నీలగిరితోటల్లో పులి సంచారం | Tiger Wandering In Nilgiri Forest At Mancherial | Sakshi
Sakshi News home page

నీలగిరితోటల్లో పులి సంచారం

Published Sun, Sep 22 2019 12:43 PM | Last Updated on Sun, Sep 22 2019 12:43 PM

Tiger Wandering In Nilgiri Forest At Mancherial - Sakshi

అటవీ అధికారులు గుర్తించిన పులి అడుగులు

సాక్షి, బెల్లంపల్లి: బెల్లంపల్లి అటవీ డివిజన్‌ పరిధి కుశ్నపల్లి రేంజ్‌లో పులి సంచారిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల నుంచి పులి విస్తారంగా  అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఆనవాళ్లు (పాద ముద్రలను) అటవీశాఖకు చెందిన  ఫారెస్టు డెవలాప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) అధికారులు గుర్తించారు. ఈ పాదముద్రలతో పులి సంచారం జరుగుతున్నట్లు ప్రస్పుటమైంది. బెల్లంపల్లి నుంచి నెన్నెల మండల కేంద్రానికి వెళ్లే మార్గంలో బొప్పారం గ్రామం ఉంది. ఆ గ్రామ శివారు ప్రాంతంలో అటవీ శాఖకు చెందిన నీలగిరి ఫ్లాంటేషన్‌ను పెంచుతున్నారు. ఆ ఫ్లాంటేషన్‌ పక్కన కడమడుగుల వాగు ఉంది. ఆ వాగు, నీలగిరి ఫ్లాంటేషన్‌ మధ్యలో నుంచి అటవీ ప్రాంతం లోనికి వెళ్లడానికి ఓ రహదారి ఉంది. అక్కడి నుంచి దట్టమైన అటవీ ప్రాంతం నెలకొంది.

దాదాపు పది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఆనుకుని కొన్ని రోజుల నుంచి ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో అటవీశాఖ పనులు జరుగుతున్నాయి. కూలీలు రోజువారీగా అటవీ ప్రాంతం మధ్యలో నుంచి పనులు జరుగుతున్న స్థలి వరకు రాకపోకలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆకస్మికంగా పులి అడుగులు దర్శనమిచ్చాయి. ఆ అడుగులను చూసి ఒక్కసారిగా భయపడిన కూలీలు పులి సంచారం జరుగుతున్నట్లు గ్రహించారు. విషయాన్ని వెంటనే ఎఫ్‌డీసీ బెల్లంపల్లి రేంజ్‌ ఫ్లాంటేషన్‌ మేనేజర్‌ జీ.సురేష్‌ కుమార్‌కు సమాచారం అందించారు. స్పందించిన సురేష్‌కుమార్‌ శనివారం ఆ ప్రాంతానికి వెళ్లి పులి పాదముద్రలను పరిశీలించి నిర్ధారించారు. సంచారం చేస్తున్న  ఆ పులి కే–4 అయి ఉంటుందని అటవీ శాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఎంచుకుని..
కుశ్నపల్లి అటవీ రేంజ్‌ పరిధిలో విస్తారంగా అటవీ సంపద కేంద్రీకృతమైంది. నలువైపుల నాలుగు గ్రామాలు ఉండటంతో ఆ అటవీ ప్రాంతం ఇప్పుడిప్పుడే దట్టంగా విస్తరిస్తోంది. తూర్పున ఘన్‌పూర్‌ గ్రామం, పడమర ప్రాంతంలో దుగినేపల్లి, ఉత్తరం వైపు బొప్పారం, దక్షిణం దిశలో జోగాపూర్‌ గ్రామాలు ఉన్నాయి. ఆ నాలుగు గ్రామాల మధ్యన ఎటుచూసిన వందలాది మైళ్ల దూరం వరకు అటవీ సంపద పెనవేసుకుని ఉంది. ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అటవీ ప్రాంతంలో వృక్షాలు మరింత ఏపుగా ఎదిగి కుమ్ముకుని ఉన్నాయి. ఆ ప్రాంతం సంచారానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండటంతో పులి ఆవాసం చేసుకోవడానికి యత్నిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు అభిప్రాయ పడుతున్నారు.

గ్రామాల్లో భయం భయం...
పులి సంచిరిస్తున్న విషయం వెలుగులోకి రావడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు. అటవీ ప్రాంతానికి వెళ్లడానికి జంకుతున్నారు. ముఖ్యంగా దుగినేపల్లి , పెర్కపల్లి, గుండ్ల సోమారం, బొప్పారం, ఘన్‌పూర్, జోగాపూర్‌ తదితర ప్రాంతాల ప్రజలు పులి కంట కనబడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అడవి నుంచి  పులి ఏవైపునకు వస్తుందోనని అభద్రతాభావానికి గురవుతున్నారు. పులి అడుగులు కనిపించడంతో అప్రమత్తమైన అటవీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వన్యప్రాణుల వధ కోసం సంచరిస్తున్న వేటగాళ్లు ఎక్కడా అటవీ ప్రాంతంలో విద్యుత్‌ తీగలతో ఉచ్చులు బిగించకుండా నివారణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

కారిడార్‌ కోసమేనా..?
అటవీ ప్రాంతాన్నీ కారిడార్‌గా మల్చుకోవడానికి పులి తీవ్రంగా తాపత్రయ పడుతున్నట్లు తెలుస్తోంది. వేమనపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో కొన్నాళ్లుగా సంచరించిన పులి ఆ తర్వాత కోటపల్లి మండలంలోనూ కాలు కదిపింది. ఆ పిమ్మట క్రమంగా నెన్నెల మండలంలో అడుగుపెట్టింది.  ఆయా ప్రాంతాలన్నీ కూడా కల గలిసి ఉండటం,  అటవీ ప్రాంతం దట్టంగా విస్తరించడంతో కారిడార్‌ ఏర్పాటుకు  పులి పాకులాడుతున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం బెల్లంపల్లి మండలం గుండ్ల సోమారం గ్రామ పొలిమేరల్లో నుంచి పులి సంచారం చేసినట్లు వదంతులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తదుపరి మూడు నెలల క్రితం నెన్నెల అటవీ ప్రాంతంలో సంచరించిన పులి తాజాగా మరోమారు అడుగులతో ఉనికిని చాటుకుంది. ఆవాసం కోసం అనువైన ప్రాంతాన్నీ ఎంచుకోవడానికి  పులి వేట సాగిస్తున్నట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement