వెలుగుల నగరి.. తొలి థర్మల్‌ ప్రాజెక్టు | First Power House Starts 1920 in Hyderabad | Sakshi
Sakshi News home page

వెలుగుల నగరి

Published Thu, Dec 5 2019 9:52 AM | Last Updated on Thu, Dec 5 2019 9:52 AM

First Power House Starts 1920 in Hyderabad - Sakshi

అప్పట్లో ఏర్పాటు చేసిన పవర్‌స్టేషన్‌

భాగ్యనగరం అప్పట్లోనే విద్యుత్‌ వెలుగులతో విరాజిల్లింది. వందేళ్ల క్రితమే దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల కంటే ముందే విద్యుత్‌ వెలుగులు ప్రసరించాయి. అప్పట్లోనే ఇక్కడ థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటైంది. 110 సంవత్సరాల క్రితమే సిటీలో విద్యుత్‌ సౌకర్యం కల్పించారు.

సాక్షి సిటీబ్యూరో :అప్పట్లో డీజిల్‌ జనరేటర్లతో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ సరఫరా నాటి నగర అవసరాలకు సరిపోని పరిస్థితి. దాంతో కొందరు పరిపాలనాధికారులు సొంతంగా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పాలని ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌కు సూచించారు. దీంతో 1920లో హైదరాబాద్‌ పవర్‌ హౌస్‌ ప్రారంభమైంది. హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున  థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు. అందులో నాలుగు యూనిట్లు నిరంతరం పనిచేసేవి.  ఆ కట్టడంలో మొగలాయి ల శైలి దర్శనమిచ్చేది. ‘హైదరాబాద్‌ పవర్‌ హౌస్‌ భవనం తాజ్‌మహల్‌ నిర్మాణమంత అందంగా ఉండేది’ అని ప్రముఖ చరిత్రకారులు అల్లమా ఏజాజ్‌ ఫారుఖీ  తెలిపారు.

అమెరికా నుంచి మిషనరీ
మిషనరీని అమెరికా, యూరప్‌ దేశాల నుంచి తెప్పించారు. 22.5 మెగా ఓల్ట్‌ల సామర్థ్యం గల ప్లాంటులో రోజుకు 200 టన్నుల బొగ్గు వాడేవారు. తద్వారా జంట నగరాలతోపాటు ఆనాటి హైదరాబాద్‌ రాజ్యంలోని 18జిల్లాలకు విద్యుత్‌ సరఫరా అయ్యేది. గోదావరిఖని నుంచి బొగ్గును తరలించేందుకు ప్రత్యేక   రైలు మార్గాన్ని కూడా నిర్మించారు. నాటి రైలు పట్టాల ఆనవాళ్లు ఖైరతాబాద్‌ గణపతి భవనం వెనుక భాగంలోని గల్లీలో నేటికీ దర్శనమిస్తాయి.

హుస్సేన్‌ సాగర్‌ (ఫైల్‌)
జాడలేవీ..!
హైదరాబాద్‌ పవర్‌ హౌస్‌ను హుస్సేన్‌సాగర్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌గా పిలిచేవారు. తెలంగాణ చరిత్రలో ఘనమైన పాత్ర వహించిన ఆ కేంద్రం తాలూకూ జాడలు ఇప్పుడు మచ్చుకైనా కనిపించవు. 1972లో రెండు ఉత్పత్తి యూనిట్లు మూతబడ్డాయి. మిగతా రెండు యూనిట్లూ నిరంతరాయంగా పనిచేసేవి.  అనంతరం  హైదరాబాద్‌ పవర్‌ హౌస్‌ 1992 నాటికి పూర్తిగా బంద్‌ అయింది.

పవర్‌ హౌస్‌ ఓ జ్ఞాపకం
విద్యుత్‌ ఉత్పత్తి ఆగిపోతేనేం.. ఆ ఆవరణలోని కట్టడాలను పరిరక్షించాలని కొందరు చరిత్ర అధ్యయనకారులు ప్రభుత్వానికి విన్నవించారు. వారసత్వ కట్టడమైన ఆ అందమైన భవన సముదాయాలను మ్యూజియంగా మార్చాలని సూచించినా పట్టించుకోలేదు. 1995లో పవర్‌ హౌస్‌ నిర్మాణాలను కూల్చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ పార్కు, ఎన్టీఆర్‌ ఘాట్, ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ నిర్మాణాలున్న ప్రదేశంలోనే హైదరాబాద్‌ పవర్‌ హౌస్‌ ఉండేది.

హుస్సేన్‌ సాగర్‌ (ఫైల్‌)
అంతర్జాతీయ ఖ్యాతి
హైదరాబాద్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంపై 1939లో ప్రఖ్యాత టైం మ్యాగజైన్‌ ప్రత్యేక కవర్‌పేజీ కథనాన్ని ప్రచురించింది. నిజాం రాజ్యంలో ఆధునిక, పారిశ్రామికాభివృద్థికి ప్రతీక హైదరాబాద్‌ పవర్‌ హౌస్‌ నిర్మాణమని ప్రశంసింది. దానిపై ప్రత్యేకంగా ఒక పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేయడాన్ని కూడా ప్రస్తావించింది.  అలా అప్పుడే అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. 1930 నాటికి దేశంలోనే విద్యుద్ధీకరణ చెందిన నగరాల్లో హైదరాబాద్‌ ముందువరుసలో ఉందని ఆర్కాయిస్‌ రిటైర్డ్‌ సూపరిటెండెంట్‌ అబ్దుల్‌ నయీమ్‌ చెబుతున్నారు. 1924–25 మధ్య కాలానికి భాగ్యనగరం కేంద్రంగా 121 పరిశ్రమలు వెలిశాయి.  

కర్ణాటక స్ఫూర్తి
దేశంలో చారిత్రక నేపథ్యం గల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో కర్ణాటకలోని శివనసమద్ర హైడ్రో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ప్రత్యేకమైంది. 700కిలో ఓల్ట్‌ల సామర్థ్యం గత ఆ విద్యుత్తు ప్రాజెక్టును 1902లో మైసూరు మహారాజు నిర్మించారు.  రెండేళ్లలోనే బెంగుళూరుకు విద్యుత్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఆ కేంద్రాన్ని చరిత్రకారులు కాపాడుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఆ ప్రాజెక్టుకు హెరిటేజ్‌ సైట్‌గా గుర్తింపు లభించింది. అయితే ఇపుడు  హైదరాబాద్‌ పవర్‌ హౌస్‌ ఆనవాళ్లు కూడా దొరకని పరిస్థితి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement