ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌లైన్: అకాల వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి. వడగళ్ల వానలతో మిర్చి, మొక్కజొన్న, వరి, పెసర, నువ్వులు, బొబ్బెర తదితర పంటలతో పాటు మామిడితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత నాలుగు రోజులుగా జిల్లాలోని పలుప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బయ్యారం, ఇల్లెందు, గుండాల, టేకులపల్లి, కొత్తగూడెం, పాల్వంచ, ముల్కలపల్లి, బూర్గంపాడు, పినపాక, భద్రాచలం, వెంకటాపురం, వాజేడు, చర్ల, చింతూరు, దుమ్ముగూడెం, మణుగూరు తదితర మండలాల్లో వడగళ్ల వర్షాలు కురిసి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసింది.
భద్రాచలం ఏరియాలో దాదాపు 50 వేల క్వింటాళ్లకు పైగా మిర్చి కల్లాల్లో తడిసింది. ఈ పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బయ్యారం, ఇల్లెందు, గుండాల, టేకులపల్లి తదితర మండలాల్లో దాదాపు 2 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట నేల వాలింది. పాల్వంచ, కొత్తగూడెం, బూర్గంపాడు, పినపాక తదితర మండలాల్లో వరి, పెసర, బొబ్బెర, నువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లితే, వ్యవసాయ శాఖ మాత్రం అందుకు బిన్నంగా లెక్కలు చూపుతోంది. నిబంధనల మేరకు 50 శాతం నష్టం జరిగితేనే ఆ పంటకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది. ఈ నిబంధన ప్రకారం వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వేలు నిర్వహించాలి.
ఆ తరువాత వ్యవసాయ నిపుణులు వారి నిబంధనల మేరకు నష్టాలను నిర్ధారించాలి. ఆయా రిపోర్టుల ఆధారంగా పంట నష్టాల నివేదికలను గుర్తిస్తారు. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాల ప్రాథమిక రిపోర్టును పంపాలని జేడీఏ పి,బి భాస్కర్‌రావు ఆదేశం మేరకు మండల వ్యవసాయాధికారులు నివేదిక పంపారు. దీని ప్రకారం జిల్లాలో 1296 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం సంభవించినట్లు గుర్తించారు. ఇల్లందు మండలం రొంపేడు, కొమరారం, టేకులపల్లి మండలం గంగారం, కోయగూడెం, కొప్పురాయి, బూర్గం పాడు మండలం టేకులచెరువు, నాచిరిపేట, ఎన్.కె.బంజర, పాల్వంచ మండలం యానంబైలు, పాయకారి యానంబైలు, కొత్తగూడెం మండలం రేగళ్ల గ్రామాల్లో వడగండ్ల వాన, ఈదురుగాలుల ప్రభావంతో వరి, పెసర, బొబ్బర, మొక్కజొన్న, నువ్వులు పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ గుర్తించింది.
పాల్వంచ డివిజన్‌లో 60 మంది రైతులకు చెందిన 42 హెక్టార్లలో వరి, 25 మంది రైతులకు చెందిన 20 హెక్టార్లలో పెసర, 20 మంది రైతులకు చెందిన 12 హెక్టార్లలో బొబ్బర, 50మంది రైతులకు చెందిన 50 హెక్టార్లలో మొక్కజొన్న, 10 మంది రైతులకు చెందిన 12 హెక్టార్లలో నువ్వుల పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనాలు వేశారు. ఇల్లందు డివిజన్‌లో 336 మంది రైతులకు చెందిన 118 హెక్టార్లలో, కొత్తగూడెం డివిజన్‌లో నలుగురు రైతులకు చెందిన 2 హెక్టార్లలో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు అంచనా వేశా రు. మోరంపల్లి బంజర డివిజన్‌లో 220 మంది రైతులకు చెందిన 140 హెక్టార్లలో వరి, 18 మంది రైతులకు చెందిన 12 హెక్టార్లలో పెసర, 20 మంది రైతులకు చెందిన 24 హెక్టార్లలో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. స్థానిక వ్యవసాయాధికారుల నుంచి ప్రాథమికంగా అందిన నివేదికను కలెక్టర్‌కు, వ్యవసాయ శాఖ కమిషనర్‌కు అందజేసినట్లు భాస్కర్‌రావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. కాగా, వడగండ్ల వర్షాలతో ఉద్యానవన పంట లకు ఎలాంటి నష్టం జరగలేదని ఆశాఖ సహా య సంచాలకులు సూర్యనారాయణ, మరియన్న చెప్పారు.
కడగండ్లు
Published Fri, Mar 7 2014 1:38 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM
Advertisement
Advertisement