచేస్తుంది. 1890 కాలంలో ఇటలీ, స్విట్జర్లాండ్‌లో మొదలైన పీఎస్పీ సాంకేతికత 1930లో యునైటెడ్ స్టేట్స్లో అడుగుపెట్టింది. ఇప్పుడిది ప్రపంచమంతా విస్తరించింది. తాజాగా మన దేశంలో పీఎస్పీల స్థాపనలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా అవతరించింది. ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం.. వర్క్‌ఫ్రం హాస్పిటల్! ఏపీలో ఇలా.. దేశం మొత్తం మీద 2030–31 నాటికి 18.8 గిగావాట్ల సామర్థ్యం ఉన్న పీఎస్పీల అవసరం ఉందని కేంద్ర ఇంధన శాఖ అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎగువ సీలేరులో 1,350 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్పీ నిర్మాణానికి కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) అనుమతి కూడా ఇచ్చింది. ప్రైవేటు రంగంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పిన్నాపురంలో గ్రీన్ కో గ్రూప్ 1,680 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మిస్తోంది. -
‘శ్రీశైలం’ ఘటనకు ఏడాది
సాక్షి, నాగర్‌కర్నూల్/ దోమలపెంట(అచ్చంపేట): టీఎస్ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్తు కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుని శుక్రవారం నాటికి ఏడాది పూర్తయింది. ఈ సంఘటన టీఎస్ జెన్కో చరిత్రలో మాయనిమచ్చగా మిగిలింది. 2020 ఆగస్టు 20న అర్ధరాత్రి ఇక్కడి నాలుగో యూనిట్‌లోని ప్యానల్‌బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్ పేలుడుతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనలో ఐదుగురు ఇంజినీర్లు, ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లు, మరో ఇద్దరు అమర్‌రాజ బ్యాటరీస్ కంపెనీకి చెందిన సిబ్బంది మరణించగా, మరో ఎనిమిది మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఉక్కిరిబిక్కిరై మృత్యువాత శ్రీశైలం భూగర్భజల విద్యుత్ కేంద్రంలో నాడు అగ్రిప్రమాదం సంభవించి, దట్టమైన పొగలు వ్యాపించడంతో యూనిట్‌లోని ఉద్యోగులు, సిబ్బంది ఉక్కిరిబిక్కిరై తొమ్మిది మంది మరణించారు. వీరిలో డీఈ శ్రీనివాస్‌రావు (40), ఏఈ మర్సకట్ల పెద్ద వెంకట్రావ్ (46), ఏఈ మోహన్‌కుమార్ (33), ఏఈ ఉజ్మాఫాతిమా (27), ఏఈ సుందర్ (37), ప్లాంట్ అటెండర్ రాంబాబు (43), జూనియర్ ప్లాంట్ అంటెడర్ కిరణ్‌కుమార్ (30), అమరాన్ కంపెనీ ఉద్యోగులు వినేశ్‌కుమార్ (36), మహేశ్‌కుమార్ (38) మరణించారు. వీరంతా ఎస్కేప్ టన్నెల్ ద్వారా బయటకు వచ్చేందుకు యత్నించినా, దట్టమైన పొగతో ఊపిరి తీసుకునేందుకు వీలుపడని పరిస్థితి నెలకొనడంతో మరణించారు. పునరుద్ధరణ వైపు.. గతేడాది అక్టోబర్ 26న జలవిద్యుత్ కేంద్రంలోని 1, 2వ యూనిట్లలో పునరుద్ధరణ చేపట్టి విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఆ తర్వాత ఐదు నెలలకు 3, 5, 6వ యూనిట్లను సైతం పునరుద్ధరించి విద్యుదుత్పత్తి చేపట్టారు. ఈ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 646.56 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశారు. కాగా 2021–22లో శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్తు కేంద్రానికి టీఎస్ జెన్కో విధించిన లక్ష్యం 1,450 మిలియన్ యూనిట్లు. మొత్తం ఆరు యూనిట్లకుగాను ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల చొప్పున మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు. కాగా అగ్నిప్రమాదం జరిగిన తర్వాత కేంద్రంలో ఇప్పటివరకు నాలుగు యూనిట్లను పునరుద్ధరించారు. 4వ యూనిట్ మాత్రమే పునరుద్ధరించాల్సి ఉంది. -
వెలుగుల నగరి.. తొలి థర్మల్ ప్రాజెక్టు
భాగ్యనగరం అప్పట్లోనే విద్యుత్ వెలుగులతో విరాజిల్లింది. వందేళ్ల క్రితమే దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల కంటే ముందే విద్యుత్ వెలుగులు ప్రసరించాయి. అప్పట్లోనే ఇక్కడ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటైంది. 110 సంవత్సరాల క్రితమే సిటీలో విద్యుత్ సౌకర్యం కల్పించారు. సాక్షి సిటీబ్యూరో :అప్పట్లో డీజిల్ జనరేటర్లతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరఫరా నాటి నగర అవసరాలకు సరిపోని పరిస్థితి. దాంతో కొందరు పరిపాలనాధికారులు సొంతంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పాలని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు సూచించారు. దీంతో 1920లో హైదరాబాద్ పవర్ హౌస్ ప్రారంభమైంది. హుస్సేన్‌సాగర్ ఒడ్డున థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు. అందులో నాలుగు యూనిట్లు నిరంతరం పనిచేసేవి. ఆ కట్టడంలో మొగలాయి ల శైలి దర్శనమిచ్చేది. ‘హైదరాబాద్ పవర్ హౌస్ భవనం తాజ్‌మహల్ నిర్మాణమంత అందంగా ఉండేది’ అని ప్రముఖ చరిత్రకారులు అల్లమా ఏజాజ్ ఫారుఖీ తెలిపారు. అమెరికా నుంచి మిషనరీ మిషనరీని అమెరికా, యూరప్ దేశాల నుంచి తెప్పించారు. 22.5 మెగా ఓల్ట్‌ల సామర్థ్యం గల ప్లాంటులో రోజుకు 200 టన్నుల బొగ్గు వాడేవారు. తద్వారా జంట నగరాలతోపాటు ఆనాటి హైదరాబాద్ రాజ్యంలోని 18జిల్లాలకు విద్యుత్ సరఫరా అయ్యేది. గోదావరిఖని నుంచి బొగ్గును తరలించేందుకు ప్రత్యేక రైలు మార్గాన్ని కూడా నిర్మించారు. నాటి రైలు పట్టాల ఆనవాళ్లు ఖైరతాబాద్ గణపతి భవనం వెనుక భాగంలోని గల్లీలో నేటికీ దర్శనమిస్తాయి. హుస్సేన్ సాగర్ (ఫైల్) జాడలేవీ..! హైదరాబాద్ పవర్ హౌస్‌ను హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ స్టేషన్‌గా పిలిచేవారు. తెలంగాణ చరిత్రలో ఘనమైన పాత్ర వహించిన ఆ కేంద్రం తాలూకూ జాడలు ఇప్పుడు మచ్చుకైనా కనిపించవు. 1972లో రెండు ఉత్పత్తి యూనిట్లు మూతబడ్డాయి. మిగతా రెండు యూనిట్లూ నిరంతరాయంగా పనిచేసేవి. అనంతరం హైదరాబాద్ పవర్ హౌస్ 1992 నాటికి పూర్తిగా బంద్ అయింది. పవర్ హౌస్ ఓ జ్ఞాపకం విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతేనేం.. ఆ ఆవరణలోని కట్టడాలను పరిరక్షించాలని కొందరు చరిత్ర అధ్యయనకారులు ప్రభుత్వానికి విన్నవించారు. వారసత్వ కట్టడమైన ఆ అందమైన భవన సముదాయాలను మ్యూజియంగా మార్చాలని సూచించినా పట్టించుకోలేదు. 1995లో పవర్ హౌస్ నిర్మాణాలను కూల్చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పార్కు, ఎన్టీఆర్ ఘాట్, ప్రసాద్ ఐమ్యాక్స్ నిర్మాణాలున్న ప్రదేశంలోనే హైదరాబాద్ పవర్ హౌస్ ఉండేది. హుస్సేన్ సాగర్ (ఫైల్) అంతర్జాతీయ ఖ్యాతి హైదరాబాద్ థర్మల్ విద్యుత్ కేంద్రంపై 1939లో ప్రఖ్యాత టైం మ్యాగజైన్ ప్రత్యేక కవర్‌పేజీ కథనాన్ని ప్రచురించింది. నిజాం రాజ్యంలో ఆధునిక, పారిశ్రామికాభివృద్థికి ప్రతీక హైదరాబాద్ పవర్ హౌస్ నిర్మాణమని ప్రశంసింది. దానిపై ప్రత్యేకంగా ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేయడాన్ని కూడా ప్రస్తావించింది. అలా అప్పుడే అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. 1930 నాటికి దేశంలోనే విద్యుద్ధీకరణ చెందిన నగరాల్లో హైదరాబాద్ ముందువరుసలో ఉందని ఆర్కాయిస్ రిటైర్డ్ సూపరిటెండెంట్ అబ్దుల్ నయీమ్ చెబుతున్నారు. 1924–25 మధ్య కాలానికి భాగ్యనగరం కేంద్రంగా 121 పరిశ్రమలు వెలిశాయి. కర్ణాటక స్ఫూర్తి దేశంలో చారిత్రక నేపథ్యం గల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కర్ణాటకలోని శివనసమద్ర హైడ్రో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రత్యేకమైంది. 700కిలో ఓల్ట్‌ల సామర్థ్యం గత ఆ విద్యుత్తు ప్రాజెక్టును 1902లో మైసూరు మహారాజు నిర్మించారు. రెండేళ్లలోనే బెంగుళూరుకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఆ కేంద్రాన్ని చరిత్రకారులు కాపాడుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఆ ప్రాజెక్టుకు హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు లభించింది. అయితే ఇపుడు హైదరాబాద్ పవర్ హౌస్ ఆనవాళ్లు కూడా దొరకని పరిస్థితి. -
భద్రాద్రికి ‘పర్యావరణ’ బ్రేక్
-
భద్రాద్రికి ‘పర్యావరణ’ బ్రేక్
విద్యుత్ ప్లాంట్‌కు అనుమతిని నిరాకరించిన కేంద్రం కేంద్ర విద్యుత్ శాఖ పాలసీకి విరుద్ధమని స్పష్టీకరణ ఎన్జీటీ కేసులు, పర్యావరణ వివాదాలతో ప్రాజెక్టు నిర్మాణంపై నీలినీడలు 32 నెలల నిర్మాణ గడువులో ఇప్పటికే 20 నెలలు పూర్తి సాక్షి, హైదరాబాద్/పినపాక: జిల్లా మణుగూరులో 1080 (270గీ4) మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) నిర్మించతలపెట్టిన భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు జారీ చేయలేమని తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. 13వ పంచవర్ష ప్రణాళిక (2017-22) కాలంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పనిచేసే థర్మల్ విద్యుత్ కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేయాలని 2009 నవంబర్ 13న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ పాలసీకి విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఆధారిత ప్లాంట్లకు అనుమతిచ్చే ప్రతిపాదనలను పరిశీలించలేమని స్పష్టం చేసింది. భద్రాద్రి ప్లాంట్‌కు పర్యావరణ అనుమతుల కోసం జెన్కో సమర్పించిన ప్రతిపాదనలు పరిశీలనార్హం కావని ప్రకటిస్తూ ఈ నెల 4న కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కేసుతో భద్రాద్రి థర్మల్ ప్లాంట్ ఇప్పటికే తీవ్ర చిక్కుల్లో ఇరుక్కుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనలు మూలనపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిగిలింది మరో 12 నెలల గడువే.. ‘ఇండియా బుల్స్’అనే ప్రైవేటు కంపెనీ కోసం 270 మెగావాట్ల సామర్థ్యం గల 10 సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లకు సంబంధించిన బాయిర్లు, జనరేటర్లు, టర్బైయిన్లను కొన్నేళ్ల కింద బీహెచ్ఈఎల్ తయారు చేసింది. అరుుతే, యూపీఏ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణానికి సంబంధించిన కేసులో ఇండియా బుల్స్‌తో సహా దేశ వ్యాప్తంగా 214 బొగ్గు గనుల కంపెనీలకు కేటాయింపులను 2014లో సుప్రీం కోర్టు రద్దు చేసింది. దీంతో బీహెచ్ఈఎల్తో సైతం ఇండియా బుల్స్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇండియా బుల్స్ కోసం రూపొందించిన పరికరాలు సిద్ధంగా వుండడంతో కేవలం రెండేళ్లలో రాష్ట్రంలో థర్మల్ ప్రాజెక్టును నిర్మిస్తామని బీహెచ్ఈఎల్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. 5,044 కోట్ల అంచనా వ్యయంతో భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం దాదాపు ఏడాదిన్నర కింద బీహెచ్ఈఎల్, జెన్కో మధ్య ఒప్పందం కుదిరింది. అతి తక్కువ సమయంలో అనగా, 2015 మార్చి నుంచి 32 నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేలా ఈ ఒప్పందం జరిగింది. నాలుగు యూనిట్లలో తొలి యూనిట్‌ను 24 నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉండగా.. ఆ తర్వాత ప్రతి మూడు నెలకో ప్లాంట్ చొప్పున మొత్తం 32 నెలల్లో నాలుగు ప్లాంట్లను నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే 20 నెలల కాలం ముగిసిపోగా ఈ ప్లాంట్ నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు. మరో 12 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు జారీ చేయాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యుత్ మంత్రి పీయూశ్ గోయల్‌ను కలసి విజ్ఞప్తి కూడా చేశారు. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఈ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టడం పట్ల కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదిలోనే అభ్యంతరం తెలపడంతో ఇప్పటి వరకు పర్యావరణ అనుమతులు రాలేదు. ఆధునిక సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మారాలని, లేకుంటే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు పొందాలని అప్పట్లో షరతులు విధించిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ... తాజాగా ఈ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఆందోళనలో నిర్వాసిత యువత భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం అనుమతులు నిరాకరిం చడంతో ప్లాంట్ నిర్మాణం కోసం భూములు కోల్పోరుు పరిహారం తీసుకోకుండా ఉద్యోగాలు కోరుకున్న నిర్వాసిత యువత తీవ్ర ఆందోళన చెందుతోంది. నిర్వాసితుల కోటాలో పరిహారం తీసుకోకుండా ఉద్యోగాలు కోరుకొని ఇప్పటికే ఐటీఐలో చేరి శిక్షణ పొందుతున్న యువత తమ భవిష్యత్ ఎలా ఉంటుందో అనే ఆందోళనలో పడ్డారు. ఇదిలా ఉండగా ఇప్పటికే సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించే విద్యుత్ ప్లాంట్ సామగ్రిని 40 శాతం మేర నిర్మాణ ప్రాంతమైన పినపాక -మణుగూరు మండలాలకు తరలించడం గమనార్హం. -
ఆంధ్రజ్యోతి ఎండీ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేయండి
నగరంలోని బుడమేరు కాలువపై ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు మంజూరు చేసిన పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జోగి రమేష్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ పవర్ ప్లాంట్ ఎదుట ధర్నాకు దిగారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, వేమూరి రాధాకృష్ణల మధ్య జరిగిన క్విడ్ ప్రోకోపై విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఒప్పుకోలేదన్న విషయాన్ని ఈ సందర్బంగా జోగి రమేష్ గుర్తు చేశారు. అయినా ఆ పవర్ ప్లాంట్‌కు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పచ్చ జెండా ఊపడం పట్ల జోగి రమేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. సీఎం కిరణ్, రాధాకృష్ణలకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. వరదలు వచ్చే ప్రతిసారి బుడమేరు కాల్వ ద్వారా విజయవాడ పట్టణంలో ముంపు సమస్య తలెత్తుతోంది. దాంతో కాల్వను ఆధునీకరణ చేయకుంటే విజయవాడకు ముంపు తప్పదని గతంలో ఇంజనీరింగ్ నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు. బుడమేరు కాల్వ ఆధునీకరణకు వేమూరి రాధాకృష్ణ ప్లాంటు అడ్డంకిగా మారింది. దీంతో చంద్రబాబు ఇచ్చిన ఎన్వోసీని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సర్కారు రద్దు చేసింది. రోశయ్య హయాంలోనూ ఈ ప్రాజెక్టుకు అనుమతి నిరాకరించారు. ఇద్దరు సీఎంలు కాదన్న ప్లాంటుకు ఇప్పుడు కిరణ్‌కుమార్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.