ఓవర్ బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్న వాహనాలు
సాక్షి, కాగజ్‌నగర్(ఆదిలాబాద్) : ఫైఓవర్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. సరైన డిజైన్ లోపం, రక్షణ చర్యలు లేక ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కాగజ్‌నగర్‌లో ఉన్న జిల్లాలోనే ఏకైక రైల్వే ఫైఓవర్ బ్రిడ్జి సైతం ప్రమాదాలకు ఏమాత్రం అతీతంగా లేదు. ఈ బ్రిడ్జిపై సరైన రక్షణ చర్యలు లేక తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గచ్చిబౌలిలోని డయో డైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం అలర్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి దుస్థితిపై ప్రత్యేక కథనం
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జితో పాటు వేంపల్లి– సిర్పూర్(టి) మధ్య మరో ఫ్లైఓవర్ నిర్మిణంలో ఉంది. కాగజ్‌నగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రమాదాలకు అడ్డాగా మారింది. తరచూ ఈ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదా లు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి, జూన్ మాసాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. సిర్పూర్ నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్‌గా ఉన్న కాగజ్‌నగర్ ప్రాంతా నికి చుట్టు పక్కల మండలాల ప్రజలు, వాహనదారులు ఎక్కువగా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. కాగజ్‌నగర్ నుంచి దహెగాం, కౌటాల, బెజ్జూర్, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట, భీమిని మండలాలకు వెళ్లాలం టే ఈ బ్రిడ్జి మీదుగానే వెళ్లాల్సిన ఉంటుంది. ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు, లారీలు, ట్రాక్టర్లు, వ్యాన్‌లు, ఆటోలు ఇలా అన్నిరకాల వాహనాలు ఈ వంతెన గుండా రాకపోకలు సాగిస్తున్నాయి.
కానరాని రక్షణ చర్యలు..
దాదాపు కిలోమీటర్ దూరం ఉన్న ఈ బ్రిడ్జిపై రక్షణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎక్కడా కూడా ప్రమాద సూచికలు ఏర్పాటు చేయలేదు. కనీసం రేడియం కటింగ్‌లతో హెచ్చరికలు కూడా ఏర్పాటు చేయకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బ్రిడ్జి మొదలు ప్రాంతంలో రోడ్డుకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. చివరి భాగంలో కూడా రోడ్డు శిథిలావస్థకు చేరడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక బ్రిడ్జిపై మలుపులు ఉన్న చోట్ల అతివేగంతో వెళ్లే వాహనాలు అదుపు తప్పితే పెను ప్రమాదం సంభవించే అవకాశాలున్నా యి. ఫ్లైఓవర్ బ్రిడ్జి మొదలు, ముగింపు ప్రాంత ంలో అధికారులు కనీసం స్పీడ్ బ్రేకర్లు సైతం ఏర్పాటు చేయలేదు.
రాత్రిపూట ఇబ్బందే..
రైల్వే ఫ్‌లైఓవర్ బ్రిడ్జిపై ప్రధానంగా రాత్రిపూట ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాత్రిపూట మూల మలుపుల వద్ద అధికారులు రేడియం కటింగ్‌లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులకు చీకటిలో సరిగ్గా కనబడకపోవటం, ప్లైఓవర్‌పై ఉన్న విద్యుత్ స్తంభాల్లో ఎక్కువ శాతం వెలగకపోవడం కూడా ప్రమాదాలకు దారి తీయవచ్చని నిపుణులు పేర్కొటున్నారు. మరోవైపు రాత్రిపూట మద్యం మత్తులో వాహనాలను అతి వేగంతో నడుపుతూ వెళుతున్నారని ఆర్‌వోబీ సమీపంలో ఉన్న ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇరువైపులా సైడ్ వాల్ ఇంకా ఎత్తుగా నిర్మించాలని వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్‌అండ్‌బీ, రైల్వే అధికారులు స్పందించి ఇక్కడ కూడా హైదరాబాద్ వంటి ప్రమాదం జరగకముందే మేల్కోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని ఆకాంక్షిస్తున్నారు.
రేడియం ఏర్పాటు చేయాలి
రైల్వే ఫ్‌లైఓవర్ బ్రిడ్జిపై రాత్రిపూట ఇండికేషన్ లభించే విధంగా అధికారులు రేడియం కటింగ్‌లతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. అలాగే బ్రిడ్జి మొదలు, ముగింపు పాయింట్‌లలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలను నివారించవచ్చు. ఆర్‌వోబీ ముగింపు వద్ద ఉన్న గుంతలను సత్వరమే పూడ్చివేయాలి.
– సుభాష్ పాల్, స్థానికుడు
చర్యలు తీసుకుంటాం
కాగజ్‌నగర్ రైల్వే ఫైఓవర్ బ్రిడ్జిపై ప్రమాదాలు చోటు చేసుకోకుండా రేడియం కటింగ్‌లతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. అవసరాన్ని బట్టి బ్రిడ్జిపై స్పీడ్ బ్రేకర్ కూడా నిర్మిస్తాం. ప్రమాదాల నివారణకు శాఖపరంగా చర్యలు తీసుకుంటాం. అలాగే గుంతలు ఏర్పడిన చోట మరమ్మతులు చేయించి ప్రజలకు సౌకర్యం కల్పిస్తాం.
– రాము, ఆర్‌అండ్‌బీ, ఈఈ
Comments
Please login to add a commentAdd a comment