హత్య కేసులో నలుగురి అరెస్టు | Four men arrested in murder case | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నలుగురి అరెస్టు

Published Wed, Sep 25 2013 1:09 AM | Last Updated on Sun, Sep 2 2018 4:18 PM

Four men  arrested in murder case

బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : బెల్లంపల్లిలో సింగరేణి ఎలక్ట్రీషియన్ కాసు జగన్మోహన్‌రాజు(46) హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం స్థానిక వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో నిందితుల వివరాలను ఎస్సై కె.స్వామి వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న పట్టణంలోని టేకులబస్తీకి చెందిన సింగరేణి ఎలక్ట్రీషియన్ కాసు జగన్మోహన్‌రాజు చనిపోయాడు. కుటుంబ సభ్యులు సహజ మరణంగా నమ్మించి దహన సంస్కారాలు చేశారు. కాగా, మూడు హత్య కేసుల్లో నిందితుడు బెల్లంపల్లి మండలం చాకెపల్లికి చెందిన దొబ్బల రాజేశ్ ఉరఫ్ మున్నాను మే 23న పోలీసులు అరెస్టు చేశారు. 
 
 విచారణలో జగన్మోహన్‌రాజు హత్యోదంతం వెలుగు చూసింది. మృతుడి భార్య భవాని రూ.లక్షకు ఒప్పందం కుదుర్చుకుని హత్య చేయించినట్లు రాజేశ్ అంగీకరించాడు. వన్‌టౌన్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జగన్మోహన్‌రాజును భవాని మద్యం మత్తులో ఉంచగా.. బెల్లంపల్లిలోని అంబాల రాజమల్లు(హన్మాన్‌బస్తీ), గూడెపు నాగరాజు(రాంనగర్), దొబ్బల రాజేశ్(చాకెపల్లి) అతడి మెడకు టవల్ బిగించి, మర్మవయవాలపై గాయపర్చి హత్య చేశారని ఎస్సై వివరించారు. 
 
 ముందస్తు ఒప్పందం ప్రకారం భవాని తండ్రి కరీంనగర్ జిల్లా మెట్‌పల్లికి చెందిన పెద్దిరాజు గంగరాజు రూ.60 వేలు అడ్వాన్స్‌గా, మరో దఫా రూ.20వేలు, హత్య చేసిన రోజు ఆర్టీసీ బస్టాండ్‌లో మిగతా రూ.20 వేలు అందజేశాడని తెలిపారు. మొదటి భార్య చనిపోవడంతో జగన్మోహన్‌రాజు భవానిని రెండో పెళ్లి చేసుకున్నాడని పేర్కొన్నారు. మొదటి భార్య పిల్లలు ముగ్గురికి జీతం ఇస్తున్నాడనే అక్కసుతో హత్య చేయించిందని తెలిపారు. రాజేశ్‌ను గతంలోనే అరెస్టు చేయగా.. మిగతా నిందితులు కాసు భవాని, పెద్దిరాజు గంగరాజు, అంబరాల రాజమల్లు, గూడెపు నాగరాజులను మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement