బెల్లంపల్లి పట్టణంలోని కన్నాలబస్తీకి చెందిన గజ్జల సరోజ ఉరఫ్ అమరక్క(50) అనారోగ్యంతో మృతి చెందింది.
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : బెల్లంపల్లి పట్టణంలోని కన్నాలబస్తీకి చెందిన గజ్జల సరోజ ఉరఫ్ అమరక్క(50) అనారోగ్యంతో మృతి చెందింది. దండకారణ్యంలో జిల్లా కమిటీ సభ్యురాలి హోదాలో మహిళా విభాగంలో పనిచేస్తున్న సరోజ క్యాన్సర్‌తో గత డిసెంబర్ 11న తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులకు బుధవారం మధ్యాహ్నం సమాచారం అందింది. అనారోగ్యంతో మృతిచెందిన సరోజకు మావోయిస్టు సంప్రదాయం ప్రకారం దండకారణ్యంలోనే అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. సరోజ మరణవార్త 22 రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు తెలిసింది.
ఇంటర్ వరకు చదివి..
సరోజ 1 నుంచి 5వ తరగతి వరకు కన్నాలబస్తీలోని ప్రభుత్వ పాఠశాలలో చదివింది. 6 నుంచి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసింది. ఇంటర్మీడియెట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బెల్లంపల్లిలోనే చదివింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న క్రమంలోనే ఆమెలో విప్లవ భావాలు మొలకెత్తాయి. ద్వితీయ సంవత్సరంలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు.
అన్న స్ఫూర్తితో..
కార్మికవర్గ కుటుంబమైన గజ్జల లక్ష్మీ-స్వామినాథ్ దంపతులకు ఐదుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వీరిలో నాలుగో కుమారుడైన గజ్జల గంగారాం, చిన్న కూతురు సరోజ విప్లవోద్యమానికి ఆకర్షితులయ్యారు. వరంగల్‌లోని ఆర్‌ఈసీలో ఇంజినీరింగ్ చదువుతూ గంగారాం పోరుబాట ఎంచుకున్నారు. ఆర్‌ఎస్‌యూలో చేరి ఆ తర్వాత గంగారాం నక్సలైట్ ఉద్యమాన్ని నిర్మించారు. జిల్లాలో నక్సలైట్ ఉద్యమ నిర్మాతల్లో గంగారాం ఒకరు. అన్న గంగారాంను స్ఫూర్తిగా తీసుకొని 1980లో సరోజ విప్లవోద్యమానికి ప్రభావితమై ఉద్యమ బాట పట్టారు.
సరోజ అజ్ఞాత వాసంలోకి వెళ్లిన ఏడాది వ్యవధిలో 1981 సెప్టెంబర్ 8న సిర్పూర్ అడవుల్లో ఉద్యమ అవసరాల కోసం ఆయుధాలు తయారు చేస్తూ బాంబు చేతిలో పేలి గంగారాం అకాల మృతి చెందాడు. పోరుబాటలో సోదరుడు మృత్యువాత పడిన చెక్కుచెదరని మనోనిబ్బరంతో సరోజ నక్సలైట్ ఉద్యమానికి అంకితమయ్యారు. 1987లో హైదరాబాద్ రాంనగర్ కుట్ర కేసులో నల్లా ఆదిరెడ్డితో కలిసి ఆమె అరెస్ట్ అయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె రెండేళ్లపాటు సాధారణ జీవితం గడిపారు. ప్రైవేట్‌గా విద్యార్థులకు ట్యూషన్ చెప్పారు. ఆ తర్వాత 1989లో సరోజ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విప్లవోద్యమంలో 30 ఏళ్లపాటు సరోజ సుదీర్ఘయానం సాగించారు.
ఆదిరెడ్డితో పెళ్లి..
సరోజ గజ్జల గంగారాం సోదరిగానే కాదు ఉద్యమబాటలో నల్లా ఆదిరెడ్డి ఉరఫ్ శ్యాం భార్య కూడా. ఆదిరెడ్డి రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టక ముందే సరోజను వివాహం చేసుకున్నారు. భార్యభర్తలు ఇద్దరు కూడా విప్లవోద్యమంలోనే తుదిశ్వాస విడిచారు. కొయ్యూర్ ఎన్‌కౌంటర్‌లో ఆదిరెడ్డి మృతిచెందగా సరోజ అనారోగ్యంతో చనిపోయారు.