బుడమేరు కాల్వపై రాధాకృష్ణకు చెందిన పవర్ ప్లాంట్ (ఫైల్ పోటో)
నగరంలోని బుడమేరు కాలువపై ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు మంజూరు చేసిన పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జోగి రమేష్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ పవర్ ప్లాంట్ ఎదుట ధర్నాకు దిగారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, వేమూరి రాధాకృష్ణల మధ్య జరిగిన క్విడ్ ప్రోకోపై విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఒప్పుకోలేదన్న విషయాన్ని ఈ సందర్బంగా జోగి రమేష్ గుర్తు చేశారు. అయినా ఆ పవర్ ప్లాంట్కు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పచ్చ జెండా ఊపడం పట్ల జోగి రమేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. సీఎం కిరణ్, రాధాకృష్ణలకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు.
వరదలు వచ్చే ప్రతిసారి బుడమేరు కాల్వ ద్వారా విజయవాడ పట్టణంలో ముంపు సమస్య తలెత్తుతోంది. దాంతో కాల్వను ఆధునీకరణ చేయకుంటే విజయవాడకు ముంపు తప్పదని గతంలో ఇంజనీరింగ్ నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు. బుడమేరు కాల్వ ఆధునీకరణకు వేమూరి రాధాకృష్ణ ప్లాంటు అడ్డంకిగా మారింది. దీంతో చంద్రబాబు ఇచ్చిన ఎన్‌వోసీని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సర్కారు రద్దు చేసింది. రోశయ్య హయాంలోనూ ఈ ప్రాజెక్టుకు అనుమతి నిరాకరించారు. ఇద్దరు సీఎంలు కాదన్న ప్లాంటుకు ఇప్పుడు కిరణ్కుమార్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.