రోజుకో కుంభకోణం
Published Thu, Oct 6 2016 11:24 AM | Last Updated on Sat, Sep 15 2018 3:51 PM
నాలుగేళ్ల నుంచి బయట పడుతున్న అక్రమాలు
బెల్లంపల్లి పరిధిలోనే వెలుగుచూస్తున్న వైనం
వెల్లడవుతున్న కోట్లాది రూపాయల అక్రమాల దందా
బెల్లంపల్లి : బెల్లంపల్లి ప్రాంతంలో రోజుకో కుంభకోణం వెలుగుచూస్తోంది. రూ.కోట్లలో అవినీతి, అక్రమాలు బయటపడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఘరానా మోసాలు, అక్రమాలు, కుంభకోణాలకు కొదువలేకుండా పోతోంది. మూడేళ్ల క్రితం బొగ్గు అక్రమ దందా వెలుగుచూడగా, ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను వంచించిన ఘటన బయట పడింది. ఆ ఘటన మర్చిపోకముందే తాజాగా తాండూర్ కేంద్రంగా సాగిన ఐటీ రిటర్న్స్ వ్యవహారంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు తయారు చే సి అక్రమాలకు పాల్పడిన సం ఘటన కలకలం రేపింది. ఇలా వరుసగా వెలుగుచూస్తున్న మోసాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బయటపడుతున్న అక్రమ దందాల వ్యవహారం పోలీసు యంత్రాంగాన్ని నివ్వెరపరుస్తుండగా, ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
అక్రమాలకు కేరాఫ్..
బెల్లంపల్లి ప్రాంతంలో నాలుగేళ్ల నుంచి వరుసగా అవినీతి, అక్రమాల దందాలు వెలుగుచూస్తున్నాయి. బెల్లంపల్లి ఏరియా డోర్లి-2 ఓపెన్‌కాస్ట్ కు చెందిన బొగ్గును తప్పుడు వేబిల్లులతో రవాణా చేసి రూ.కోట్లలో సాగిన అక్రమ దందా ప్రప్రథమంగా వెలుగుచూసింది. ఆ ఘటనను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి పాఠకులకు తెలిసిందే. అదే పరంపరలో తాండూర్ మండలం రేచిని రోడ్ రైల్వేస్టేషన్ నుంచి తప్పుడు రికార్డులతో అక్రమంగా ర్యాక్ బొగ్గును తరలించే యత్నం బెడిసికొట్టిన ఘటన ప్రకంపనలు రేపాయి. ఆ కేసులో అక్రమార్కులు, కొందరు సింగరేణి ఉన్నతాధికారులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు.
మెడికల్ అన్‌ఫిట్ దందా..
ఆ తర్వాత నెల రోజుల క్రితం సింగరేణిలో మెడికల్ అన్‌ఫిట్‌ల అక్రమ దందా వ్యవహారం బెల్లంపల్లిలో బయటపడింది. తూర్పు ప్రాంతానికి చెందిన 33 మంది కార్మికుల నుంచి రూ.2.23 కోట్లు వసూలు చేశారు. ఈ వ్యవహారం నిర్వహించిన నిందితుల్లో 14 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. మరికొందరు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన మర్చిపోకముందే గత నెల (సెప్టెంబర్) 6వ తేదీన ఉత్తర తెలంగాణ కేంద్రంగా సాగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల దందా బయట పడింది. బెల్లంపల్లి, రామగుండం, గోదావరిఖని, వరంగల్ తదితర ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది నిరుద్యోగుల నుంచి రూ.72 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన ఎడ్ల ఆదిత్య అనే నిందితుడిని బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసులు వారం రోజుల క్రితం అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. తాజాగా తాండూర్ మండల కేంద్రంలో ఉన్న ఓ ఐటీ రిటర్న్స్ కన్సల్టెన్సీ మహారాష్ట్ర వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్(డబ్ల్యూసీఎల్) బొగ్గు గనుల్లో పని చేస్తున్న 201 మంది కార్మికులకు సంబంధించి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి రూ.1.42 కోట్లు ఐటీ రిటర్న్స్ ఇప్పించి ప్రభుత్వాన్ని, ఇన్‌కమ్‌టాక్స్ శాఖను మోసం చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ మేరకు బుధవారం తాండూర్ మండల కేంద్రం ఐబీ, మాదారంటౌన్‌షిప్‌లలో విస్తృతంగా సోదాలు నిర్వహించి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ రిటర్న్స్ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని సీజ్ చేసి మరో నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ తీరుగా ఘరానా మోసాలు బెల్లంపల్లి ప్రాంతంలో వరుసగా వెలుగుచూడటం సంచలనం సృష్టిస్తోంది.
Advertisement
Advertisement