నిలువు దోపిడీ | irregularities in mango business | Sakshi
Sakshi News home page

నిలువు దోపిడీ

Published Mon, Jun 2 2014 4:05 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM

irregularities in mango business

బెల్లంపల్లి, న్యూస్‌లైన్ :  మామిడి తోటలకు నిలయమైన జిల్లాలో మార్కెట్ సౌకర్యం కరువైంది. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు, దళారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కొద్దో గోప్పో పంట చేతికందినా గిట్టుబాటు ధర లభించడం లేదు. జిల్లాలోని 23వేల హెక్టార్ల లో రైతులు మామిడి తోటలు పెంచుతున్నారు. వీటిలో 18 వేల హెక్టార్లలో కాపు వచ్చే మామిడితోటలు ఉండగా.. ఐదు వేల హెక్టార్లలో ఐదేళ్ల వయసు గల తోటలు ఉన్నాయి. ప్రకృతి అనుకూలిస్తే ఎకరాకు ఏడు టన్నుల చొప్పున మామిడి కాయ దిగుబడి వస్తుంది.

 కానీ అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల ఏటా పూత, పిందె రాలిపోయి తోటలకు నష్టం వాటిల్లుతోంది. దీంతో కాయ దిగుబడి హెక్టారుకు సగటున 3 టన్నులకు మించి రావడం లేదు. ఈసారీ మామిడి రైతులను ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీశాయి. మామిడి చెట్లకు పూత విరగబూసి పిందె దశకు చేరే క్రమంలో అకాల వర్షాలతో పిందెలు సగానికి పైగా రాలిపోయింది. కొద్దో గొప్పో మిగిలిన పంటను అమ్ముకుందామనుకున్న రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితులు ఏర్పడ్డాయి.

 మార్కెట్ సౌకర్యం లేక..
 మామిడి తోటలకు నిలయమైన జిల్లాలో మార్కెట్ సౌకర్యం లేదు. మంచిర్యాల కేంద్రంగా మార్కెట్ ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలు బుట్ట దాఖలయ్యాయి. రెండేళ్ల నుంచి ఆ ప్రతిపాదనలు మరుగున పడిపోవడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. దీంతో రైతులు మామిడి కాయలను మాహారాష్ట్రలోని నాగ్‌పూర్, నాందేడ్ మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని వ్యాపారులు, దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. మామిడికాయలను తీసుకెళ్లే క్రమంలో ధర ఆకాశంలో ఉన్నట్లు నమ్మబలికి.. తీరా తీసుకెళ్లాక ఒక్కసారిగా ధర దించి రైతులను వంచనకు గురి చేస్తున్నారు. వ్యాపారులు, దళారులు సిండికేట్‌గా మారి దోచుకుంటున్నారు. మామిడికాయలు, పండ్లను వేలం పాడి విక్రయించి ఇచ్చినందుకు రూ.లక్షకు రూ.10వేల చొప్పున దళారులు రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. మరోవైపు టన్నుకు 50 కిలోల తరుగు తీస్తున్నారు. రైతులు ఎదురుతిరిగితే కొనుగోలు చేయడం లేదు.

 తడిసి మోపెడవుతున్న చార్జీలు
 మార్కెట్ సౌకర్యం అందుబాటులో లేక మామిడి రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కాయలను చెట్లపై నుంచి తెంపడం నుంచే ఇబ్బందులు మొదలవుతాయి. గతంలో రోజువారీ కూలీకి వచ్చే కూలీలు ప్రస్తుతం టన్ను లెక్కన డబ్బులు తీసుకుంటున్నారు. ఆరు టన్నుల కాయలు కోస్తే రూ.10వేలు కూలిగా ఇవ్వాల్సి వస్తోంది. కాయలు తెంపిన తర్వాత మార్కెట్‌కు తరలించడానికి రవాణా చార్జీ అదనపు భారమవుతోంది. బెల్లంపల్లి ప్రాంతం నుంచి నాగ్‌పూర్‌కు మామిడికాయలు తరలిస్తే డీసీఎం వ్యాన్‌కు రూ.18వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. నెన్నెల, జైపూర్, భీమారం తదితర ప్రాంతాల నుంచి తరలిస్తే రూ.22వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. దీంతో రవాణా భారం రైతులకు తడిసి మోపెడవుతోంది.

 మద్దతు ధర కరువు..
 రోజు రోజుకు మార్కెట్‌లో నిత్యావసర వస్తువులు, పండ్ల ధరలు ఆకాశాన్నంటుతుండగా.. మామిడి కాయలు పండించే రైతులకు మాత్రం మద్దతు ధర కరువవుతోంది. ఏయేటికాయేడు గిట్టుబాటు ధర లేక విలవిలలాడుతున్నారు. ఈయేడు తొలుత బంగినపల్లి మామిడి పండ్లకు టన్నుకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు, దశేరికి రూ.35 వేల నుంచి రూ.40 వేలు మద్దతు ధర చెల్లించి రైతులను వ్యాపారులు ఊరించారు. మద్దతు ధర లభిస్తోందని ఆశపడిన రైతులు ఒక్కసారిగా మామిడికాయలు, పండ్లను మార్కెట్‌లో ముంచెత్తగా ఆకాశంలో ఉన్న ధరను పాతాళానికి దించారు.

ప్రస్తుతం బంగెనపల్లి మామిడికాయలు టన్నుకు రూ.13 వేల నుంచి రూ.16 వేల వరకు, దశేరి టన్నుకు రూ.25 వేల నుంచి రూ.28 వేల వరకు ధర పలుకుతోంది. ఇతర రసాల పండ్లను టన్నుకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్న మద్దతు ధర కూలీల ఖర్చు, ట్రాన్స్‌పోర్టు చార్జీలు, రైతుల శ్రమను తీసివేస్తే ఏ మాత్రం గిట్టుబాటు కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.

 చేయూత కరువు..
 మామిడి రైతులకు మార్కెట్ సదుపాయం కల్పించి కష్టాలు తొలగించడంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ ఒక్కనాడూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మార్కెట్ సౌకర్యం కోసం చేసిన ప్రతిపాదనలను ఇప్పటికైనా కార్యారూపం దాల్చేలా చర్యలు తీసుకుని మద్దతు ధర దక్కేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement