బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : రాజకీయ పార్టీలు క్రీడాంశాలను తప్పనిసరిగా మేనిఫెస్టోలో పెట్టాలని జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కనపర్తి రమేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ఏఎంసీ మైదానంలో అమేచర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలు జరిగాయి. వీటికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల నిర్వహణకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నామన్నారు.
ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచిన అభ్యర్థులు క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. క్రీడలను, క్రీడాకారులను నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల్లో ‘నోటా’ ఓట్లు వేసి నిరసన తెలుపుతామన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో దీర్ఘకాలం నుంచి పీఈటీల నియామకాలు జరగడం లేదన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ రెవెన్యూ డివిజన్‌లో తప్పనిసరిగా స్పోర్ట్స్ పాఠశాల ఏర్పాటు చేసి, క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.
రెజ్లింగ్ పోటీలు ప్రారంభం
అమేచర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలబాలికల ఎంపిక పోటీలను శాంతిఖని గని మేనేజర్ బుచ్చయ్య ప్రారంభించారు. వివిధ ప్రాంతాల క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో అమేచర్ రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
క్రీడాంశాలను మేనిఫెస్టోలో పెట్టాలి
Published Mon, Apr 21 2014 4:50 AM | Last Updated on Sat, Sep 2 2017 6:17 AM
Advertisement
Advertisement