మావోయిస్టు సుదర్శన్‌ లొంగిపోతారా..? | Is Maoist Sudharshan Aka Ananth Surrender In Adilabad | Sakshi
Sakshi News home page

42 ఏళ్లుగా అజ్ఞాతవాసం

Published Thu, Sep 3 2020 10:13 AM | Last Updated on Thu, Sep 3 2020 10:45 AM

Is Maoist Sudharshan Aka Ananth Surrender In Adilabad - Sakshi

కటకం సుదర​ర్శన్‌

సాక్షి, బెల్లంపల్లి: మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌ ప్రభుత్వానికి లొంగి పోతారనే ప్రచారం సాగుతోంది. రెండురోజుల నుంచి పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుదర్శన్‌ డిగ్రీ చదువుతున్న క్రమంలో విప్లవోద్యమానికి ఆకర్షితుడయ్యాడు. చదువు పూర్తయ్యాక ఆర్నెళ్లపాటు సింగరేణిలో కార్మికుడిగా పనిచేశాడు. 1978లో విప్లవోద్యమానికి అంకితమై అజ్ఞాతంలోకి వెళ్లాడు. 42 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఆయన అంచలంచెలుగా ఉన్నత శ్రేణికి ఎదిగారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగి కీలకమైన పొలిట్‌ బ్యూరోలో సభ్యుడిగా ఉన్నాడు. మావోయిస్టు పార్టీలో మిలటరీ శిక్షణ ఇవ్వడం.. వ్యూహాలను రచించి సమర్థవంతంగా అమలు చేయడంలో సుదర్శన్‌కు మంచి పట్టున్నట్లు చెబుతుంటారు. నాలుగు దశాబ్దాల పైబడి అజ్ఞాతవాసం గడుపుతున్న సుదర్శన్‌ ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కకపోవడం విశేషం. (గణపతి లొంగిపోతాడన్న వార్తల్లో వాస్తవమెంత?)

తల్లిదండ్రులు చనిపోయినా..
64 ఏళ్లున్న సుదర్శన్‌ ఎన్నోసార్లు ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దండకారణ్యం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. విప్లవోద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన ఆయన.. అతడి తండ్రి మల్లయ్య 2017లో, తల్లి వెంకటమ్మ 2018లో మృతిచెందినప్పటికీ ఇంటిముఖం చూడలేదు. పోలీసుల సూచనతో జనజీవన స్రవంతిలో కలవాలని తల్లిదండ్రులు కోరినప్పటికీ సుదర్శన్‌ మాత్రం ముందుకు రాలేదు. సహచరులు కొంతమంది లొంగిపోయినా.. ఎంతోమంది ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినా.. ఆయన అజ్ఞాతం వదిలి రాలేదు.  సుదర్శన్‌ లొంగిపోతున్నట్లు సాగుతున్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. 

లొంగిపోతారనే ప్రచారంలో వాస్తవమెంత?
నిజంగానే సుదర్శన్‌ పోరుబాట వదులుతాడా..? అందుకు గల కారణాలు ఏమై ఉంటాయి..? ప్రచారంలో వాస్తవం ఎంత..? అనే కోణాల్లో పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి ఆరోగ్యం క్షీణించి జనజీవన స్రవంతిలో కలవబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న క్రమంలోనే సుదర్శన్‌ కూడా లొంగిపోతున్నాడనే వార్తలు వస్తుండటంతో స్థానికంగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బుధవారం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రానికి వచ్చిన  డీజీపీ మహేందర్‌ రెడ్డి హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వే నిర్వహించడం.. పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement