బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : బెల్లంపల్లి ఏరియాలో జరిగిన బొగ్గు కుంభకోణంలో ఇద్దరు సింగరేణి ఉన్నతాధికారులపై వేటు పడింది. ఏరియాలోని డోర్లి-2 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు మేనేజర్ బి.వెంకటేశ్వర్‌రావు, ఏరియా కోల్‌బ్రాంచి మేనేజర్ శేషసాయిబాబాను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితులను మంచిర్యాలలోని బెల్లంపల్లి ఇన్‌చార్జి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చినట్లు బెల్లంపల్లి డీఎస్పీ కె.ఈశ్వర్‌రావు తెలిపారు. బొగ్గు అక్రమ దందాలో ఇంత వరకు 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో బొగ్గు టిప్పర్ల
యజమానులు, మధ్యవర్తులు, దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ కమర్షియల్ మేనేజర్ అవదేశ్‌కుమార్‌సింగ్, మహారాష్ట్రలోని వాయునందన పవర్‌ప్లాంట్ ము ఖ్య అధికారి ఉన్నారు.
బొగ్గు అక్రమ రవాణాలో సింగరేణి అధికారుల ప్రమేయం ఉన్న వైనాన్ని కూడా ‘సాక్షి’ తేటతెల్లం చేసింది. సింగరేణి అధికారులు నిర్దోషులేనా? అనే శీర్షికతో వార్తా కథనాన్ని ప్రచురించింది. అప్పటి వరకు సింగరేణి అధికారులపై ఎలాంటి విచారణ జరపని పోలీసులు ఆలస్యంగానైనా ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. చివరికి బొగ్గు అక్రమ రవాణా జరగడానికి సింగరేణి అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. దీంతో డోర్లి-2 ఓసీ మేనేజర్, కోల్‌బ్రాంచి మేనేజర్లను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. బొగ్గు అక్రమ రవాణా దందాలో ఇద్దరు సింగరేణి ఏరియా అధికారులు అరెస్ట్ కావడం కోల్‌బెల్ట్‌లో కలకలం రేపింది. సర్వత్రా చర్చనీయాంశమైంది.
వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’
ఏరియాలో తప్పుడు వే బిల్లులు, నకిలీ స్టాంపులు సృష్టించి డోర్లి-2 ఓపెన్‌కాస్ట్ నుంచి టిప్పర్ల యజమానులు భారీ ఎత్తున బొగ్గు అక్రమ రవాణా చేశారు. ఈ వైనాన్ని ‘సాక్షి’ దినపత్రికలో 2013 డిసెంబర్ 27న ‘బొగ్గు దొంగలు’, ఈ ఏడాది జనవరి 7వ తేదీన ‘ఆగని దందా’ శీర్షికలతో వెలుగులోకి తెచ్చింది. ‘సాక్షి’లో వచ్చిన కథనాలతో సింగరేణి యాజమాన్యం ఒక్కసారిగా తేరుకొని జరిగిన బొగ్గు అక్రమ రవాణా దందాపై విచారణ జరిపి వాస్తవమేనని నిర్ధారించింది. ఈ మేరకు జనవరి 19వ తేదీన ఏరియా ఎస్‌అండ్‌పీసీ జూనియర్ ఇన్‌స్పెక్టర్ వి. రాజయ్య తిర్యాణి పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కోట్లాది రూపాయల బొగ్గు కుంభకోణం కేసును బెల్లంపల్లి అదనపు ఎస్పీ భాస్కర్‌భూషణ్, డీఎస్పీ ఈశ్వర్‌రావు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు సాగించారు. ఈ దర్యాప్తులో ఎన్నో విషయాలు వెలుగుచూశాయి.
బొగ్గు టిప్పర్ల యజమానులను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు ఆ తర్వాత క్రమక్రమంగా నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. నిందితుల నుంచి రూ.70 లక్షల నగదు, 19 బొగ్గు టిప్పర్లు, ఒక ఇండికా కారు, 3.50 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. తప్పుడు మార్గాన బొగ్గు కొనుగోలు చేసిన దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం సింగరేణికి రూ.4.36 కోట్లు పరిహారం అందించింది. వాయునందన పవర్‌ప్లాంట్ యాజమాన్యం రూ.89 లక్షలు చెల్లించింది. మంచిర్యాలకు చెందిన ముగ్గురు బడా కోల్‌ట్రాన్స్‌పోర్టు యజమానులు కొన్నాళ్లు అజ్ఞాతవాసం ఉండి ఆతర్వాత హైకోర్టులో ముందస్తు బేయిల్ తీసుకున్నారు. వీరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ రకంగా పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేసి బొగ్గు అక్రమ దందా చేధించారు.
బొగ్గు దందాలో అధికారుల అరెస్టు
Published Mon, May 12 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM
Advertisement
Advertisement