సిద్దిపేట జిల్లాలో కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్
వ్యాపార వృద్ధికి అనుకూల చర్యలు చేపడుతున్నామని వెల్లడి
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం, కొండా సురేఖ
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. వ్యాపార వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్‌లో హిందూస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (హెచ్‌సీసీబీ) అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ సోమవారం ప్రారంభించారు. పరిశ్రమలో కలియతిరిగి పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. పరిశ్రమ ద్వారా వచ్చే ఉద్యోగాలతోపాటు పరోక్ష ఉపాధితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
పారిశ్రామిక వృద్ధి దిశగా చర్యలు
హెచ్‌సీసీబీ పెట్టుబడులు ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ కలిసి సాగుతాయనే దానికి ఉదాహరణ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధి కల్పన ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల సమ్మిళిత వృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పర్యావరణ అనుకూల పారిశ్రామిక వృద్ధికి ఈ గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీ ఉదాహరణ అని చెప్పారు. కగా.. హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సీఈవో జువాన్ పాబ్లో రోడ్రిగ్జ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నీటి పైప్‌లైన్‌ను త్వరగా పూర్తి చేసిందని, తెలంగాణ పట్ల తమ నిబద్ధతను చాటుకుంటామని చెప్పారు. హెచ్‌సీసీబీ తెలంగాణలో రూ.3,798 కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికిపైగా ఉపాధి అవకాశాలను కల్పించిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment