
సత్యనారాయణ ఇంటి ఎదుట బైఠాయించిన సంధ్యారాణి
నెన్నెల(బెల్లంపల్లి): ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి.. తీరా పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగే దాకా అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకూర్చుంది. ఈ సంఘటన మండలంలోని గన్‌పూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గిరిజన యువతి సండ్ర సంధ్యారాణి, గన్‌పూర్ గ్రామానికి చెందిన సత్యంశెట్టి సత్యనారాయణ కొంతకాలంగా ప్రేమించుకున్నారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లోబర్చుకొని మోసం చేసినట్లు యువతి తెలిపింది. పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా అప్పుడూ.. ఇప్పుడూ అంటూ దాటేసుకుంటు వచ్చినట్లు పేర్కొంది. తీరా సోమవారం వేరే అమ్మాయితో నిశ్చితార్థం కాగా.. తనకు న్యాయం చేయాలంటూ సత్యనారాయణ ఇంటి ఎదుట సంధ్యారాణి ఆందోళనకు దిగింది.
న్యాయం జరగకుంటే ఆత్మహత్యే శరణ్యమంటోంది. కాగా, ప్రియుడి తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి వెళ్లగా.. సత్యనారాయణ సైతం తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని సంధ్యారాణి వాపోయింది.
Comments
Please login to add a commentAdd a comment