సిద్దిపేట(తెలంగాణ)లోని బండ తిమ్మాపూర్‌లో 'హిందూస్థాన్ కోకాకోలా బెవరేజెస్' (HCCB) గ్రీన్‌ఫీల్డ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు.. హెచ్‌సీసీబీ సీఈఓ జువాన్ పాబ్లో రోడ్రిగ్జ్ మొదలైనవారు పాల్గొన్నారు.
49 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి మొత్తం రూ.2,091 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇందులో రూ.1,409 కోట్లు ఇప్పటికే ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇది పూర్తయిన తరువాత 410 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో కూడా ఓ హెచ్‌సీసీబీ కర్మాగారం ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో హెచ్‌సీసీబీ తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది.
హెచ్‌సీసీబీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యాపార వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ప్రపంచ పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ కేంద్రంగా నిలుస్తోందనటానికి హెచ్‌సీసీబీ పెట్టుబడులు ఓ ఉదాహరణ. హెచ్‌సీసీబీని మేము అభినందిస్తున్నాము. తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ఈ సంస్థ దోహదపడమే కాకుండా ఉద్యోగాలను కూడా సృష్టిస్తుందని అన్నారు.
హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ సీఈఓ జువాన్ పాబ్లో రోడ్రిగ్జ్ పెట్టుబడుల గురించి మాట్లాడుతూ.. కంపెనీ వృద్ధి చెందే ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఫ్యాక్టరీ కార్యకలాపాలకు కావలసిన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందించిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment