Ahmed Babu
-
దేవాలయాన్ని కూల్చలేదని దుర్గగుడి ఈవో బదిలీ!
- గోశాలలో ఆంజనేయస్వామి గుడి తొలగింపు - జలభవన్ కూల్చకుండా నిలిపివేత విజయవాడ దేవాలయాలు కూల్చివేయడం ఒకవైపు సంచలనం కలిగిస్తుంటే మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా దేవాలయం కూల్చివేయలేదనే ఆగ్రహంతో కృష్ణాజిల్లా కలెక్టర్ అహ్మద్‌బాబు సూచనలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుర్గగుడి తాత్కాలిక ఈవో చంద్రశేఖర్ ఆజాద్‌ను బదిలీ చేశారనే సమాచారం నగరంలో హల్చల్ చేస్తోంది. అభివృద్ధి పనులు జరుగుతున్న తరుణంలో ఆజాద్‌ను బదిలీచేస్తే వివాదం అవుతుందని భావించిన ముఖ్యమంత్రి సమయస్ఫూర్తితో దుర్గగుడికి ఐఏఎస్ అధికారిని నియమించి ఆజాద్‌ను తాత్కాలిక బాధ్యతల నుంచి తప్పించారు. వివరాల్లోకి వెళితే... వారం రోజులుగా నగరంలో దేవాలయాలను అడ్డగోలుగా కూల్చివేశారు. ఇందులో భాగంగానే దుర్గగుడికి వెళ్లే అర్జున వీధిలోని గోశాలనులోని షెడ్లను, కృష్ణుడు మందిరాన్ని తొలగించారు. తొలుత అరవై అడుగులు మాత్రమే విస్తరించాలని ముఖ్యమంత్రి వద్ద గోశాల నిర్వాహకులు, మంత్రులకు మధ్య ఒప్పందం జరిగింది. అయితే దాన్ని తుంగలో తొక్కించి అర్జున వీధిని 100 అడుగులకు విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఆదేశాలను దుర్గగుడి ఈవో ఆజాద్‌తోపాటు కలెక్టర్ అహ్మద్బాబులు అమలుచేశారు. 106 అడుగుల దూరంలో ఆంజనేయస్వామి గుడి ఉంది. పనిలో పనిగా ఈ గుడిని కూడా పగలగొట్టించమంటూ కలెక్టర్ ఆదేశించారు. సిబ్బంది కొంతభాగం కూల్చిన తరువాత ఆజాద్ అంగీకరించలేదు. అది 106 అడుగులు ఉన్నందున, నిబంధనలకు విరుద్ధంగా తాను కూల్చబోనని చెప్పారు. ఇది తన ఆదేశమని, తక్షణం కూల్చించాలంటూ ఒత్తిడి చేశారు. ఇదేమీ ఆజాద్ పట్టించుకోకుండా మీరు రెవెన్యూ, నేను దేవాదాయ శాఖ ఉద్యోగినని, అంతగా కూల్చాలంటే తమ కమిషనర్‌తో చెప్పించాలంటూ తెగేసి చెప్పారట. ఆగ్రహించిన కలెక్టర్ అహ్మద్‌బాబు ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు చెవిన వేయడంతో 24 గంటలు గడిచేలోగా అజాద్‌కు బదులుగా ఐఏఎస్ అధికారికి దేవస్థానం బాధ్యతలు అప్పగించారు. కేవలం మాట వినలేదని ఆజాద్‌ను తొలగించడంపై ఇంద్రకీలాద్రి వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతున్నా మౌనంగా ఉన్నారు. రానున్నరోజుల్లోనైనా ఆంజనేయస్వామి గుడిని, గోశాలను పూర్తిగా తొలగిస్తారనే ప్రచారం నగరంలో జోరుగా సాగుతోంది. పురావస్తు శాఖకు చెందిన స్థలం స్వాధీనం... అర్జున వీధిలోని పురావస్తు శాఖకు చెందిన స్థలాన్ని ఆ శాఖ అధికారులు అనుమతులు లేకుండా రాత్రికి రాత్రి ఆక్రమించుకున్నారు. అక్కన్నమాదన్న గుహలుగా పేరుపొందిన గుహలకు ముందున్న ప్రహరీని పగులగొట్టారు. లోపల ఉన్న లాన్‌ను ధ్వంసం చేశారు. తమ ప్రమేయం లేకుండా తమ స్థలాన్ని తీసుకున్నారంటూ కేంద్ర ప్రభుత్వం, పురావస్తుశాఖాధికారులు జిల్లా అధికార యంత్రాంగానికి నోటీసులు ఇచ్చారు. జలభవన్ కూల్చివేతకు బ్రేక్ అర్జున వీధి విస్తరణలో భాగంగా కేంద్ర జలభవన్ను గత వారంలో అధికారులు కూల్చివేయబోయారు. అందులో పనిచేసే ఒక ఉద్యోగి భవనాన్ని కూల్చివేస్తున్న విషయాన్ని తమ ఉన్నతాధికారులకు చెప్పేవరకు ఆగాలని కోరినా వినకుండా కొట్టివేయబోయారు. చివరకు రికార్డులు తీసుకోవాలని చెప్పడంతో తొలగించకుండా ఆపారు. ఈ విషయం తెలుసుకున్న జలవనరుల శాఖాధికారులు తమ అనుమతి లేకుండా జలభవన్ను కొట్టివేస్తున్నారంటూ హైకోర్టుకు ఫిర్యాదు చేయడంతో భవనం కూల్చవద్దంటూ స్టే ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ భవనం కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేశారు. -
కలెక్టర్ వింత పోకడలు మానుకోవాలి
విజయవాడ : కలెక్టర్ బాబు.ఎ వింత పోకడలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ దుయ్యబట్టారు. గురువారం ఆయన ఆంధ్రరత్న భవన్లో విలేకర్లతో మాట్లాడారు. ఈ-పోస్ విఫలమవడంతో సకాలంలో రేషన్ అందక లబ్ధిదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్డుల ఏరివేత కోసమే ఇన్ని కుతంత్రాలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి దగ్గరలో ఉందన్న సాకుతో స్వరాజ్య మైదానంలోని రైతుబజార్‌ను తరలించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. సాంబమూర్తి రోడ్డులోని రైవస్ కాల్వ ఒడ్డుకు మార్చడంపై ప్రజలు, రాజకీయపక్షాలు వ్యతిరేకిస్తున్నా కలెక్టర్ చెవికెక్కకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటీవలే కోటిన్నర ఖర్చు చేసి స్టాల్స్ నిర్మాణం చేశారని, ఇప్పుడు అదంతా వృథా అవుతోందన్నారు. కలెక్టర్ ధోరణి వల్ల వ్యవసాయ పారిశ్రామిక ఎగ్జిబిషన్ దూరమైందని, పుస్తక ప్రదర్శనపై గందరగోళం నెలకొందన్నారు. జాతీయ రహదారి విస్తరణలో కృష్ణలంక ఫీడర్ రోడ్డు కుంచించుకుపోతున్నా కలెక్టర్ పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని కొలనుకొండ తెలిపారు. తాగునీటి ఎద్దడితో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారన్నారని పేర్కొన్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌పోర్టు శాఖల్లో పెరుగుతున్న అవినీతి కలెక్టర్ పని తీరును ప్రశ్నిస్తోందని పేర్కొన్నారు. రానున్న ఆగస్టులో కృష్ణా పుష్కరాల నిర్వహణ విషయంలో కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పని తీరు మార్చుకోకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు ఖాయమని ఈ సందర్భంగా ఆయన జోస్యం చెప్పారు. -
ఆ నాలుగు గంటలు
ఆదిలాబాద్ రిమ్స్ : సరిగ్గా సంవత్సరం క్రితం.. ఇదే ఆగస్టు నెల.. అప్పటి కలెక్టర్ అహ్మద్ బాబు ఐదున్నర గంటలపాటు రిమ్స్‌లో కలియతిరిగి హడలెత్తించారు.. ఇప్పుడు మళ్లీ అదే పునరావృతమైంది. ఇప్పుడు బాబు కాదు.. కలెక్టర్ జగన్మోహన్. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆస్పత్రిలోని అన్ని వార్డులు తిరిగారు. రిమ్స్ అధికారులకు సమాచారం లేకుండా రిమ్స్‌కు వచ్చి రోగులను సేవల గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ వచ్చిన విషయం తెలుసుకున్న డెరైక్టర్, మిగతా అధికారులు అక్కడికి చేరుకున్నారు. రోగుల రిజిస్టర్, కేషీట్లు పరిశీలించారు. రోగులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధవహించాలని సూచించారు. కలెక్టర్ వెంట రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ శశిధర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్‌చంద్ర, ఆర్ఎంవో శోభపవార్ ఉన్నారు. అణువణువూ తనిఖీ ముందుగా కలెక్టర్ రిమ్స్ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఫిమేల్ ఆర్థ్రోపెడిక్ వార్డులో రిజిష్టర్‌ను పరిశీలించగా డిశ్చార్జ్ చేసిన వారి వివరాలు లేకపోవడంతో స్టాఫ్ నర్సులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడంతో సూపర్వైజర్పై మండిపడ్డారు. మరమ్మతులు చేపట్టాలని ఇంజినీరింగ్ ఏఈని ఆదేశించారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డెరైక్టర్‌కు సూచించారు. రేడియోలజీ విభాగంలో ఒక్కరే రేడియోలజిస్టు ఉండటంతో మరొకరిని నియమించాలని ఆదేశించారు. పిల్లల వార్డుకు వచ్చే పిల్లల కోసం మినీపార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని డెరైక్టర్‌కు సూచించారు. ఆస్పత్రి పరిసర ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు. అనంతరం రిమ్స్ వైద్య కళాశాలలలోని డెరైక్టర్ చాంబర్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో అవసరమున్న పరికరాలు, సిబ్బంది, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే వీటికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని త్వరలో మంజూరు చేసేందుకు చర్యలు చేపడుతామని తెలిపారు. ప్రొజేరియా చిన్నారికి పరామర్శ రిమ్స్ చిల్డ్రన్స్ వార్డులో ప్రొజేరియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారి కవితను కలెక్టర్ జగన్మోహన్ పరామర్శించారు. త్వరలో వ్యాధి నయమవుతుందని, బాధపడకుండా ధైర్యంగా ఉండాలని చిన్నారికి కలెక్టర్ ధైర్యం చెప్పారు. వ్యాధి నయమయ్యేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని రిమ్స్ డెరైక్టర్‌ను ఆదేశించారు. సస్పెన్షన్‌కు ఆదేశం ఆస్పత్రిలో లోపించిన పారిశుధ్యంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వార్డులో చూసినా అపరిశుభ్రతే కనిపిస్తోందని, ఈ నిర్లక్ష్యానికి కారణమైన హెల్త్సూపర్వైజర్తోపాటు తనకింద పనిచేసే ఐదుగురు సూపర్వైజర్లను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. రోగులతోపాటు ఆస్పత్రిలోని పరిశుభ్రతను పర్యవేక్షించాల్సిన బాధ్యత వైద్యులపై కూడా ఉందన్నారు. ఆస్పత్రిలో సక్రమంగా పనిచేయకుంటే ఎవరైనా ఇంటికి వెళ్లిపోవచ్చని హెచ్చరించారు. ఆస్పత్రిలో రోగులకు అందించే వైద్యసేవలపై, పారిశుధ్యంపై నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలు తప్పవన్నారు. -
కలెక్టర్ బదిలీపై నిరసనలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పాలనను గాడిలో పెట్టి జిల్లావాసుల మన్ననలను పొందిన కలెక్టర్ అహ్మద్‌బాబు ఆకస్మిక బదిలీపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ అధికార యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేసిన కలెక్టర్‌ను సర్కారు ఆకస్మికంగా బదిలీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది కాలం పనిచేయగా, మరో ఏడాదిపాటు ఇక్కడే పనిచేస్తారని భావించిన తరుణంలో ఆకస్మిక బదిలీ జిల్లావాసులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. పలుచోట్ల నిరసనలు కలెక్టర్ అహ్మద్‌బాబును బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రైతు, జేఏసీ, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పలు మండలాల్లో రాస్తారోకో నిర్వహించారు. నిర్మల్‌లో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందజేశారు. కలెక్టర్‌గా బాబును కొనసాగించాలంటూ మంచిర్యాలలో రైతు కూలీ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. చెన్నూరు రహదారిపై ఓవర్‌బ్రిడ్జి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దండేపల్లిలో బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తాంసి మండల కేంద్రంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తలమడుగులో జేఏసీ, రైతులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాలను చేపట్టారు. అజయ్‌మిశ్రాను కలిసిన కలెక్టర్ బదిలీ ఉత్తర్వులు వెలువడిన వెంటనే అహ్మద్‌బాబు శు క్రవారం హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి ప్రభుత్వ కా ర్యదర్శి అజయ్‌మిశ్రాను కలిశారు. కాగా మరోవైపు తన బదిలీని నిలిపివేయాలని కోరుతూ కలెక్టర్ పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ ఈ విషయాన్ని కలెక్టర్ కొట్టి పారేశారు. అలాంటి యోచన తనకు లేదని అహ్మ ద్‌బాబు ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు.జిల్లాలో విద్య, వైద్య రంగాల అభివృద్ధి పకడ్బందీ ప్రణాళిక రూపొం దించామని, ఈ ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలు చే సేందుకు మరో ఆరునెలల సమయం ఇచ్చినా బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా కొత్తగా జిల్లా కలెక్టర్‌గా నియమితులైన డాక్టర్ ఎం.జగన్మోహన్ మరో రెం డు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. -
రాత్రికి రాత్రే..
ఆదిలాబాద్ : కలెక్టర్ అహ్మద్ బాబు గురువారం బదిలీ అయ్యారన్న సమాచారంతో ఆదిలాబాద్ పట్టణంలో ఆక్రమణదారులు విజృంభించారు. పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ గోడకు ఆనుకొని గురువారం రాత్రికి రాత్రే స్తంభాలు పాతి కబ్జాలకు దిగారు. దీంతో పాటు గర్ల్స్ హైస్కూల్ పక్కన రోడ్డుకు ఇరుైవైపుల దారిపొడవున ఆక్రమణలు వెలిశాయి. కాగాఐదు నెలల క్రితం కలెక్టర్ చొరవతో పట్టణంలోని ప్రధాన, అంతర్గత రోడ్లకు ఇరువైపుల కబ్జాలను తొలగించడం జరిగింది. అధికార పార్టికి చెందిన ఓ నేత ప్రమేయంతోనే పలువురు కబ్జాదారులు తిరిగి ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయంతోనే ఈ వ్యవహారం రాత్రికి రాత్రే జరిగిందని చర్చించుకుంటున్నారు. పట్టణంలో ఎన్నో ఏళ్లుగా రోడ్డును దర్జాగా ఆక్రమించి పలువురు షెల్టర్లు వేసి వ్యాపారాలు కొనసాగించారు. వాటిని అద్దెకిచ్చుకుంటూ లాభాలు పొందారు. ప్రధానంగా ఈ ఆక్రమణలో రాజకీయ నాయకుల పాత్ర ఉందన్న చర్చ జోరుగా సాగుతున్నది. -
కలెక్టర్ బదిలీ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :కలెక్టర్ అహ్మద్ బాబు బదిలీ అయ్యారు. ఆయనను హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న ఎం.జగన్మోహన్ను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. కలెక్టర్ బదిలీపై అధికార, రాజకీయ వర్గాల్లో వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ప్రభుత్వం ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాబు బదిలీ వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. 1999 బ్యాచ్‌కు చెందిన జగన్మోహన్ తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉంది. మెదక్ జిల్లా సిద్దిపేటతోపాటు, నల్గొండ జిల్లాలో ఆర్డీవోగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) ప్రాజెక్టు డెరైక్టర్‌గా పనిచేశారు. 2005 నుంచి 2008 వరకు విజయనగరం, రంగారెడ్డి జేసీగా పనిచేశారు. పాలనపై బాబు ముద్ర 2013 జూన్ 18న కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న అహ్మద్‌బాబు జిల్లా పాలనపై తనదైన ముద్ర వేశారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. బాధ్యతలు స్వీకరించిన కొత్తలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పలువురు అధికారులను, ఆరోపణలు ఎదుర్కొన్న సిబ్బందిని సరేండర్ చేస్తూ తీసుకున్న నిర్ణయాలు అప్పట్లో అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆదిలాబాద్, భైంసా వంటి పట్టణాల్లో ఆక్రమణల తొలగింపు విషయంలో సహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఐరీష్ విధానం ద్వారా బోగస్ లబ్ధిదారుల ఏరివేతకు చర్యలు తీసుకున్నారు. వివిధ పథకాలకు ఆధార్ అనుసంధానంలో దేశంలోనే ప్రముఖ స్థానంలో జిల్లాను నిలపడానికి కృషి చేశారు. ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని జీఎంఎస్ విధానం అమలు చేయడంతో ప్రజలకు కొంత మేలు జరిగింది. ఇటీవల జరిగిన మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలతోపాటు గతేడాది జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వహించారు. రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం లోను కాకుండా తనదైన శైలిలో పాలన కొనసాగించారు. ఉద్యోగుల్లో కొంత వ్యతిరేకత కలెక్టర్ వ్యవహారశైలిపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. సమీక్షా సమావేశాల్లో కలెక్టర్ మాట తీరుతో పలువురు జిల్లా ఉన్నతాధికారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా కేవలం సమీక్షలకే పరిమితమయ్యారనే విమర్శలు ఉన్నాయి. కలెక్టర్ వ్యవహార శైలిని నిరసిస్తూ పలుమార్లు నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. -
జలమండలికి ఇద్దరు కొత్త సారథులు..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కీల కమైన మంచినీటి సరఫరా విభా గం జలమండలికి ప్రభుత్వం ఇద్దరు కొత్త సారథులను నియమించింది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిని బదిలీ చేసి కొత్త వారికి పోస్టింగ్ ఇచ్చింది. గురువారం జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో మేనేజింగ్ డెరైక్టర్‌గా ఎం.జగదీశ్వర్ (1993 బ్యాచ్ ఐఏఎస్), ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా అహ్మద్ బాబు (2003 బ్యాచ్ ఐఏఎస్) నియమితులయ్యారు. జగదీశ్వర్ గతంలో రెండున్నరేళ్లకుపైగా జలమండలి ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటివరకు ఇక్కడ ఎండీగా పనిచేసిన జె.శ్యామలరావును తప్పించారు. ఆయన ఏపీ సర్కార్‌లో పనిచేసేందుకు ఆప్షన్ ఇచ్చినందునే ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదని తెలి సింది. ఆయన సుమారు 22 నెలలుగా ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. జలమండలి ఈడీగా ఉన్న జగన్మోహన్ ఆదిలాబాద్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. అక్కడి కలెక్టర్ అహ్మద్ బాబు జలమండలి ఈడీగా నియమితులయ్యారు. బదిలీల్లో కన్పించిన హరీష్‌రావు మార్క్..! జలమండలి ఎండీ, ఈడీల బదిలీ విషయంలో బోర్డు గుర్తింపు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులైన ఇరిగేషన్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు ప్రమేయమున్నట్టు తెలుస్తోంది. గతంలో జలమండలి మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేసిన ఎం.జగదీశ్వర్‌కు హరీష్‌రావు ఆశీస్సులున్నట్టు సమాచారం. అందుకే ఆయనకు తిరిగి కీలకమైన ఎండీ బాధ్యతలు అప్పగించడంలో హరీష్ చక్రం తిప్పినట్టు తెలిసింది. కలెక్టర్ పోస్టు కోసం ఎదురుచూస్తున్న ఈడీ డాక్టర్ జగన్మోహన్కు ఆదిలాబాద్ కలెక్టర్ బాధ్యతలు దక్కడం వెనుక హరీష్‌రావు సహకారం ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త ఎండీకి సమస్యలే స్వాగత తోరణం.. మూడున్నరేళ్లవిరామం తర్వాత తిరిగి జలమండలి ఎండీగా బాధ్యతలు స్వీకరించనున్న ఎం.జగదీశ్వర్‌కు పలు సమస్యలు స్వాగతం పలుకనున్నాయి. అవి.. వివాదాస్పదమైన జీపీఈ(జనరల్ పర్పస్ ఎంప్లాయ్) పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయడం. బోర్డులో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎన్ఎంఆర్, హెచ్ఆర్ కార్మికులకు న్యాయం చేయడం.సుదూర ప్రాంతాల నుంచి నగరానికి తరలిస్తున్న మంచినీటిలో సరఫరా నష్టాలను 40 నుంచి 20 శాతానికి తగ్గించాల్సి ఉంది.జలమండలికి రావాల్సిన రూ.200 కోట్ల నీటిబిల్లులను వసూలు చేయాలి. గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపాలిటీల్లో డ్రైనేజీ, మంచినీటి వసతులను కల్పించాలి. ఇందుకోసం జేఎన్ఎన్యూఆర్ఎం రెండో దశ కింద మంజూరైన పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్వర్ జలమండలి నూతన మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమితులైన జగదీశ్వర్ గురువారం సాయంత్రం ఖైరతాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో ప్రస్తుత ఎండీ శ్యామలరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. బదిలీ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆయన విధుల్లో చేరడం విశేషం. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కలెక్టర్‌గా ఏడాది
కలెక్టరేట్ : కలెక్టర్‌గా అహ్మద్‌బాబు బాధ్యతలు స్వీకరించి బుధవారంతో ఏడాది అయింది. అప్పటి కలెక్టర్ అశోక్ నుంచి 2013 జూన్ 18న అహ్మద్ బాబు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు తూర్పుగోదావరిలో జేసీగా పని చేశారు. కలెక్టర్‌గా జిల్లాకు వచ్చిన ఏడాదిలోనే పాలనలో తనదైన ముద్రవేశారు. అధికారులు, ఉద్యోగుల్లో క్రమశిక్షణతోపాటు విధుల నిర్వహణలో సమూల మార్పు లు తీసుకొచ్చారు. క్రమశిక్షణ లేని అధికారులను సరెండర్ చేశారు. ఆక్రమణల తొలగింపులో తనదైన ముద్రవేశారు. నగదు బదిలీ, ఐరీష్ విధానం ద్వారా పింఛన్ల పంపిణీ, ఉపాధి హామీ పథకం అమలులో జా తీయ స్థాయి అవార్డు, ఆధార్ కార్డుల నమోదులో దేశంలోనే మొదటి స్థానం, ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు జీఎంఎస్ విధానం ప్రవేశపెట్టిన ఘనత కలెక్టర్‌కే దక్కుతుంది. 2014 జనవరి నుంచి ప్రజా ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా స్వీకరించే విధానం గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(జీఎంఎస్) తీసుకువచ్చారు. ఫిబ్రవరి 2, 2014న అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జైరాం రమేష్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 2014లో జరిగిన స్థానిక, మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకుగాను అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహాంతి కలెక్టర్‌కు ప్రశంసలు తెలిపారు. -
అంబరాన్నంటిన సంబరాలు
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సంబరాలు రెండో రోజైన మంగళవారమూ అంబరాన్ని తాకాయి. బతుకమ్మ.. బతుకమ్మ.. మా తల్లి బతుకమ్మ అంటూ మహిళలు, చిన్నారులు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఆడిపాడారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం డీఆర్డీఏ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు కొనసాగాయి. ఇందులో భాగంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. వివిధ సంఘాల మహిళలు సంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి.. గౌరమ్మ, వివిధ రకాల పూలతో సద్దుల బతుకమ్మను అలంకరించి, గౌరమ్మపూజలు చేశారు. తెలంగాణ అమరులను స్మరించుకున్నారు. కాగా.. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతిభ కనబర్చిన మహిళా సంఘాలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆదిలాబాద్ పట్టణం కోలీపూరకు చెందిన శ్రీలక్ష్మి బృందం ప్రథమ బహుమతి, జైనథ్ మండలానికి చెందిన గణిత బృందం ద్వితీయ బహుమతి, ఆదిలాబాద్‌ద పట్టణానికి చెందిన భాగ్యలక్ష్మి బృందం తృతీయ బహుమతి గెలుచుకుంది. వారికి కలెక్టర్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, అదనపు జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ రాజ్, డీఎస్డీవో సుధాకర్‌రావు, మెప్మా పీడీ రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. బతుకమ్మ ఆడిన కలెక్టర్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా నిర్వహించిన బతుకమ్మ పోటీల్లో భాగంగా కలెక్టర్ అహ్మద్‌బాబు కూడా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆనందంగా గడిపారు. తదుపరి ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ ప్రత్యేక రాష్ట్రంలో మరింత ఎక్కువగా పనిచేసి అభివృద్ధికి బాటలు వేసుకోవాలన్నారు. ఈ సంబరాలు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు శుభసూచకమని తెలిపారు. -
‘ప్రత్యేక’ పండుగ
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. కలెక్టర్ అహ్మద్ బాబు సంబంధిత శాఖల అధికారులతో వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం సమీక్షించారు. జూన్ 2 అపాయింటెడ్ డేను పురస్కరించుకుని పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల మాదిరిగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆటల పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి వారం రోజులపాటు ఈ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు.. ప్రధాన పార్టీలు కూడా ‘తెలంగాణ’ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాయి. టీఆర్ఎస్ శ్రేణులు ఈ ఏర్పాట్లలో మునిగి తేలుతున్నాయి. అధినేత కేసీఆర్ జూన్ 2 నాడే ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో మరింత ఉత్సాహంగా సంబరాలు నిర్వహించాలని భావిస్తున్నాయి. ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వెనుక తమ పార్టీ అధినేత్రి సోనియా కృషి ఎంతో ఉం దని, తెలంగాణ కల సాకరమైన వేళ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. బీజేపీ ఆధ్వర్యంలో కూడా సంబ రాలు నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయిం చింది. జాతీయ జెండాల ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. టీఎన్జీవోలు.. ప్రజాసంఘాలు.. టీఎన్జీవో, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయా సంఘాల నేతలు సంసిద్ధమయ్యారు. టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవాలని నిర్ణయించారు. సోమవారం ఉదయం పట్టణంలో ర్యాలీ నిర్వహించి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించాలని భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. వారం రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు వారం రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ కళాకారులు భావిస్తున్నారు. తెలంగాణవాదుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ధూం ధాం కార్యక్రమాలను పలు చోట్ల నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంతోపాటు, అన్ని పట్టణాల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల వారు సిద్ధమయ్యారు. -
వారం రోజులు ఆవిర్భావ వేడుకలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర అవిర్భావం సందర్భంగా జూన్ 2 నుంచి వారం రోజులపాటు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున అవిర్భావ వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ అహ్మద్‌బాబు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆవిర్భావ సం బరాలకు సంబంధించి అధికారులతో సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అహ్మద్ బాబు మాట్లాడుతూ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, జిల్లా పరిషత్, మున్సిపల్ కా ర్యాలయాలతోపాటు అన్ని మండల కేంద్రాల్లోని మం డల కార్యాలయాల్లో విద్యుద్దీపాలతో అలంకరించాల ని ఆదేశించారు. జూన్ 2న జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో ఉదయం 8:45 గంటలకు జాతీయ ప తాకం ఆవిష్కరించి తెలంగాణ అవతరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ శా ఖలవారీగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా ఆస్తుల పంపకాలు నిర్వహించబడుతాయని తెలిపారు. జూన్ 2 నుంచి వారం రోజులపాటు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంట ల వరకు పట్టణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తెలంగాణ చారిత్రక ప్రదర్శన న మూనాలతో, ఛాయచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాల ని డీపీఆర్వోను ఆదేశించారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, భైంసా పట్టణాలలోని ప్రధాన రహదారులలో స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, గాంధీపార్కులలో విద్యుద్దీపాలతో అలకరించడంతోపాటు డెకొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, అదనపు జేసీ రాజు, జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, డీఆర్వో ప్రసాదరావు, సీపీవో షేక్మీరా, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, డీటీసీ ప్రవీణ్‌రావు, అధికారులు పాల్గొన్నారు. -
సాధారణ పనులపై దృష్టి సారించాలి
ఎన్నికలు ముగిశాయి, ఇక సాధారణ పనులపై దృష్టి సారించాలని కలెక్టర్ అహ్మద్‌బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల విభాగానికి ముందు కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. వేసవిలో తాగునీటి సమస్య, ఖరీఫ్ సీజన్ ప్రారంభం నేపథ్యంలో సక్రమంగా విత్తనాలు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. సరిపడా ఎరువులు, విత్తనాలు జిల్లాకు చేరుకున్నాయా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది పది, ఇంటర్మీడియెట్ ఫలితాలు తక్కువగా వచ్చాయని, వచ్చే ఏడాది 75 శాతం నుంచి 80 శాతం ఫలితాలు సాధించాలని తెలిపారు. ఇప్పటి నుంచి విద్యాశాఖ పిల్లల చదువుపై దృష్టి సారించాలని అన్నారు. పాఠ్యపుస్తకాలు వచ్చాయని, ఇప్పటికే కొన్ని మండలాల్లో పంపిణీ చేశారని తెలిపారు. ఈ నెలలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ‘మార్పు’ అనే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు చెప్పారు. అధికారులందరూ భాగస్వాములు కావాలని అన్నారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు జేసీ ఎస్ఎస్ రాజు, జెడ్పీ సీఈవో అనితాగ్రేస్, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, సీపీవో షేక్మీరా, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. సోయా విత్తనాలపై 50శాతం సబ్సిడీ ఇవ్వాలని వినతి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సోయా విత్తనాలపై 50శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కలెక్టర్ అహ్మద్‌బాబుకు కోరారు. సోమవారం కలెక్టర్‌ను తన క్యాంపు కార్యాలయం కలిసి విన్నవించారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 25 శాతాన్ని 50శాతానికి పెంచేలా చూడాలని కోరారు. సోయా విత్తనాలు క్వింటాల్‌కు రూ.3వేల నుంచి రూ.3,500కు విక్రయించారని తెలిపారు. ఈ ఏడాది 25శాతం సబ్సిడీతో క్వింటాల్‌కు రూ.7,535 ధర ప్రకటించారని పేర్కొన్నారు. జిల్లాలో సోయా పంట ఎక్కువగా పండిస్తారని, 50శాతం సబ్సిడీ ఇవ్వాలని అన్నారు. గత ఏడాది సబ్సిడీ డబ్బులు ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమ కాలేదని తెలిపారు. ఫిర్యాదుల విభాగం వెల వెల.. వీడియో కాన్ఫరెన్స్ కళకళ వరుస ఎన్నికలు, ఓట్ల లెక్కింపు, కోడ్ నేపథ్యంలో ప్రజాఫిర్యాదుల విభాగం నిలిపి వేసిన విషయం తెలిసిందే. సోమవారం ప్రారంభమై ప్రజాఫిర్యాదుల విభాగానికి అర్జీదారులు హాజరైనా.. ఆయా శాఖల అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కాలేదు. దీంతో అధికారులు లేక ఫిర్యాదుల విభాగం బోసిపోయింది. తహశీల్దార్ కిరణ్‌ప్రకాశ్, ఎంపీడీవో సయ్యద్సాజిద్ అలీ, ఏవో వీణ, వర్క్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ అధికారి శేఖర్ హాజరయ్యారు. కాగా, సాయంత్రం నుంచి రాత్రి వరకు జరిగిన కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌కు అధికారులు అధిక సంఖ్యలో హాజరు కావడం కొసమెరుపు. తహశీల్దార్ చాంబర్లో స్థలం లేక కొందరు అధికారులు ఆరుబయట గదుల్లో వేచి చూడడం కనిపించింది. - న్యూస్‌లైన్, ఖానాపూర్ ఆరు నెలలుగా వేతనాలు లేవు మంచినీటి సమస్యపై గ్రామాల్లో పర్యటిస్తూ.. సమస్యను పరిష్కరిస్తూ.. తీవ్రమైన సమస్య ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేస్తూ విధులు నిర్వర్తిస్తున్న తమకు ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆర్‌డబ్ల్యూఎస్‌లోని టెక్నికల్ అసిస్టెంట్లు సోమవారం కలెక్టర్ అహ్మద్ బాబుకు విన్నవించారు. 40 మంది పని చేస్తున్నామని, నెలకు రూ.లక్ష వరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు వస్తాయని, అధికారులు తమకు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ వేసవిలో ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో నీటి సమస్య పరిష్కరించామని, అధికారులకు విన్నవించామని తెలిపారు. వేతనాలు అందకపోవడంతో ఏజెన్సీ ప్రాంతాలకు మోటారుసైకిల్‌పై వెళ్లి విధులు నిర్వర్తించడం కష్టంగా ఉందని తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో టెక్నికల్ అసిస్టెంట్లు రాజశేఖర్, రామునాయక్, ఎండి.అజార్, చంద్రశేఖర్, మోహన్ ఉన్నారు. పాసుపుస్తకాలు చేసివ్వడం లేదు మా గ్రామ శివారులో నాకు సర్వే నంబరు 386లో 50 ఎకరాల భూమి ఉంది. కొన్నేళ్లుగా సాగు చేస్తున్నం. కొన్ని రోజుల క్రితం నాకు తెలియకుండా 20 ఎకరాల భూమిని వేరే వ్యక్తులకు పట్టా చేసి ఇచ్చారు. నాకు 50 ఎకరాల భూమిని పట్టా చేసివ్వమంటే అధికారులు ఇబ్బందులు పెడుతున్నరు. ఇంటి స్థలం కూడా పట్టా చేసివ్వాలి. ఇందుకోసం పదేళ్ల నుంచి తిరుగుతున్నా పట్టాపాస్‌పుస్తకాలు ఇవ్వడం లేదు. కార్యాలయానికి రావొద్దని అధికారులు బెదిరిస్తుండ్రు. కలెక్టర్‌కు నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. నా భూమిని పట్టా చేసి పాసుపుస్తకాలు ఇవ్వాలి. - అంబకంటి గంగన్న, కుంటాల -
240 టేబుళ్లలో ‘సార్వత్రిక’ లెక్కింపు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల లెక్కింపు 240 టేబుళ్లలో నిర్వహిస్తామని కలెక్టర్ అహ్మద్‌బాబు తెలిపారు. మరో 14 టేబుళ్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సారి ఓట్ల లెక్కింపులో ప్రతీ టేబుల్‌కు ఒక ప్రింటింగ్ కమ్ యాక్సిలరీ డిస్ప్లే యూనిట్‌ను (పాడు) ఏర్పాటు చేశామన్నారు. ఈ విధానం గురించి కలెక్టర్ రాజకీయ ప్రతినిధులకు తెలియజేశారు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవ ర్గాల ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 20 కౌంటింగ్ హాళ్లలో జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి 11,228, పది అసెంబ్లీ స్థానాలకు 15,028 వినియోగించుకున్నారని తెలిపారు. జిల్లాలో జరిగే ఓట్ల లెక్కింపును ఎనిమిది మంది పరిశీలకులు పర్యవేక్షిస్తారన్నారు. జిల్లాకు కొత్తగా కౌంటింగ్ పరిశీలకులు శివ్కాన్ ద్వివేది, ప్రమోద్‌కుమార్, ఓంప్రకాష్ పాటస్కర్, రాకేశ్‌కుమార్ వచ్చారని తెలిపారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో పరిశీలకులు ఉంటారని వివరించారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ పేపర్‌ను లెక్కించేం దుకు కూడా ముగ్గురు అధికారుల చొప్పున నియమించామన్నారు. సరిపడా కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలని రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. ఇప్పటి వరకు కొంత మంది ఏజెంట్లను నియమించుకున్నారని తెలిపారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, ముథోల్, ఆదిలాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో (బాలుర)లో జరుగుతుందన్నారు. బోథ్, నిర్మల్, ఖానాపూర్, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల (బాలికల)లో జరుగుతుందన్నారు. -
రిమ్స్ ఆస్పత్రిలో అవినీతి రాజ్యం
అబ్బాయి పుడితే రూ.800.. అమ్మాయి పుడితే రూ.500..గ్రూపులుగా మారి వసూళ్ల దందా బాధితులను పీక్కుతింటున్న సిబ్బంది కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : రిమ్స్ ఆస్పత్రిలో అవినీతి రాజ్యమేలుతోంది. వైద్యం కోసం వచ్చే పేదల నుంచి సిబ్బంది డబ్బులు దండుకుంటున్నారు. ముఖ్యంగా ప్రసూతి విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. పుట్టిన బాబుకు, పాపకు ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రిని నిర్వహిస్తున్నా.. రూ.వేల జీతా లు తీసుకుంటున్న సిబ్బంది అక్రమమార్గంలో వసూళ్ల పర్వం మొదలుపెట్టారు. ఆస్పత్రికి రోజూ సుమారు 30 నుంచి 40 ప్ర సూతి కేసులు వస్తుంటాయి. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.1,000 నుంచి రూ.1,500 వరకు బంధువుల నుంచి సిబ్బంది వసూలు చేస్తున్నారు. కానీ రిమ్స్ ఉన్నతాధికారులు మాత్రం ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రూపులుగా వసూళ్లు ప్రసూతి కోసం వచ్చిన మహిళా బంధువుల నుంచి ప్రసూతి విభాగం సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది గ్రూపులుగా మారి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముందుగా ఆస్పత్రికి వచ్చిన మహిళను ప్రసూతి విభాగంలో చేర్పిస్తారు. అక్కడి సిబ్బంది ఆపరేషన్‌కు సంబంధించిన దుస్తులు మహిళ ధరించిన తర్వాత రూ.200 తీసుకుంటారు. ఆ తర్వాత డెలివరీ అయిన వెంటనే ఆపరేషన్ థియేటర్లో ఉండే ఇద్దరు సిబ్బంది పుట్టిన పాపకు లెక్కకట్టి మరీ వసూలు చేస్తారు. బాబు పుడితే రూ.800, పాప పుడితే రూ.500 తీసుకుంటారు. సదరు బంధువులు డబ్బులు ఇచ్చేంత వరకు పుట్టిన బిడ్డను వారి చేతికివ్వకుండా ఇబ్బంది పెడతారు. దీంతో ఏం చేయలేని పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చి బిడ్డను తీసుకుంటారు. ఇవేకాకుండా అదనంగా అక్కడి నుంచి ప్రసూతి వార్డుకు తరలించేందుకు వార్డు బాయ్‌కి రూ.100, ప్రసూతి వార్డులో పడక చూపించిన సిబ్బందికి రూ.300, పుట్టిన బిడ్డకు ఆయిల్ రాసి శుభ్రం చేసే సిబ్బందికి రూ.200 ఇలా ఎక్కడి సిబ్బంది అక్కడే దోచుకుంటున్నారు. మొత్తంగా సుమారు రూ.1500 వరకు వసూలు చేయందే విడిచిపెట్టరు. ఎవరికి ఎంతెంత డబ్బులు ఇవ్వాలనేది కూడా సిబ్బంది ముందుగానే బాధితులకు చెబుతారు. తాము 10 నుంచి 15 మంది ఉంటామని, మీరిచ్చిన డబ్బులు అందరం పంచుకుంటామని స్వయంగా వారే చెప్పడం గమనార్హం. ప్రసూతి వార్డుకు తల్లిని, బిడ్డను తీసుకెళ్లిన తర్వాత ఒక మహిళ సిబ్బంది వచ్చి డబ్బులు వసూళు చేసుకొని వెళ్తొంది. ఆ తర్వాత మరో మహిళ సిబ్బంది వచ్చి అంతకుముందు ఇచ్చిన డబ్బులు తమకు కావని వారు ఆపరేషన్ థియేటర్ సిబ్బంది అంటూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి డబ్బుల కోసం మహిళ బంధువులు పీక్కుతింటున్నారు. ఒకవేళ సిబ్బంది అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే వారికి నరకం చూపేడుతున్నారు. ఇక గిరిజన మహిళల పరిస్థితి మరీ దారుణం. కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు రిమ్స్‌లోని ప్రసూతి వార్డులో జరుగుతున్న అవినీతి గురించి స్వయంగా కలెక్టర్ అహ్మద్ బాబుకు బాధితులు ఫిర్యాదు చేశారు. గతేడాది ఆగష్టులో రిమ్స్ తనిఖీలకు వచ్చిన కలెక్టర్‌ను కలిసిన కొంత మంది బాధితులు తమ నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని విన్నవించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసూతి వార్డులో ఉన్న సిబ్బందిని వేరే వార్డుల్లోకి మార్చాలని రిమ్స్ అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అయినప్పటికి కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ సిబ్బంది వసూళ్ల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రసూతి వార్డు ఇన్చార్జీ అధికారులు ఈ విషయాన్ని మామూలుగా తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని ఎవరికైన చెబితే ఎక్కడ మళ్లీ తమను హింసిస్తారనే భయంతో బాధితులు నోరు మెదపడం లేదు. ఏదేమైన ప్రసూతి వార్డులో అవినీతి కంపును తొలగించాలని పలువురు కోరుతున్నారు. దృష్టి సారిస్తాం.. రిమ్స్ ప్రసూతి వార్డులో డబ్బులు వసూలు చేసే సిబ్బంది చర్యలు తీసుకుంటాం. ఇకపై సిబ్బంది డబ్బులు తీసుకుంటున్నారనే దానిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. గతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ వార్డులో ఉన్న సిబ్బందిని వేరే వార్డుకు బదిలీ చేయడం జరిగింది. ఆస్పత్రికి వచ్చిన వారిని సిబ్బంది డబ్బులు అడిగితే తమకు ఫిర్యాదు చేయాలి. సదరు సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటాం. - డాక్టర్ శశిధర్, రిమ్స్ డెరైక్టర్ -
నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి సక్రమంగా అమలు చేస్తామని, అతిక్రమిం చిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని కలెక్టర్ అహ్మద్‌బాబు హెచ్చరించారు. శనివారం కలెక్టర్ తన చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏ ర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూ చించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంలను సిద్ధం చేశామన్నారు. ఈవీఎంలపై పలు దఫాలుగా శిక్షణ ఇచ్చామని, మలిదశ ఈవీఎంల ర్యాండమైజేషన్ ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తామని తెలిపారు. సిద్ధం చేసిన ఈవీ ఎంలను రెండు రోజుల్లో ఆయా నియోజకవర్గాల స్ట్రాంగ్ రూంలకు పూర్తి బందోబస్తుతో క్లోజ్డ్ వ్యానులో తరలిస్తామని చెప్పారు. అభ్యర్థులకు ఫొటో గుర్తింపు కార్డులు అందజేస్తామని, ఏజెంట్లకు వాహనాల వినియోగం అనుమతి సింగిల్ విండో ద్వారా ఇస్తామని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా జారీ చేసిన అనుమతి పత్రాలను ఆయా వాహనాలకు ఒరిజినల్ పత్రాలు అతికించాలన్నారు. అభ్యర్థుల ప్రచారంలో భాగంగా ముద్రించబడిన కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రిపై ప్రింటర్, పబ్లిషర్ పేరు తప్పకుండా ముద్రించాలన్నారు. ఎన్నికల అధికారి జారీ చేసిన ధరలకు అనుగుణంగా ఎన్నికల ఖర్చుల పరిశీలన ఉంటుందన్నారు. ఎక్కువ చెల్లింపులు అకౌంట్ పే ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే అర్హత కోల్పోతారని హెచ్చరించారు. ఓటర్ల జాబితా మరో రెండు రోజుల్లో సీడీతోపాటు హార్డ్ కాపీ అందజేస్తామని వివరించారు. ఎన్నికల పరిశీలకుడు పంకజ్ జోషి మాట్లాడుతూ.. ఏవైనా ఫిర్యాదులు ఉన్నట్లైతే ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కలెక్టరేట్లో అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎస్పీ గజరావు భూపాల్ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే చట్టపర చర్యలు తీసుకుంటామని, రాత్రి 10 గంటల అనంతరం ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని అన్నారు. సమావేశంలో జేసీ బి.లక్ష్మీకాంతం, అభ్యర్థులు నరేష్ జాదవ్, పవార్ కృష్ణ, నేతావత్‌రాందాస్, బంక సహదేవ్, మొసలి చిన్నయ్య, నాయకులు యూనీస్ అక్బానీ, సంతోష్, దుర్గం రాజేశ్వర్, రమణారెడ్డి పాల్గొన్నారు. -
గుంజాల గోండు లిపి అభివృద్ధికి కృషి
నార్నూర్, న్యూస్‌లైన్ : గుంజాల గోండు భాష లిపి అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. సోమవా రం మండలంలోని గుంజాల గ్రామం లో గుంజాల గోండు భాష లిపి దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఐటీడీఏ పీవో జనార్దన్‌నివాస్‌తో కలిసి గుంజాల గోండు భాష లిపితో తయారు చేసిన మొదటి వాచకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పరిశోధన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. లిపి ప్రతులను దాచిన పెద్దలను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తరతరాల నుంచి వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత ఈ తరం యువతతోపాటు ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శతాబ్దం నాటి గోండు భాషతో కూడిన లిపి ప్రతులను దాచి ఉంచడం సంతోషంగా ఉందన్నారు. గుంజాల గోండు లిపి సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం నుంచి వచ్చిందన్నారు. గుంజాల గోండు భాష లిపి అభివృద్ధి కోసం రూ.15 లక్షలతో రీసర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సెంటర్లో లిపిలో బోధించడానికి కో-ఆర్డినేటర్‌గా వినాయక్‌రావ్‌ను నియమిస్తున్నామని ప్రకటించారు. గోండు భాష లిపి అభివృద్ధి కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నం చేస్తానన్నారు. అనంతరం గుంజాల గోండు భాష లిపి వెలికి తీసి తెలుగులో అనువాదం చేసిన ప్రొఫెసర్ జయదీర్ తిరుమల్‌రావు మాట్లాడుతూ దేశంలో ఎన్నో భాషలకు లిపి ఉన్నా ఈ లిపికి ద్రావిడ భాషకు సంబంధం ఉందన్నారు. లిపితో కూడిన సాఫ్ట్‌వేర్‌ను సెంటర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీధర్‌బాబు తయారు చేయడం జరిగిందన్నారు. వచ్చే ఈ దినోత్సవం నాటికి గోండు భాషలో కథలు, వాచక పుస్తకాలు తయారు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో లిపి రూపకర్తలు కొట్నాక్ జంగు, కుర్ర విఠల్‌రావ్, ఆరక జైవంతరావ్, కుర్ర లాల్‌షావ్, ఆత్రం కమలాబాయి, నాయకులు ఆర్జు, సీడం భీమ్, మెస్రం దుర్గు, కొవ లక్ష్మి, ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధి వేణుగోపాల్, సర్పంచ్ కృష్ణ పాల్గొన్నారు. -
ప్రశంసపత్రాలు అందుకున్న ఉద్యోగులు వీరే..
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు కలెక్టర్ అహ్మద్ బాబు ప్రశంసపత్రాలు అందజేశారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో ప్రశంసపత్రాలు అందించారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శాంతికుమారి(బేల), జి.శ్రీధర్(సిర్పూర్ టౌన్), జూనియర్ కళాశాల లెక్చరర్లు డి.దయాకర్(తాంసి), టి.నర్సయ్య(ఖానాపూర్), ఎం.సంతోశ్‌కుమార్(తాంసి), ఎం.బాలాజీ(బజార్హత్నూర్), ఆర్.శ్రావణ్ (ఉట్నూర్), జుఫిషాన్ సుల్తానా(ఆదిలాబాద్), జె.రవికిరణ్(మామడ), కె.సుదర్శన్(నేరడిగొండ), సరితరాణి(ముథోల్), జె.బల్రాం(నేరడిగొండ), ఎం.నర్సింగ్‌రావు(తాంసి), కె.మోహన్‌బాబు(తాంసి), జె.సువర్ణ(ఖానాపూర్), వీఎన్.రవి(బేల), ఎం.స్వామి(ఉట్నూర్), ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి చెందిన బి.సాగర్(ల్యాబ్ టెక్, ఉట్నూర్), శ్రీపద్వార్ శ్రీనివాస్(ఆదిలాబాద్), బి.సాగర్(ల్యాబ్‌టెక్, ఉట్నూర్) ప్రశంసపత్రాలు అందుకున్నారు. న్యాయశాఖలో వి.భాస్కర్(టైపిస్ట్, అకౌంటెంట్, నిర్మల్), బి.జితన్సింగ్(ఆఫీస్ సబార్డినెట్, భైంసా), బి.సాంబశివ్(సూపరింటెండెంట్, ఆదిలాబాద్), ఎన్.ప్రతాప్‌రెడ్డి(సీనియర్ అసిస్టెంట్, ఆదిలాబాద్), జి.రఘు(ఫీల్డ్ అసిస్టెంట్, మంచిర్యాల) ఉన్నారు. మార్కెటింగ్ శాఖలో టి.మనోహర్సింగ్(రికార్డర్ ఏడీ మార్కెటింగ్, ఆదిలాబాద్), ఎ.కిష్టాగౌడ్(సెక్రెటరీ గ్రేడ్-2 ఏఎంసీ, ఆదిలాబాద్), ఎన్.మనోహర్(సెక్రెటరీ గ్రేడ్-2 ఏఎంసీ, ఇంద్రవెల్లి). మార్క్‌ఫెడ్‌లో.. లక్ష్మణ్‌రాజు(సీఈవో, పీఏసీఎస్ తాంసి), సాయరెడ్డి(సీఈవో, పీఏసీఎస్ బిద్రెల్లి), షేక్ న్యాజ్ అలీ(సీఈవో, పీఏసీఎస్ కొత్తపేట్). వైద్య, ఆరోగ్యశాఖలో.. బి.వెంకట్మ్రణ(ఎంఐఎస్ ఎన్ఆర్హెచ్ఎం, ఆదిలాబాద్), రవీందర్(డీపీవో ఎన్ఆర్హెచ్ఎం, ఆదిలాబాద్). వైద్యాధికారులు బాబు(పీహెచ్సీ, నార్నూర్), కుమారస్వామి(పీహెచ్సీ, తాంసి), సృజన(పీహెచ్సీ, ఝరి), వెంకటేశ్వర్లు(పీహెచ్సీ, బెజ్జూర్), రేష్మ(పీహెచ్సీ, రోంపల్లి), మురళీకృష్ణ(పీహెచ్సీ, తానూర్), రామచందర్(పీహెచ్సీ, తాళ్లపేట్), బి.కృష్ణ(ఎల్టీ, జిల్లా టీబీ సెంటర్, ఆదిలాబాద్), లాలయ్య(ఎస్టీఎస్ జిల్లా టీబీ సెంటర్, ఆదిలాబాద్) ఆరోగ్యమిత్రలు.. సురమల్ల వసంత(వెంకట్రావ్‌పేట్, మంచిర్యాల), సద ముత్తన్న(దిలావర్పూర్, పీహెచ్సీ నిర్మల్), ఎం.స్వప్న(రాంనగర్ పీహెచ్, నిర్మల్), దుర్గ్ రమేశ్(గిమ్మ, పీహెచ్సీ ఆదిలాబాద్), ఇందూరి పద్మలత(కాగజ్‌నగర్, పీహెచ్సీ), యశ్మిని(మందమర్రి, పీహెచ్సీ బెల్లంపల్లి), జె.ప్రియాంక(నార్నూర్, పీహెచ్సీ ఉట్నూర్), జాదవ్ మాబ్జీ(ఉట్నూర్), సుంకరి ముకేష్‌కుమార్(ఏరియా ఆస్పత్రి, నిర్మల్), రాపెలిక్ల సత్యనారాయణ(జిల్లా మేనేజర్, ఆదిలాబాద్), వైద్యులు యు.కాశినాథ్(రేడియాలజిస్ట్, ఏహెచ్ భైంసా), సురేందర్(జనరల్ సర్జన్, ఏహెచ్ భైంసా), నీరజ(జనరల్ మెడిసిన్, ఏహెచ్, మంచిర్యాల). పంచాయతీరాజ్‌శాఖలో విలాస్‌కుమార్ గౌడ్(సూపరింటెండెంట్, ఎంపీపీ కడెం), సీహెచ్.కొండయ్య(టైపిస్ట్ ఎంపీపీ, మంచిర్యాల), వి.దామోదర్(ఆఫీస్ సబార్డినేట్, పీఆర్ డివిజన్, ఆదిలాబాద్), ఆకుల శ్యామ్(డీఎల్పీవో, నిర్మల్), భిక్షపతి(ఈవో(పీఆర్డీ), తాంసి), బి.రాజేశ్వర్(సీనియర్ అసిస్టెంట్, డీపీవో ఆదిలాబాద్), సీహెచ్.గోవింద్(బిల్ కలెక్టర్, జీపీ, క్యాతన్‌పల్లి), జె.మొండయ్య(ఆఫీస్ సబార్డినేట్, ఆసిఫాబాద్), జి.జక్కయ్య(కామటి, చెన్నూర్), ఎన్.కీర్తన(సర్పంచ్, కోరెగాం). ఐటీడీఏ(ఉట్నూర్)లో.. పి.భీము(ఏవో), దామోదరస్వామి(ఓఎం), శాంతరాజ్(సీనియర్ అసిస్టెంట్), రమాదేవి(అకౌంట్ మేనేజర్), వేణు(సీనియర్ అసిస్టెంట్(డీడీటీడబ్ల్యూ)), రాజ్‌కుమార్(సీనియర్ అసిస్టెంట్), శ్రీనివాస్‌స్వామి(డీఈఈ (టీడబ్ల్యూ)), మదన్‌గోపాల్(డెప్యూటీ తహశీల్దార్ ఓఎస్డీ(టీడబ్ల్యూ)), రామరాావు(ఏఈ(టీడబ్ల్యూ) దండేపల్లి), విష్ణు(డీఈ), పి.దైవప్రసాద్(ఏఈ (ఎస్ఎంఐ)), డి.నాగేశ్వర్రావ్( లీగల్ కో ఆర్డినేటర్ ఐకేపీ), హరికృష్ణ(జేడీఎం), కె.విజయకుమార్(అసిస్టెంట్ ఐకేపీ), కె.రాజలింగు(అసిస్టెంట్ ఐకేపీ), రమేశ్(ఏరియా కో ఆర్డినేటర్, కాసిపేట), గంగామణి(ఏపీఎం ఐకేపీ, ఇచ్చోడ), భూమక్క(పీఎం ఐకేపీ, కాసిపేట), జీవన్(ఏపీఎం ఐకేపీ), సుజాత(పీఎం(బ్యాంక్ లింకేజీ)), జి.మాధవి(పీఎం, జాడి దుర్గయ్య(పీఎం), కె.యశ్వనాథ్(అటెండర్), ఎం.రాజయ్య(డ్రైవర్ ), వైద్యులు టి.ప్రభాకర్‌రెడ్డి(డీఎం అండ్ హెచ్‌వో), కళ్యాణ్‌రెడ్డి(అసిస్టెంట్ సివిల్ సర్జన్, ఆదిలాబాద్), శ్రీనివాస్‌రెడ్డి(టీడబ్ల్యూవో, ఉట్నూర్), భోజరావు(ఏహెచ్ఎస్, వేమనపల్లి), అర్క మాణిక్‌రావు(ఎంఎల్ఈ కో ఆర్డినేటర్), సుభాష్‌బాబు(పీఎస్ హెచ్ఎం), మెస్రం మనోహర్(ప్రిన్సిపాల్ పీఈటీసీ, ఉట్నూర్), రాజేశ్(ఏఎంవో పీఎం ఆర్సీ), జగ్డేరావు(ఏపీవో(ఈజీఎస్)), పూర్ణిమ(పీవో ఈజీఎస్, కౌటాల), సంపత్‌కుమార్(ఏపీఆర్వో(పి)), ఉదయ్‌కుమార్(డీపీవో). పంచాయతీరాజ్ సర్కిల్లో.. జె.లక్ష్మీరాజయ్య(ఏఈ, ఆసిఫాబాద్), సయ్యద్ రఫతుల్లా(డెప్యూటీ ఈఈ, ఆసిఫాబాద్). రిమ్స్.. వైద్యుడు కళ్యాణ్‌రెడ్డి(రేడియాలజిస్ట్) ఆర్టీసీ.. ఎ.విలాస్‌రెడ్డి(అసిస్టెంట్ మేనేజర్, ఆదిలాబాద్), ఎల్.రమేశ్(డెప్యూటీ సూపరింటెండెంట్, ఆదిలాబాద్). ఆర్వీఎం.. కె.ప్రకాశ్(అసిస్టెంట్ ఏఎంవో(ట్రైబల్), ఆదిలాబాద్), బి.నికేశ్(కంప్యూటర్ ఆపరేటర్, ఆదిలాబాద్), ఎస్.నరేశ్(ఐఈఆర్టీ, ఆదిలాబాద్), ఈ.సంప్రీత్కుమార్(కంప్యూటర్ ఆపరేటర్, ఆదిలాబాద్). ఆర్‌డబ్ల్యూఎస్‌లో.. కె.రాజేంద్రకుమార్(డెప్యూటీ ఈఈ, ఆదిలాబాద్), ఎం.గోవర్ధన్(ఎం అండ్ ఈ స్పెషలిస్ట్, ఆదిలాబాద్), సుకుమార్(పంప్ మెకానిక్, నిర్మల్), సుధాకర్(పంప్ మెకానిక్, నిర్మల్), టి.అంజన్‌రావు(డెప్యూటీ ఈఈ, చెన్నూర్), కె.రాములు(డెప్యూటీ ఈఈ, బెల్లంపల్లి). సాంఘిక సంక్షేమ శాఖలో.. అంచసింగ్(హెచ్‌డబ్ల్యూవో గ్రేడ్-2, బజార్హత్నూర్), ఖుర్షీద్ జహాబేగం(హెచ్‌డబ్ల్యూవో గ్రేడ్-2 లక్సెట్టిపేట), గంగాదేవి(హెచ్‌డబ్ల్యూవో గ్రేడ్-2, ఆసిఫాబాద్), దేవుబాయి(కామాటి, ఆదిలాబాద్), రాజన్న(కుక్, వాంకిడి). స్టెప్‌లో.. పి.సుధ(సీనియర్ అసిస్టెంట్, ఆదిలాబాద్). విద్యుత్ శాఖలో.. ఎం.రవీందర్‌రెడ్డి(సీనియర్ అసిస్టెంట్, ఆదిలాబాద్), సీహెచ్.జీవన్‌రావు(హెడ్‌కానిస్టేబుల్, ఆదిలాబాద్), కె.తిరుపతిరెడ్డి(సబ్ ఇంజినీర్, ఆదిలాబాద్), ఎం.శంకర్(జేఎల్ఎం, ఆదిలాబాద్). ట్రాన్స్‌కోలో.. సీహెచ్.రంజిత్‌కుమార్(ఏఎంవీఐ, నిర్మల్) వీడబ్ల్యూ అండ్ సీడబ్ల్యూ.. పద్మశ్రీ(ఐసీడీఎస్ సూపర్వైజర్, లక్సెట్టిపేట), విజయలక్ష్మి(సీడీపీవో, ఖానాపూర్), అమ్రిన్ ఫర్హా(ఐసీడీఎస్ సూపర్వైజర్, ఆదిలాబాద్), శ్రీలత(ఐసీడీఎస్ సూపర్వైజర్, ఉట్నూర్). మున్సిపల్ మెప్మాలో.. ఎ.కృష్ణలాల్(మున్సిపల్ ఇంజినీర్, కాగజ్‌నగర్), ఎస్.అంజయ్య(రెవెన్యూ ఆఫీసర్, కాగజ్‌నగర్), ఎంఏ జలీల్(పట్టణ ప్రణాళిక అధికారి, మంచిర్యాల), గౌరీష్కుమార్(సీనియర్ అసిస్టెంట్, భైంసా). -
‘ఘన’తంత్రం
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : సమైక్యత, సమగ్రత పరిరక్షణకు, దేశ, జిల్లాభివృద్ధికి అందరూ సంఘటితంగా పునరంకితమవుదామని కలెక్టర్ అహ్మద్‌బాబు పేర్కొన్నారు. 65వ గణతంత్య్ర వేడుకలు ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా జరిగాయి. మొదట ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. వివిధశాఖల శకటాల ప్రదర్శన జరిగింది. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు కలెక్టర్ అహ్మద్‌బాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులకు రూ.1,138 కోట్ల రుణాలు జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పరచాలని, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని కలెక్టర్ బాబు పేర్కొన్నారు. జిల్లాలోని రైతులకు రూ.1,138 కోట్ల పంట రుణాలు అందించామన్నారు. రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన పథకం ద్వారా రూ.2.31 కోట్లతో 1,495 యూనిట్ల మేలుజాతి పాడిపశువుల పెంపకం లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ప్రథమంగా మన జిల్లాలోని అన్ని మార్కెట్‌యార్డుల్లో కంప్యూటరైజ్డ్ తక్‌పట్టీలను ఉపయోగించి తద్వారా రైతులకు వేగంగా చెల్లింపులు జరిగే చూశామన్నారు. రూ. 2.24 కోట్లతో విద్యుత్‌లేని గిరిజన గ్రామాలకు సౌర విద్యుత్ కల్పించడం జరుగుతుందన్నారు. అంతర్రాష్ట్ర రహదారికి రూ.59 కోట్లు ఆసిఫాబాద్ నుంచి ఉట్నూర్ వరకు అంతర్రాష్ట్ర రహదారిలో రూ. 59 కోట్లు రాష్ట్ర రహదారుల కోర్నెట్ నిధులతో రెండులేన్ల రహదారుల నిర్మాణానికి పనులు టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. రూ.72.61 కోట్లతో 6,170 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏఐబీపీ పథకం ద్వారా 27 పనులు గుర్తించి పరిపాలన ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఐటీడీఏ పరిధిలోని 12 మండలాల్లో సాగు విస్తీర్ణం పెంపుదల, జీవనోపాధి కల్పన, సమగ్రాభివృద్ధి, భూజలాల పెంపుదల కోసం రూ.115 కోట్లతో 16 సమగ్ర నీటిపరివాహక అభివృద్ధి పథకం మెగా ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం జిల్లాలో మాతా శిశు మరణాలు తగ్గించడానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జననీ సురక్ష పథకం ద్వారా జిల్లాలో 9,918 మంది పేర్లు నమోదు చేసి 7,366 మందికి ఆధార్ విధానంలో రూ.60.82 లక్షలు జమ చేయడం ద్వారా జిల్లా జాతీయస్థాయిలో రెండో స్థానంలో ఉందన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా జిల్లాశాఖ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో 190 రక్తదాన శిబిరాలు నిర్వహించి 5, 800 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందన్నారు. స్త్రీనిధి కింద 2,414 స్వయం సహాయక సంఘాల్లోని 9,678 మంది సభ్యులకు రూ.16 కోట్లు, వడ్డీలేని రుణాల కింద 25,504 స్వయం సహాయక సంఘాలకు రూ.1.86 కోట్లు విడుదల చేశాం. గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రూ.22.27 కోట్లతో 5,150 మందికి చేకూర్చాం. ‘ఉపాధి’లో రెండోస్థానం ఉపాధి పథకం ద్వారా జిల్లాలో 2.72 లక్షల కుటుంబాలకు పని కల్పించడం ద్వారా జిల్లా రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాను జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డుకు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మార్చి మాసం వరకు 219 ఆవాస ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గృహ నిర్మాణంలో అక్రమాలు జరగకుండా జీవో మ్యాపింగ్ విధానం ద్వారా పర్యవేక్షణ పెంచడంతో అసలైన లబ్ధిదారులకే ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ‘బంగారు తల్లి’ మూడోస్థానం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ద్వారా 2,831 మంది లబ్ధిదారులకు రూ.20.71 కోట్లు, స్వయం ఉపాధి రుణాలు బ్యాంక్ ప్రమేయం లేకుండా 800 మంది లబ్ధిదారులకు రూ.2.29 కోట్ల రుణాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై అందజేయనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా 2013-14 సంవత్సరానికి రూ.14.71 కోట్లతో 112 యూనిట్ల స్థాపనకు లబ్ధిదారులను ఎంపిక చేసి బ్యాంకులకు పంపించినట్లు తెలిపారు. బంగారుతల్లి పథకం అమలులో జిల్లా రాష్ట్రస్థాయిలో మూడోస్థానంలో నిలిచిందన్నారు. నాగోబాకు రూ.10 లక్షలు ఈనెల 30న ప్రారంభం కానున్న కేస్లాపూర్ నాగోబా జాతరకు రూ.10 లక్షల పర్యాటక శాఖ నిధులతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 26.20 లక్షల మందికి ఆధార్‌కార్డులు జారీ చేయడం ద్వారా 98 శాతం లక్ష్యం సాధించినట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 20,593 మరుగుదొడ్లు పూర్తిచేసి రాష్ట్రస్థాయిలో జిల్లా నాల్గోస్థానంలో నిలిచినట్లు తెలిపారు. 22,532 నిర్మాణ దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి నూతనంగా 2,03,624 మందికి ఓటు హక్కు నమోదు చేయడం ద్వారా జిల్లా రాష్ట్రస్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి గోపాలకృష్ణమూర్తి, ఎస్పీ గజరావు భూపాల్, ఐటీడీఏ పీవో జనార్ధన్ నివాస్, డీఆర్వో ఎస్ఎస్ రాజ్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు రోజ్‌లీలా, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మహేందర్, న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
టీచర్లకే చదువు రాకుంటే పిల్లలకేం చెబుతారు..
తాంసి(తలమడుగు), న్యూస్‌లైన్: బోధించే మీకే తెలియకపోతే విద్యార్థుల కు ఏం చదువు చెబుతారంటూ తాంసి మండ లం పొన్నారి గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాల ఉ పాధ్యాయుడు ఆశన్నపై కలెక్టర్ అహ్మద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రపంచ పటంలో బ్రెజిల్ ఎక్కడుందో చూపించం డి.. అంటూ పదో తరగతి విద్యార్థులను ప్రశ్నిం చగా సరైన సమాధానం రాలేదు. సాంఘిక శా స్త్రం బోధించే ఉపాధ్యాయుడు ఆశన్న కూడా చూపించలేదు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ టీచర్ల కే చదువు రాకుంటే పిల్లలకేం చెబుతారని అ న్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల పేర్లు చదువుతూ హాజరుపట్టికను పరిశీలించారు. పదో త రగతి గదిలోకి వెళ్లి సిలబస్ ఎక్కడి వరకు పూర్తయిందంటూ విద్యార్థులు, ఉపాధ్యాయులను అ డిగి తెలుసుకున్నారు. సాంఘికశాస్త్రం, గణితం సిలబస్ పూర్తికాలేదని చెప్పడంతో డిసెంబర్లో గా పూర్తి చేయాల్సి ఉండగా.. ఇప్పటికీ పూర్తికాకపోవడం ఉపాధ్యాయుల పనితీరుకు అద్దం ప డుతోందని అన్నారు. ఇంగ్లిషు, గణితం విద్యార్థులను పిలిచి బోర్డుపై లెక్కలు, ఇంగ్లిషు రా యించారు. వేసిన ప్రశ్నలకు ఏ ఒక్కరూ సరైన సమాధానం రాయకపోవడంతో ఇక్కడ పాఠశా ల నిర్వహించడం ఎందుకు, చదువు చెప్పే వారి వద్దకు విద్యార్థులను పంపిస్తే సరిపోతుందని, ఉపాధ్యాయులు ఉండడం ఎందుకు అంటూ అ సహనం వ్యక్తం చేశారు. గోడలపై వేసిన సైన్స్ చిత్రపటాలను విద్యార్థులతో చదివించారు. వా టి అర్థం ఏమిటని ప్రశ్నించగా ఒక్కరూ సరైన సమాధానం చెప్పలేదు. పదో తరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులకు చిన్న చిన్న కూడిక లు, ఇంగ్లిషు పదాలు కూడా రాకపోతే పబ్లిక్ ప రీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. కాపీయింగ్ జరుగుతుందని అనుకుంటున్నారేమో.. అలాం టిదేమీ ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా ఉత్తీర్ణత శాతం ఐదు శాతం వచ్చినా పరవాలేద ని, కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రధానోపాధ్యాయురాలు సు లోచనను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం ప రిశీలించి విద్యార్థులు, ఉపాధ్యాయులకు వేర్వేరుగా వండడంపై ప్రధానోపాధ్యాయురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లపప్పు, దొడ్డన్నం, రుచిలేని వంటలు చూసి నిర్వాహకులపైనా మండిపడ్డారు. విద్యార్థులకు నాణ్యమైన భోజ నం పెట్టని వారిని తొలగించాలని అన్నారు. -
ఈ నెల 19 నుంచి పల్స్ పోలియో
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఈనెల 19న జాతీయ పల్స్ పోలియో దినంగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అహ్మద్ బాబు తెలిపారు. గురువారం వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమావేశంలో పేర్కొన్నారు. 0 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. వంద శాతం చుక్కల మందు వేయాలన్నారు. ఈ నెల 21, 22 తేదీలలో ఇంటింటికి వెళ్లి పిల్లల వివరాలు సేకరించి చుక్కల మందులు వేయాలని అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు సూచించారు. ఇందుకోసం 5.40 లక్షల వ్యాక్సిన్లు జిల్లాకు అందాయని తెలిపారు. 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలు జిల్లాలో 3,62,523 ఉన్నారని అంచనా వేశామన్నారు. చక్కుల మందులకు సంబంధించిన గ్రామాల్లో పది రోజుల ముందుగానే బ్యానర్లు, పోస్టర్లు అతికించాలన్నారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి, వంద శాతం పోలియో చుక్కలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డీఎంహెచ్‌వో మేకల స్వామి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, అధికారులు ఉన్నారు. -
ఆర్వీఎం పీవోగా శ్రీనివాస్‌రెడ్డి
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) రెగ్యులర్ పీవోగా కరీంనగర్ జిల్లా పెద్దపెల్లి ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల కిందట కలెక్టర్ అహ్మద్‌బాబు ఆర్వీఎం పీవోగా విధులు నిర్వహిస్తున్న పెర్క యాదయ్యను తప్పించి వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ నారాయణకు బాధ్యతలు అప్పగించారు. పదిహేను నెలల్లో తొమ్మిది మంది పీవోలు మారగా, మళ్లీ సోమవారం రెగ్యులర్ పీవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదివరకు రెగ్యులర్ పీవోగా పనిచేసిన విశ్వనాథ్ బదిలీ అయిన తర్వాత పీవోలుగా పరిశ్రమల శాఖ మేనేజర్ రవీందర్, జెడ్పీ సీఈవో వెంకటయ్య, ఆర్డీవో రవినాయక్‌లు ఇన్చార్జి పీవోలుగా పనిచేశారు. ఆ తర్వాత మెప్మా పీడీ రాజేశ్వర్ రాథోడ్, సీపీవో షేక్ మీరాకు బాధ్యతలు అప్పగించినప్పటికీ వారు తిరస్కరించారు. ఆ తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ఏడీ పెర్క యాదయ్యను అప్పటి కలెక్టర్ అశోక్ నియమించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో కలెక్టర్ అహ్మద్‌బాబు యాదయ్యను తప్పించి నారాయణను నియమించారు. బాధ్యతలు అప్పగించి రెండు రోజులు గడవకముందే ప్రభుత్వం రెగ్యులర్ పీవోను నియమించింది. ఆర్వీఎం గాడిలో పడేనా? ఆర్వీఎంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పరిపాలన గాడి తప్పింది. ఇప్పటికైనా రెగ్యులర్ పీవోగా నియామకమైనా శ్రీనివాస్‌రెడ్డి గాడిలో పెట్టేనా అని పలువురు చర్చించుకుంటున్నారు. -
అంధుల సంక్షేమానికి కృషి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అంధుల సంక్షేమం కోసం కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ అహ్మద్‌బాబు తెలిపారు. చదువుకుంటున్న అంధ విద్యార్థులు ప్రతి ఒక్కరికీ స్కాలర్షిప్లు అందజేస్తామని పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లూరుు బ్రెయిలీ 205 జయంతి వేడుకలను నిర్వహించారు. విద్యార్థులతో కేక్ కట్ చేయించారు. ముందుగా కలెక్టర్ అంధ విద్యార్థినులతో లూయి బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అంధులతో భర్తీ చేయాల్సిన పోస్టులకు ఈ నెలలోనే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు లిపి ఏవిధంగా నేర్పుతున్నారు.. ఎంత మంది విద్యార్థులు చదువుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. అంధులకు 40 శాతం వైకల్యం ఉండి సదరం సర్టిఫికెట్ పొందితే రూ.500 పింఛన్, 20 నుంచి 40 శాతం వైకల్యం ఉన్న విద్యార్థులకు రూ.200 పింఛన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల్లో అంధులకు 3 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన అప్పలనాయుడు, శేఖర్‌ను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. ఎంఏ బీఈడీ చేసిన అనిల్‌కుమార్ అనే అంధ విద్యార్థికి ల్యాప్‌టాప్ అందజేశారు. సబ్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ నారాయణరావు, సీపీవో షేక్మీరా, సారంగపాణి, సంపత్‌ప్యాస్, అశోక్, విద్యార్థులు అమూల్య, శిరీష, సోని, అంజలి, రవళి, నిటేశ్, ఆదిత్య, శాంతారాం, మహేశ్, సాయిప్రణీత్ పాల్గొన్నారు. -
ఇక ఈ-గ్రీవెన్స్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజా సమస్యల పరిష్కారం.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన నిరుపేదలకు అందేవిధంగా కలెక్టర్ అహ్మద్‌బాబు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో తీసుకునే అర్జీలకు పరిష్కారం చూపడానికి మార్పులు తీసుకొచ్చారు. ఆరు నెలలు శ్రమించి గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(జీఎంఎస్)ను రూపొందించారు. ఈ పద్ధతిని జనవరి 1 నుంచి అంటే బుధవారం నుంచి అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా కలెక్టరేట్లో శాఖలవారీగా 12 కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించనున్నారు. ఈ ఫిర్యాదులను వెబ్సైట్లో పొందుపరుస్తారు. 30 రోజుల్లో సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. మండల స్థాయిలోనూ ఇదే విధమైన సిస్టమ్‌ను అమలు చేయనున్నారు. ఇంతకాలం పరిష్కారానికి నోచుకోని ప్రజావాణి దరఖాస్తులు ఇప్పుడు వెబ్‌సైట్‌తో పరిష్కారమవుతాయని కలెక్టర్ భావిస్తున్నారు. నూతన విధానం ఇలా.. జీఎంఎస్‌పై కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించారు. అర్జీదారు నేరుగా కలెక్టరేట్‌లోగాని, మండల కేంద్రంలోగాని వివరాలు నమోదు చేసుకోవాలి. పేరు, చిరునామా, ఏ సమస్య, రేషన్ కార్డు, ఆధార్ నంబరు, ఫోన్ నంబర్‌ను తప్పని సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సమస్యలకు రేషన్, ఆధార్, ఇతర వాటిని స్కాన్‌చేసి అప్లోడ్ చేస్తారు. ఈ వివరాలను కంప్యూటర్లో నమోదు చేస్తారు. నమోదు చేసినవెంటనే సంబంధిత అధికారికి, అర్జీదారునికి ఫోన్ ద్వారా సమాచారం వెళ్తుంది. దీని కోసం ఒక ఎస్ఎంఎస్కు 13 పైసల చొప్పున(వెయ్యి ఎస్ఎంఎస్లకు రూ.130) ఖర్చు చేస్తున్నారు. చెప్పిన వివరాలు దరఖాస్తు రూపంలో వచ్చే కాపీని అర్జీదారుడికి అందజేస్తారు. సరైన సమయంలో సంబంధిత అధికారి సమస్యను పరిష్కరించని యెడల, ఆర్డీవోకు, ఆయన స్పందించకపోతే జేసీకి, జేసీ స్పందించకపోతే కలెక్టర్ వద్దకు సమస్య వెళ్లే విధంగా రూపొందించారు. ఈ పద్ధతిని కలెక్టర్ మానిటరింగ్ చేస్తున్నారు. అమలుకు ఆటంకాలు గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(జీఎంఎస్)ను బుధవారం నుంచి అమలుకానుంది. మొదటగా కలెక్టరేట్, ఐటీడీఏ, సబ్ కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాలవారీగా అమలు చేయాలని అధికారులు భావించారు. అనంతరం మున్సిపల్, మండలాల్లో అమలు చేయనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖలు, సెక్షన్లవారీగా వివరాలు, సబ్జెక్టు, సబ్‌సబ్జెక్టు, కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు పేరు, హోదా, సెల్ నంబరు కంప్యూటర్లో పొందుపర్చాలి. ఆయా శాఖల అధికారులు ఈ వివరాలను జీఎంఎస్‌లో అప్లోడ్ చేసే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ వివరాలను కంప్యూటర్లో అప్లోడ్ చేస్తేనే సమస్య పరిష్కరించే సదరు అధికారికి గ్రీవెన్స్‌కు వచ్చిన సమస్య సమాచారం వెళ్తుంది. ప్రధానంగా సుమరు 85 ప్రభుత్వ శాఖల వివరాలను నమోదు చేయల్సి ఉంది. ప్రస్తుతం మాస్టర్ ఎంట్రీ, సీట్ ఎంట్రీ, ఎంప్లాయి డాటా, సెక్షన్ల వారీగా సబ్జెక్టు వివరాలు కంప్యూటర్లో పొందుపరుస్తున్నారు. -
ప్రణాళిక లేకనే నిధులు వృథా
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సరైన ప్రణాళికలు లేకనే పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల నిధులు వృథా అయ్యాయని కలెక్టర్ అహ్మద్ బాబు పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో, నాన్ ఏజెన్సీ ప్రాంతా ల్లో కొనసాగుతున్న పంచాయతీ భవనాల నిర్మాణాలపై కలెక్టర్ అసంతృ ప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయ తీ రాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజినీర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పనులకు కేటాయించిన సుమారు 354 కోట్ల రూపాయలు వృథా అవుతున్నాయని పేర్కొన్నారు. సీసీరోడ్లు, మురికికాలువలు, లింకురోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. ప్రజలకు అ వసరం లేని విధంగా నిర్మాణాలు చేపట్టి నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చోడ అసిస్టెంట్ ఇంజినీర్ల పనులు సరిగ్గా లేనందున వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని పంచాయతీ రాజ్ శాఖ ఎస్ఈ ఉమామహేశ్వర్‌రావును ఆదేశించారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులతో పనులు పరిశీలించకుండా డబ్బులు చెల్లించిన మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ల డీఈలకు మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. జీపీ భవన ని ర్మాణాలు పూర్తి కాకుండానే డబ్బులు చెల్లించారని, ఇంజినీర్లు బాధ్యతగా పనులు చేయడం లేదన్నారు. ఈ పనులపై విచారించి తనకు తెలపాలని ఎస్ఈపీఆర్ను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో 82 జీపీ భవనాలు ని ర్మించాల్సి ఉండగా, 38 పూర్తి చేశారని, మిగతా ఎందుకు పూర్తి కాలేదని ఈఈ శంకర్రావును ప్రశ్నించారు. సమాఖ్య భవనాలను త్వరితగతిన ని ర్మించాలన్నారు. ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇంద్రసేన్, అధికారులు పాల్గొన్నారు. -
మంత్రి లేకుండానే...
ఉట్నూర్, న్యూస్‌లైన్ : జిల్లా ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్య ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయాల్సి ఉండగా అదేం చేయకుండా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయన స్థానంలో అధికారులు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఈ తతంగాన్ని పూర్తి చేశారు. ఇదీ సంగతి మంత్రి బస్వరాజు సారయ్య శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు జిల్లాలో అధికారికంగా పర్యటన చేపట్టేందుకు శనివారం జిల్లాకు వచ్చారు. తన పర్యటనలో మొదటి రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాత్రి ఉట్నూర్‌లో బస చేశారు. ఆదివారం ఆయన ఉట్నూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా శనివారం రాత్రే ఉట్నూర్ నుంచి వెళ్లిపోవడంతో సంబంధిత పనులుకు అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేయాల్సి వచ్చింది. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జునియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ అహ్మద్‌బాబు, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఎంపీ రాథోడ్మ్రేశ్, స్థానిక ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ హాజరయ్యారు. రూ.4 కోట్ల 60 లక్షల 95 వేల విలువ గల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పథకాలందేలా చర్యలు కలెక్టర్ అహ్మద్‌బాబు మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ఏజెన్సీ గ్రామాల ప్రజలకు అందేలా తగు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏజెన్సీలో గిరిజన బాలికల కోసం ఉట్నూర్‌లో మూడు రూ.కోట్లతో సమీకృత వసతి గృహ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లోని పలు గిరిజన గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు రూ.80.95 లక్షలు, ఉట్నూర్‌లో వివిధ పనులకు రూ.33.75 లక్షలు, జూనియర్ కళాశాలకు రూ.46.25 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు వివరించారు. గిరిజన గ్రామాలకు సురక్షిత నీరు అందించేందుకు కొమురం భీమ్ ప్రాజెక్టు వద్ద చేపట్టిన మొదటి దశ పనులు జనవరిలోగా పూర్తి చేసి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2012-13 ఏజెన్సీ డీఎస్సీ రాసిన గిరిజన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు అందించేందుకు ఇప్పటికి ఆరుసార్లు అవకాశం కల్పించామని, అయినా అభ్యర్థులు వారి ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు అందజేయలేదని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను నియమించాలి అనంతరం ఎంపీ రాథోడ్ రమేశ్, ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం కోట్లాది రూపాయలతో మౌళిక వసతులు కల్పిస్తున్నా నాణ్యమైన బోధన అందించేందుకు ఉపాధ్యాయుల కొరత ఉందని అన్నారు. ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయాల్సిన మంత్రి చేయకుండానే వెళ్లిపోవడం సరికాదని అన్నారు. మంత్రి ఏజెన్సీ గిరిజన సమస్యలపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆర్డీవో రాంచంద్రయ్య, ఈఈటీడబ్ల్యూ శంకరయ్య, తహశీల్దార్ చిత్రు, ఇన్చార్జి ఎంపీడీవో రమాకాంత్‌రావు, ఉట్నూర్, లక్కారం, వాడ్గాం సర్పంచులు బొంత ఆశారెడ్డి, మర్సకోల తిరుపతి, గాంధారి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, నియోజకవర్గ ఇన్చార్జి హరినాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ హైమద్, టీడీపీ మండల అధ్యక్షుడు సాడిగె రాజేశ్వర్, నాయకులు తుకారం, చంద్రయ్య, రవి, పూజారి శివాజీ పాల్గొన్నారు. -
పత్తి అమ్ముకోవడానికి రైతుల అవస్థలు
ఉదయం నుంచి రాత్రి వరకు అదేతీరు.. భైంసా మార్కెట్లో ప్రారంభంకాని కొనుగోళ్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కలెక్టర్ వద్దకు వెళ్లిన వ్యాపారులు, ప్రజాప్రతినిధులు భైంసా/భైంసా రూరల్, న్యూస్‌లైన్ : ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నా రు. భైంసా మార్కెట్‌కు ఉదయం తీసుకొచ్చిన పత్తిని రాత్రి వరకు కూడా వ్యాపారులు, అధికారులు కొనుగోలు చేయకపోవడంతో ఆందోళన చేశారు. అయినా కొనుగోళ్లు జరగలేదు. బహిరంగ వేలం పాటలో.. భైంసా పట్టణంలో బుధవారం నుంచి అధికారికంగా బహిరంగ వేలం పాట ద్వారా పత్తి కొ నుగోళ్లు జరుగుతాయని అధికారులు ప్రకటిం చారు. ఇప్పటికే కలెక్టర్ అహ్మద్ బాబు వేలం పాటలు నిర్వహించే యార్డుల్లోనే పత్తి తూకం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకేంద్రంలో అదే విధంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటలకే కాటన్ యార్డుకు వచ్చిన జిన్నింగ్ ఫ్యాక్టరీ యజమానులు బహిరంగ వేలం పాటల్లో పాల్గొనక ముందే యార్డుల్లో తూకం వేస్తే అందరికీ ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొనడంతో రైతులకు, వ్యాపారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొనుగోళ్లు చేయమని వ్యాపారులు ఉదయం 11.13 గంటలకు యార్డు నుంచి నిష్ర్కమించారు. 11.23 గంటలకు అధికారులు కూడా వెనక్కి వెళ్లారు. దీంతో యార్డుకు వచ్చిన రైతులు ఏఎంసీ చైర్మన్ విఠల్‌రెడ్డిని కలిసి కార్యాలయానికి వెళ్లారు. రోడ్డుపై బైఠాయింపు కార్యాలయంలో చర్చించినా ఫలితం కనిపించక పోవడంతో అందరూ భైంసా బస్టాండ్ వద్దకు చేరుకుని మధ్యాహ్నం 12.32 గంటలకు ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. రైతులతోపాటే విఠల్‌రెడ్డి, రైతు నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మధ్యాహ్నం 1.03 గంటలకు పట్టణ సీఐ పురుషోత్తం విఠల్‌రెడ్డితోపాటు రాస్తారోకోలో బైఠాయించిన వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఆర్డీవో రాకతో.. ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ ఆర్డీవో అరుణశ్రీ మధ్యాహ్నం 3.26 గంటలకు ఏఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. మార్కెటింగ్ ఏడీఎం అజ్మీరరాజు, ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌రెడ్డి సమస్యకు మార్గం చూపేందుకు పత్తి వ్యాపారులను, రైతులను, రైతు నాయకులను పిలిపించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 7.30 గంటల వరకు పలు దఫాలుగా చర్చలు జరిగినా సఫలం కాలేదు. సాయంత్రం 5.10 గంటలకు కలెక్టర్‌తో మాట్లాడేందుకు ఫోన్ చేసినా వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండడంతో ఆయన మాట్లాడలేక పోయారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అనంతరం కలెక్టర్‌తో రాత్రి 7 గంటలకు మరో మారు ఫోన్లో సంభాషించారు. పరిస్థితి వివరించడంతో ఆదిలాబాద్‌కు రావాలని కలెక్టర్ సూచించారు. దీంతో పత్తి వ్యాపారులు, అధికారులు, ఎమ్మెల్యే చారి, చైర్మన్ విఠల్‌రెడ్డిలు 7.30 గంటలకు ఆదిలాబాద్ బయలుదేరి వెళ్లారు. తప్పని నిరీక్షణ మొదటి రోజు పత్తి బండ్లతో వచ్చిన రైతులకు నిరీక్షణ తప్పలేదు. దశలవారీగా చర్చలు జరిగినా సఫలీకృతం కాకపోవడంతో బండ్లను రోడ్డుపైనే పెట్టారు. పత్తి బండ్లతో వచ్చిన 400లకుపైగా రైతులు ఆకలితో అలమటించాల్సి వచ్చింది. ఆటోవాలాలు రైతులతో వాగ్వాదానికి దిగి తాము చేసుకున్న అద్దె ఒప్పందాన్ని రెండు రోజులకు పొడిగించుకున్నారు. దీంతో రైతులు కొనుగోళ్లు త్వరితగతిన చేపట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానంతో రైతులే నష్టపోవాల్సి వస్తుందని వ్యాపారులతో చర్చించకుండానే కొనుగోళ్లు ప్రారంభమవుతాయని యార్డుకు పిలిపించడం ఎంత వరకు సమంజసం అంటూ అధికారులను నిలదీశారు. చేసేదేమి లేక రైతులు బండ్లపైనే నిద్రించారు. రాత్రి వరకు వాగ్వాదాలే... రైతులకు, అధికారులకు, రైతు నాయకులకు, కమీషన్ ఏజెంట్లకు, పత్తి వ్యాపారులకు, అధికారులకు మధ్య ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు వాగ్వాదాలు కొనసాగుతూనే కనిపించాయి. యార్డుల్లో కొనుగోలు చేసినా తూకం ఫ్యాక్టరీల్లోనే వేస్తామని వ్యాపారులు తేల్చి చెప్పారు. యార్డుల్లో తూకం వేస్తే ఫ్యాక్టరీకి వచ్చే వరకు ఎవరు బాధ్యులుగా ఉంటారని సీజన్ పెరిగితే బండ్లు ఎక్కువగా వస్తే తూకం వేయడం సాధ్యం కాదని పత్తి వ్యాపారులు తమ వాదన వినిపించారు. అధికారులు ఇచ్చిన ఆదేశాలు ఆదిలాబాద్‌లో పాటిస్తున్న వ్యాపారులకు భైంసాలో పాటించడం ఎందుకు సాధ్యం కాదని రైతులు ప్రశ్నించారు. రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా అవి అమలు కావడం లేదంటూ రైతు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు చెప్పినా ఎన్ని చర్చలు జరిపినా చివరకు కొనుగోళ్లు మాత్రం జరగలేదు. ఎంతో ఆశతో పంట అమ్మకానికి వచ్చిన పత్తి రైతులకు రెండు రోజుల నిరీక్షణ తప్పలేదు. -
అడ్డదారి
భైంసా, న్యూస్‌లైన్ : మన రాష్ట్రానికి చెందిన తెల్ల బంగారాన్ని కొంత మంది వ్యాపారులు, దళారులు గుజరాత్, మహారాష్ట్రకు అక్రమ మార్గాల్లో తరలిస్తున్నారు. రోజూ వందల సంఖ్యలో లారీల్లో తీసుకెళ్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ప్రాంతాల్లో పత్తి కొనుగోలు చేసి.. ఆ పత్తిని యథేచ్ఛగా అక్రమంగా ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. దీంతో మన ప్రభుత్వానికి రావాల్సిన ఐదు శాతం వ్యాట్, ఒక శాతం సెస్ కోల్పోవాల్సి వస్తోంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన మధ్య దళారులు, వ్యాపారులు కుమ్మక్కై ఈ దందాను కొనసాగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆరంభమైన పత్తి సీజన్లో వీరి దూకుడును అడ్డుకోకపోతే రోజూ కోట్ల రూపాయల పన్నులను ప్రభుత్వం నష్టపోవాల్సి వస్తుంది. కలెక్టర్ ఆదేశాలతో... ఆదిలాబాద్ కలెక్టర్ అహ్మద్‌బాబు పత్తి కొనుగోళ్లను ప్రతిష్టాత్మకంగాా తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు యార్డులకు, రోడ్లపై కనిపించే వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల 29 రాత్రి కుభీర్ మండలం మాలేగాం మార్గం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న ఆరు పత్తి లారీలను ఎస్సై తోట సంజీవ్ పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గత నెల 31న తానూరు మండల బెల్తరోడ గ్రామం వద్ద రెండు సోయా లారీలతోపాటు ఒక పత్తి లారీని ఎస్సై మసూద్ పట్టుకున్నారు. భైంసా పట్టణ సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు దాటి 61వ జాతీయ రహదారి నుంచి నేరుగా మహారాష్ట్రకు వెళ్తున్నాయంటే అధికారుల పనితీరు స్పష్టమవుతోంది. జాతీయ రహదారిపైనే అనుమతులు లేకుండా పత్తి లారీలు వెళ్తున్నాయంటే అక్రమ వ్యాపారం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ముథోల్ నియోజకవర్గంలో పోలీసులు పత్తి లారీలను పట్టుకోవడంతో తేరుకున్న చెక్‌పోస్టు అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. దీంతో రోజూ వందకుపైగా లారీలు చెక్‌పోస్టుపై కనిపిస్తున్నాయి. కలెక్టర్ పకడ్బందీ ఆదేశాలు అమలు చేసే కోణంలో కొంత మేర తేరుకున్న అధికారులు పత్తి లారీలపై పన్నులు వసూలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అడ్డదారుల్లో మాత్రం నిత్యం లారీలు తరలుతూనే ఉన్నాయి. వాటిపైనా దృష్టి సారిస్తే మంచిదేమో. జీరోలో కొనుగోళ్లు... రైతుల వద్ద మధ్య దళారులు, వ్యాపారులు జీరోలో కొనుగోళ్లు చేసి అధికారులను మచ్చిక చేసుకుని పన్నులు చెల్లించకుండానే మహారాష్ట్రకు పత్తి లారీలను తరలిస్తున్నారు. మొన్నటి వరకు చక్కెర, బియ్యం, నిన్నటి వరకు సోయాతో అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ అధికారులు పాత ధోరణినే ఎంచుకున్నారు. పత్తిని అక్రమ మార్గంలోనే పక్కరాష్ట్రానికి చేరవేసి వ్యాపారులు మధ్య దళారులకు సహకరించి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఆలోచనవైపే మొగ్గు చూపుతున్నారు. గతేడాది సోయా కొనుగోళ్ల ఆధారంగా తీసుకుంటే జీరోలో పంటలను దళారులు పక్క రాష్ట్రాల్లోకి ఎలా తరలిస్తున్నారో స్పష్టం అవుతుంది. గతేడాది జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో సోయా సాగైంది. అప్పటి ధరతో సుమారుగా రూ.2 కోట్లకుపైగా మార్కెట్ సెస్ రూపేనా ప్రభుత్వానికి రావాల్సి ఉండగా.. కేవలం రూ. 17.74 లక్షలే వచ్చింది. వందల లారీల్లో... ఒక్కో లారీలో 150 క్వింటాళ్ల మేర పత్తి రవాణా చేయొచ్చు. క్వింటాలు ధర రూ. 4,500 వేసుకున్నా మొత్తం విలువ రూ.6.75 లక్షలు. ఐదు శాతం వ్యాట్ కింద రూ.33,750, ఒక శాతం సెస్ కింద రూ.6,750. మొత్తంగా రూ. 40,500 ఒక్కో లారీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలి. కానీ.. ఇవేమీ చెల్లించకుండా సరిహద్దులు దాటిస్తునానరు. పంట పండించిన రైతులకు మినహాయింపు ఉన్నా వ్యాపారులకు మాత్రం అది వర్తించదు. ఒక రైతు ఒకేసారి 150 క్వింటాళ్ల పత్తిని మార్కెట్‌కు తీసుకురావడం అసాధ్యం. మధ్య దళారులు రైతుల పేరు చెప్పి ప్రభుత్వానికి బురిడీ కొట్టిస్తున్నారు. భైంసా చెక్‌పోస్టు నుంచి కలెక్టర్ ఆదేశాల అనంతరం పత్రాల అనుమతితో 50 నుంచి 60 లారీలు వెళ్తున్నాయి. కాని అక్రమ మార్గంలో రోజూ వందల సంఖ్యలో లారీలు ఎలాంటి పత్రాలు లేకుండానే తరులుతున్నాయి. అధికారులు కూడా ఏమీ పట్టించుకోవడంలేదు. ఇష్టారాజ్యంగా.. ఒక రాష్ట్ర సరిహద్దు దాటి సరుకు రవాణా చేయాలంటే నిబంధనల మేరకు పన్నులు చెల్లించాలి. అన్ని పత్రాలు ఉన్న వారు నేరుగా చెక్‌పోస్టు నుంచి వెళ్లవచ్చు. కానీ.. కొంత మంది దళారులు అక్రమ మార్గాల గుండా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. మన రాష్ట్రంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసిన వ్యాపారులు, మధ్య దళారులు ఈ అక్రమ రాజమార్గాలను ఎంచుకుంటున్నారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి భైంసా, బాసర మార్గాల్లో మహారాష్ట్రకు చేరుకుంటున్నారు. బాసర వద్ద అటవీ శాఖ చెక్‌పోస్టు ఉండడంతో అక్కడి నుంచి బిద్రెల్లి మీదుగా మహారాష్ట్రకు వెళ్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్, నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లు మహారాష్ట్రకు సరిహద్దు కావడంతో ఈ ప్రాంతాల నుంచే ఎక్కువ లారీలు తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూరా, ఆదిలాబాద్ జిల్లా భైంసా వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఉన్నా వీటిని తప్పించేస్తున్నారు. చెక్‌పోస్టు లేని మార్గాల గుండా లారీలు పంపించేస్తున్నారు. తానూరు మండలం హిప్నెల్లి, కుభీర్ మండలం పల్సి, కుంటాల మండలం అంబుగాం ప్రాంతాల నుంచి మహారాష్ట్రకు చేరుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లోని ఖండ్గాం నుంచి మహారాష్ట్రలోని కొండల్వాడికి చేరుకోవచ్చు. అదే జిల్లాలోని కందకుర్తి నుంచి దర్మాబాద్ చేరుకోవచ్చు. మద్నూర్ నుంచి దెగ్లూర్‌కు, బాన్సువాడ ప్రాంతంలోని పొతంగల్ నుంచి మంజీర వంతెన మీదుగా మహారాష్ట్రకు చేరుకోవచ్చు. ఈ అక్రమ మార్గాల్లో రోజు 500లకుపైగా పత్తి లారీలు వెళ్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన మన ప్రభుత్వం రోజుకు రూ. 4 కోట్ల మేర నష్టం చవిచూడాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు తేరుకుని రైతుల ముసుగులో మధ్య దళారులు, వ్యాపారులు సాగించే జీరో దందాను అక్రమమార్గాల్లో తరలించే లారీలను అదుపు చేయాలని పలువురు కోరుతున్నారు. -
వేడుకలు వెలవెల
సాక్షి, నెట్వర్క్: తెలంగాణలో శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకలకు నిరసన సెగ తగలింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు దూరంగా ఉండటంతో సభా ప్రాంగణాలు వెలవెలబోయాయి. అయితే టీఆర్ఎస్ అవతరణదినాన్ని ‘బ్లాక్ డే’గా ప్రకటించగా.. ఉద్యోగుల జేఏసీ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపింది. టీఆర్ఎస్, టీజేఏసీ, టీఎస్‌జేఏసీ, టీఎన్జీవోస్, తెలంగాణ జాగృతి సంస్థలతోపాటు తెలంగాణ ఉద్యమ సంస్థల ఆధ్వర్యంలో విద్రోహదినంగా పాటిస్తూ నల్లజెండాలు ఎగురవేశారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. తెలంగాణవాదులు పలుచోట్ల పలు ప్రభుత్వ కార్యాలయాలపై నల్లజెండాలను ఎగురవేశారు. అన్ని జిల్లాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లో కలెక్టర్ అహ్మద్ బాబు, జేసీ సుజాత శర్మ, ఎస్పీ భూపాల్ వేడుకల్లో పాల్గొనగా, పరేడ్ గ్రౌండ్లో జనం లేకున్నా కలెక్టర్ ప్రసంగించారు. నిజామాబాద్‌లో టీఎన్జీవోస్ భవన్ ఎదుట ఉద్యోగ జేఏసీ నాయకులు, జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు నల్ల జెండాలను ఆవిష్కరించారు. ఆర్మూర్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, నాగిరెడ్డిపేటలో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి నల్లజెండాలను ఎగుర వేశారు. జిల్లా కేంద్రంలో అవతరణ వేడుకల్లో జనాలు లేక గ్యాలరీలు బోసిపోగా కలెక్టర్ ప్రద్యుమ్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరీంనగర్లోనూ ఇదే పరిస్థితి. ఇన్చార్జి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తూతూమంత్రంగా కార్యక్రమాన్ని ముగించారు. వరంగల్‌లో కలెక్టర్ కిషన్ కలెక్టరేట్లో జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవానికి వెళ్తుండగా విద్యార్థులు ఆయన వాహనానికి అడ్డుగా వెళ్లారు. హన్మకొండ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 300 మీటర్ల భారీ నల్లజెండాతో మానవహారం ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా న్యాయవాదులు, ఉద్యోగులు నల్లజెండా ఆవిష్కరించి అవతరణ దినోత్సవాలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. భూపాలపల్లి సింగరేణిలో బొగ్గుబావుల వద్ద టీ బిజీకేఎస్ ఆధ్వర్యంలో నల్లజెండాలు ఆవిష్కరించి నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నల్లజెండాలు ఎగురవేశారు. రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నల్లజెండా ఎగురవేయగా, తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ లోనికి చోచ్చుకుపోయేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకోగా తోపులాట జరిగింది. పీఆర్ ఉద్యోగులు భోజన సమయంలో జెడ్పీలో నిరసన తెలిపారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నివాసంలో జాతీయ, తెలంగాణ జెండాలను ఎగరవేశారు. మహబూబ్‌నగర్‌లో టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరోసభ్యుడు జితేందర్‌రెడ్డి నల్ల పావురాన్ని ఎగురవేసి నిరసన తెలిపారు. జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో నల్లజెండాను ఎగురవేశారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా తాండూరు, మేడ్చల్, వికారాబాద్‌లో తెలంగాణవాదులు ర్యాలీలు జరిపి, నల్ల జెండాలతో నిరసన తెలిపారు. జిల్లాలో అధికారులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. -
‘మరుగుదొడ్ల’ పై విచారణకు ఆదేశం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల(ఐఎస్ఎల్) నిర్మాణం పేరిట రూ.17.60 కోట్లు పక్కదారి పట్టిన వైనంపై ఉన్నతస్థాయి విచారణ జరగనుంది. ఈ బాగోతంలో కమీషన్ల రూపంలో రూ.కోటికి పైగా చేతులు మారాయన్న ఆరోపణలపై వాస్తవాలు త్వరలోనే వెలుగుచూసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ అహ్మద్ బాబు విచారణ కమిటీని వేశారు. నిర్మల్ భారత్ అభియాన్(ఎన్బీఏ) కింద చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్న వ్యవహారంపై కూపీ లాగనున్నారు. నిర్మాణం చేపట్టకుండానే సుమారు లక్ష మరుగుదొడ్లకు ముందస్తుగా టూల్‌కిట్స్ కొనుగోలు పేరిట రూ.17.60 కోట్లు తగలేయడం రచ్చ రచ్చగా మారింది. ఈ బాగోతంపై ప్రభుత్వానికి ఇదివరకే నివేదికలు పంపిన కలెక్టర్ ‘ధనలక్ష్మికి దాసోహం’, ‘ధనలక్ష్మిపై చర్యలేవి?’ తదితర శీర్షికలతో ‘సాక్షి’లో వెలువడిన కథనాలపై స్పందించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఐఎస్ఎల్ టూల్‌కిట్స్ కొనుగోలు బాగోతంపై విచారణ జరిపేందుకు ఏజేసీ వెంకటయ్య నేతృత్వంలో కమిటీ వేశారు. వెంకటయ్య చైర్మన్‌గా, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇంద్రసేన్ కో-కన్వీనర్‌గా, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ ఎస్ఈలు ఉమామహేశ్వర్‌రెడ్డి, హంసారెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఎవరి మెడకు చుట్టుకుంటుందో? టూల్‌కిట్స్ బాగోతంపై కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా స్పందించిన ఓ రాష్ట్రసాయి అధికారి అవకతవకలపై విచారణ జరుపుతూనే మరుగుదొడ్ల నిర్మాణంలో అట్టడుగు స్థానంలో ఉన్న జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం సూచించిన ధరకు టూల్‌కిట్స్‌ను సరఫరా చేసిన ధనలక్షి ఏజెన్సీ నాణ్యతను తుంగలో తొక్కిందన్న ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ ఏజేసీ వెంకటయ్య చైర్మన్‌గా కమిటీ వేశారు. దీంతో ఐఎస్ఎల్ టూల్‌కిట్స్ వ్యవహారం ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శుల మెడకు చుట్టుకునే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే టూల్‌కిట్స్ నేరుగా లబ్ధిదారుడి ద్వారా కొనుగోలు చేయించాలని నిబంధనలున్నా, అప్పుడున్న ఉన్నతాధికారులు ‘ధనలక్ష్మి’కి దాసోహం అన్నారు. ఈ మేరకు ఆ సంస్థ ద్వారా టూల్‌కిట్స్ సరఫరా చేసేందుకు ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవోల ద్వారా రూ.17.60 చెల్లింపులు చేశారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఉన్నతాధికారులు ప్రస్తుతం జిల్లాలో విధులు నిర్వహించడం లేదు. ఇప్పుడున్న ఉన్నతాధికారులు బాధ్యులపై ఉదాసీనంగా వ్యవహరించే అవకాశం లేదు. దీంతో ఆ ముగ్గురు అధికారుల ఒత్తిళ్ల మేరకు రూ.17.60 కోట్లు చెల్లించిన ఎంపీడీవోలు మాత్రమే బాధ్యులుగా చూసే అవకాశం ఉంది. ప్రభుత్వం సూచించిన ధర మేరకు టూల్‌కిట్స్ సరఫరా చేశారని, అయితే ఆ టూల్కిట్స్లో నాణ్యత ఉందా? లేదా? చూసుకోవాల్సిన బాధ్యత ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులదే కదా! అన్న వాదనను తెరపైకి తెస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. ఏదేమైనా టూల్‌కిట్స్ కొనుగోలులో అవకతవకలు కళ్లకు కనబడుతున్నా, చివరకు ఈ బాగోతం ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
మార్కెట్లు సిద్ధం
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలోని 17 మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సీసీఐతోపాటు వ్యాపారులు పత్తిని కొనుగోలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.3,700 నుంచి రూ.4 వేలు నిర్ణయించింది. ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో మద్దతు ధర కంటే పత్తి ధర అధికంగా పలుకుతోంది. ఈ నేపథ్యంలో సీసీఐ కూడా వ్యాపారులతో కలిసి వాణిజ్య కొనుగోలుకు ముందుకు వస్తుండటం గమనార్హం. మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోలుకు ఎలక్ట్రానిక్ కాంటాలు, వేబ్రిడ్జిలు సర్వం సిద్ధం చేశారు. సదుపాయాల కల్పనపై కలెక్టర్ అహ్మద్‌బాబు ప్రత్యేక దృష్టి సారించారు. 50 లక్షల క్వింటాళ్లకు పైబడే.. జిల్లాలో 3.10 లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో పత్తి దిగుబడిపై రైతుల ఆశలు సన్నగిల్లాయి. ఎకరానికి రెండు,మూడు క్వింటాళ్లు దిగుబడి తగ్గే అవకాశం ఉండడంతో రైతులు కనీస మద్దతు ధరపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సీజన్లో 50 లక్షల క్వింటాళ్ల పైబడి పత్తి కొనుగోలు జరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖాధికారులు పేర్కొంటున్నారు. గతేడాది జిల్లాలో 64.58 లక్షల క్వింటాళ్ల పత్తి క్రయవిక్రయాలు జరిగాయి. ప్రైవేట్ వ్యాపారులు 30.80 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయగా, సీసీఐ 21.49 లక్షల క్వింటాళ్లు, నాఫెడ్ 12.28 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయడం జరిగింది. ఈసారి సీసీఐ రంగంలో ఉంటుండగా నాఫెడ్ కొనుగోలుకు సిద్ధం కాలేదు. ఆదిలాబాద్, భైంసా, బోథ్, ఆసిఫాబాద్, నిర్మల్, ఇంద్రవెల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్, ఖానాపూర్, చెన్నూర్, జైనూర్, ఇచ్చోడ, సారంగాపూర్, జైనథ్, లక్సెట్టిపేట, కుభీర్, బెల్లంపల్లి మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు జరగనున్నాయి. సీసీఐ కొనుగోలు చేయకపోతే వ్యాపారులు మద్దతు ధర తగ్గించి రైతుల నడ్డీ విరిచేవారని రైతులు పేర్కొంటున్నారు. జీరో దందా జరగకుండా చర్యలు.. మార్కెట్ యార్డుల్లో తూకం జరగకుండానే నేరుగా పత్తి ప్రైవేట్ జిన్నింగ్లకు చేరుకునేది. తద్వారా మార్కెట్ యార్డులకు ఆదాయానికి గండి పడేది. వ్యాపారులు నేరుగా పత్తి కొనుగోలు చేయడం ద్వారా జీరో దందాకు పాల్పడేవారు. దీన్ని అరికట్టేందుకు కలెక్టర్ పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఈ మేరకు ప్రతి మార్కెట్ యార్డు పరిధిలో విజిలెన్స్, రెగ్యులేషన్ కమిటీలను నియమించారు. అందులో తహశీల్దార్, మండల వ్యవసాయ అధికారి, సర్కిల్ ఇన్స్పెక్టర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి, తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ లు ఉంటారు. ఈ బృందం పత్తి దిగుబడుల రాక, మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లపై దృష్టి సారించనున్నారు. మార్కెట్ యార్డుకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలి. రైతులు నిర్ణీత తేదీకి అనుగుణంగా మార్కెట్‌కు పత్తి తీసుకొస్తున్నారా? లేదా? అనేది పరిశీలిస్తారు. పత్తి నాణ్యతను పరిశీలించిన తర్వాత దానికి సంబంధించిన పత్రాన్ని ఈ కమిటీ సభ్యులు జారీ చేయాలి. రోజు బీట్ జరిగే సమయానికి ఉదయం 8.45 గంటలకు అందుబాటులో ఉండాలి. జిన్నింగ్‌లు, ప్రెస్సింగ్, చెక్‌పోస్టుల గుండా వచ్చే వాహనాలపై దృష్టి సారించాలి. ఇది నిరంతరంగా జరుగుతుందా లేదా అని పరిశీలన, తనిఖీలు చేసేందుకు డివిజనల్ స్థాయిలో స్పెషల్ ఆఫీసర్ల బృందం ఉంటుంది. ఇందులో ఆర్డీవో, డీఎఫ్‌వో, వాణిజ్యపన్నుల అధికారి, తహశీల్దార్, సీఐ, తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్, వ్యవసాయ శాఖ ఏడీ, మార్కెట్ కమిటీ కార్యదర్శులు ఉంటారు. భోరజ్, బేల్తా ఎక్స్‌రోడ్, వాంకిడి, లక్సెట్టిపేట, సోన్‌ల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఈ బృందం తనిఖీ చేస్తుండాలి. పత్తి కొనుగోళ్లలో సమస్యలు, ఫిర్యాదులు ఉన్న పక్షంలో తెలియజేసేందుకు కలెక్టర్ టోల్‌ఫ్రీ నం. 18004253669కు ఏర్పాటు చేశారు. మార్కెటింగ్ శాఖలోని ఏడీ దీనిని పర్యవేక్షిస్తారు. వివిధ శాఖలకు కలెక్టర్ ఆదేశాలు మార్కెట్‌యార్డు వారీగా యాక్షన్‌ప్లాన్‌ను వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఖరారు చేయాలి. మార్కెట్ యార్డుకు ఏఏ గ్రామం నుంచి ఎప్పుడెప్పుడు పత్తిని తీసుకొచ్చి విక్రయించాలనే తేదీలను నిర్ణయించారు. ఆర్డీవో, మండల వ్యవసాయ అధికారులు, తహశీల్దార్లను సంప్రదించి ఈ తేదీలను నిర్ణయించాలి. ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసుశాఖ మార్కెట్ యార్డుల పరిధిలో ట్రాఫిక్, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా మార్కెట్ సీజన్ పూర్తయ్యే వరకు అవసరమైన పోలీసు సిబ్బందిని నియమించాలి. పత్తి వాహనాలు, బండ్లు వచ్చేందుకు రూట్ మ్యాప్‌లను తయారు చేయాలి. వాహనాలకు టోకెన్ జారీ చేయాలి. ఆర్డీవోల ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారులు, తహశీల్దార్లు గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి కనీస మద్దతు ధర, పత్తి నాణ్యత తదితర విషయాలను రైతులకు వివరించాలి. రోజు మార్కెట్ యార్డులో ఉదయం 8.30 గంటలకు పత్తి ధర నిర్ణయించి ఆ విషయం జాయింట్ కలెక్టర్‌కు తెలియజేసి మార్కెట్ యార్డుల్లో ధరను ప్రదర్శించే బాధ్యతను మార్కెట్‌యార్డు కార్యదర్శులు నిర్వర్తించాలి. ఒకసారి ధర నిర్ణయించిన తర్వాత ఆ రోజు ధర పడిపోకుండా చూడాల్సిన బాధ్యత వహించాలి. కార్యదర్శులు రోజు బీట్‌లో పాల్గొనాలి.రైతుల నుంచి అధిక కమీషన్, హమాలీ చార్జీలు, వేమెంట్ చార్జీలు తీసుకోరాదు. సీసీఐ అధికారులు కూడా బీట్‌లో ఉండాలి. మార్కెటింగ్ శాఖ ఏడీ, సీసీఐ బీఎంలు, మార్కెట్‌యార్డు కార్యదర్శులు రైతులకు కంప్యూటరైజ్డ్ తక్ పట్టీలను జారీ చేయాలి. రైతులకు పంట అమ్మగా వచ్చే డబ్బులను వీలైనంత త్వరగా అందేలా చూడాలి. రైతులు తీసుకొచ్చే పత్తిలో 8 నుంచి 12 శాతం లోపు తేమ ఉంటే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు పేర్కొంటున్నారు. 12 శాతం మించితే కొనుగోలు చేయమని స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా పత్తి కుప్పలో పైన నాణ్యమైన పత్తి ఉంచి లోపల నీళ్లతో తడిపి తీసుకొచ్చే పత్తిని కొనుగోలు చేయమని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు సహకరించాలని సీసీఐ అధికారులు కోరుతున్నారు. -
అటవీశాఖ భూములను గుర్తించాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో అటవీశాఖ భూములను గుర్తించాలని ఆ శాఖ అధికారులను కలెక్టర్ అహ్మద్ బాబు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ, వివిధ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ భూముల్లో ఎక్కడెక్కడ రోడ్లకు అనుమతి ఇచ్చారో తెలపాలని ఆ శాఖ అధికారులను అడిగారు. రెవెన్యూ అధికారులు సంబంధిత డీఎఫ్‌వోలకు అటవీ భూములకు సంబంధించిన నివేదిక అందజేసినా అటవీశాఖ అధికారులు భూములు గుర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జిల్లాలోని డీఎఫ్‌వోలు ఫారెస్ట్ క్లియరెన్స్ నివేదికలు తమకు వారంలోగా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. రోడ్డు పనులు ఎక్కడెక్కడ చేపడుతున్నారు?, పనులు ఎంత వరకు పూర్తయ్యాయని ఆర్ అండ్ బీ ఎస్ఈ ఉమామహేశ్వర్‌రావును అడిగి తెలుసుకున్నారు. రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. జేసీ సుజాతశర్మ, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, నిర్మల్, మంచిర్యాల ఆర్డీవోలు అరుణశ్రీ, చక్రధర్, డీఎంహెచ్‌వో స్వామి, అధికారులు పాల్గొన్నారు. -
నవంబర్ నుంచి ఆధార్ ద్వారా పింఛన్ చెల్లింపులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : నవంబర్ ఒకటో తేదీ నుంచి వృద్ధాప్య, వితంతు పింఛన్లు ఆధార్ నంబర్‌తో బయోమెట్రిక్ విధానం ద్వారా చెల్లిస్తామని కలెక్టర్ అహ్మద్‌బాబు తెలిపారు. శనివారం సాయంత్రం టీటీడీసీలో మెప్మా ఆధ్వర్యంలో 56 మంది సీఎస్పీలకు మైక్రో ఏటీఎం యంత్రాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రలు ఎలా తీసుకోవాలి, ఆధార్ నంబర్ ఎలా నమోదు చేయాలి అనే దానిపై అవగాహన కల్పించారు. పింఛన్లలో అవకతవకలు జరగకుండా ఈ విధానం తోడ్పడుతుందన్నారు. సీఎస్పీలు బాగా పనిచేస్తే ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆధార్ ద్వారా చెల్లింపులు చేసేలా అప్పగిస్తుందన్నారు. ఆన్లైన్ చెల్లింపులు లాగిన్, పాస్‌వర్డ్‌లను ఆర్డీవోలకు, సబ్ కలెక్టర్లకు ఇవ్వాలని మెప్మా పీడీ రాజేశ్వర్‌ను ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్డీవోలు అరుణశ్రీ, చక్రధర్, మెప్మా సిబ్బంది సుభాష్, సీఎస్పీలు పాల్గొన్నారు. -
అన్నింటా విద్యాశాఖ వెనుకంజ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం విద్యాశాఖలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో, విద్యార్థులకు చదువు చెప్పడంలో విద్యాశాఖ వెనుకంజలో ఉందని కలెక్టర్ అహ్మద్ బాబు అభిప్రాయపడ్డారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంఈవోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడల్ స్కూల్స్, స్కాలర్షిప్లు, విద్యార్థుల ఆధార్ అనుసంధానం, ఎంఈవోల పనితీరు, కేజీబీవీ, తదితర వాటిపై సమీక్షించారు. జిల్లాకు 27 లక్షల 96 వేల 703 పాఠ్యపుస్తకాలు రాగా, ఇంకా 3 లక్షల 50 వేల పాఠ్యపుస్తకాలు గోదాంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. 3,360 పాఠశాలకు మరుగుదొడ్లు మంజూరైనా ఇప్పటివరకు 1,327 పాఠశాలల్లో ఇంకా పూర్తి కాలేదన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంఈవో, స్పెషల్ ఆఫీసర్లు జాయింట్ అకౌంట్లో డబ్బులు జమ చేసి పనులను వారికి అప్పగించాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎం-బుక్‌లో నమోదు చేయాలని సూచించారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.35 వేలు కేటాయించారని పేర్కొన్నారు. తిర్యాణి మండలానికి 108 మరుగుదొడ్లు మంజూరు కాగా, అందులో 8 మాత్రమే పూర్తి చేశారని సంబంధిత ఎంఈవో కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వీడీసీ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, ఉపాధ్యాయులు కలిసి పూర్తి చేయాలని ఎంఈవోకు సూచించారు. వివరాలన్నింటినీ మండల ప్రత్యేక అధికారులకు సమర్పించాలని ఎం ఈవోలను ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారంగా పాఠశాలలు సమయం పాటించాలని సూచించారు. ఈ సంవత్సరం పరీక్షల్లో కాపీయింగ్ జరగకుండా చూస్తానని పేర్కొన్నారు. పోలీసులు, అధికారులతో సెంటర్ల వద్ద బందోబస్తు ఉంటుందని తెలిపారు. వసతిగృహాల మరమ్మతు కోసం రూ.58 లక్షలు కేటాయించారని, 34 వసతి గృహాల్లో మరమ్మతులు చేపట్టినట్లు కనిపించడం లేదన్నారు. పాఠశాలలో వంట స్టోర్ రూమ్, వంట షెడ్ నిర్మాణాలు చేపట్టినా ఇంకా పూర్తి చేయడం లేదన్నారు. నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు జేసీ వెంకటయ్య, డీఈవో అక్రముల్లాఖాన్, నిర్మల్ ఆర్డీవో అరుణశ్రీ, ఎంఈవోలు, అధికారులు పాల్గొన్నారు. -
ముగ్గురు అధికారుల సస్పెన్షన్
కలెక్టరేట్/గుడిహత్నూర్, న్యూస్‌లైన్ : జిల్లాలోని ముగ్గురు రెవెన్యూ అధికారులను సోమవారం కలెక్టర్ అహ్మద్ బాబు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో నిర్మల్ కేఆర్సీ తహశీల్దార్ జాడి శంకర్, గుడిహత్నూర్ ఎన్ఫోర్స్మెంట్ డీటీ గజానన్, గుడిహత్నూర్ వీఆర్వో లీలలు ఉన్నారు. వీరు ముగ్గురు గుడిహత్నూర్‌లో పనిచేశారు. జాడి శంకర్ తహశీల్దార్‌గా, గజానన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. లీల ప్రస్తుతం కూడా గుడిహత్నూర్ వీఆర్వోగా పనిచేస్తోంది. వీరు పనిచేసిన కాలంలో మండల కేంద్రంలోని బస్టాండ్ ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 98 భూ వివాదంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీవోలతో విచారణ జరిపించారు. వారు ఇచ్చిన నివేదిక మేరకు సస్పెండ్ చేశారు. -
దీపం కనెక్షన్లు గ్రౌండింగ్ చేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : 2013-14 సంవత్సరానికి గాను జిల్లాకు కేటాయించిన దీపం కనెక్షన్లను నెలలోగా గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ అహ్మద్ బాబు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, డీలర్లు, గ్యాస్ ఏజెన్సీ యజమానులు, అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులను గుర్తించి గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయడంలో అధికారుల మధ్య సమన్వయం కన్పించడం లేదని అన్నారు.మొత్తం 23వేల కనెక్షన్లు నెలలోగా మంజూరు చేసి ప్రతిపాదనలు తనకు పంపించాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని త్వరలో గ్రౌండింగ్ చేస్తామని అధికారులు తెలిపారు. వచ్చేవారం సమావేశానికి సమగ్ర నివేదికలతో హాజరు కావాలని కలెక్టర్ సూచిం చారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బ్యాంకుమేళాలు నిర్వహించాలని ఆదేశించినా కొన్నిచోట్ల నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని మండలాల్లో బ్యాంకు మేళా నిర్వహించాలని చెప్పారు. జిల్లా వ్యాప్తం గా 8 లక్షల ఖాతాలు తెరవడం లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు మండలాల్లో 53 వేల ఖాతాలు, పట్టణాల్లో 53 వేలు, ఐటీడీఏ పరిధిలో 59,781 బ్యాంక్ ఖాతాలు తెరిచారని అన్నారు. మొత్తంగా లక్షా 65వేల ఖాతాలు తెరిచారని, లక్ష్యాన్ని నెలలో సాధించాలని తెలిపారు. 17, 18వ తేదీల్లో కొన్ని మండలాల్లో మేళా నిర్వహించలేదని డీటీ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతా తెరవడంలో అధికారులు విఫలమవుతున్నారని కలెక్టర్ అన్నారు. ఆర్డీవోలందరూ బ్యాంక్మేళాలు, మండలాల వారీగా ప్రతి రోజు సాయంత్రం ఖాతాలు తెరిచిన వివరాలు సేకరించాలని, మేళా నిర్వహించకపోతే తనకు గానీ, సంబంధిత బ్యాంకు ప్రధాన కార్యాలయానికి గానీ సమాచారం అం దించాలని ఫోన్లో ఆర్డీవోలను ఆదేశించారు. శని వారం ఎన్ని ఖాతాలు తెరిచారో అడిగి తెలుసుకున్నారు. వేలిముద్రలు ఉన్న వారి ఖాతాలు తెరవడం లేదని, సంతకం చేసిన వారి ఖాతాలే తెరుస్తున్నారని ఎన్ఫోర్స్మెంట్ డీటీలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం సీరియస్‌గా తీసుకోవాలని అందరికీ ఖాతాలు తెరిచేట్లు చూడాలని కలెక్టర్ తెలిపారు. 3,36,310 గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఇప్పటివరకు 2,53,752 కనెక్షన్లు ఆధార్‌తో అనుసంధానం చేసినట్లు తెలిపారు. డీఎస్వో వసంత్‌రావు దేశ్‌పాండే, మెప్మా పీడీ రాజేశ్వర్, డీఎంహెచ్‌వో స్వామి పాల్గొన్నారు. -
వేటు పడింది..
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : బెల్లంపల్లిలోని రూ.100 కోట్ల భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన ముగ్గురు రెవెన్యూ అధికారులపై వేటు పడింది. తహశీల్దార్ బి.విశ్వంభర్ (ప్రస్తుతం కౌటాల తహశీల్దార్), డిప్యూటీ తహశీల్దార్ రమేష్‌బాబు (ప్రస్తుతం వాంకిడి తహశీల్దార్), రెవెన్యూ ఇన్స్పెక్టర్ రోహిత్‌దేశ్‌పాండే (ప్రస్తుతం జైనూర్ డిప్యూటీ తహశీల్దార్)లను కలెక్టర్ అహ్మద్‌బాబు సస్పెండ్ చేశారు. ఏడాదిన్నర నుంచి బెల్లంపల్లి కన్నాల శివారులోని భూ అవకతవకలపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. లక్షల రూపాయలు ముడుపులు పుచ్చుకుని రెవెన్యూ అధికారులు రికార్డులను తారుమారు చేసి బినామీలకు హక్కులు కల్పించారనే ఆరోపణలు వచ్చాయి. 20 ఏళ్ల క్రితం నిర్మించిన బీఎస్ఎన్ఎల్, ఏపీ ట్రాన్స్‌కో, అటవీ శాఖ భవనాలు, డీఎఫ్‌వో కార్యాలయం, బెల్లంపల్లి టూటౌన్ కార్యాలయాల స్థలాలకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నివాసం ఉండే కొందరు వ్యక్తులదని తప్పుడు ప్రొసిడింగ్ ఇచ్చారు. ఇతర దేశంలో నివసిస్తున్న ఓ మహిళ, మరికొందరి పేరున 2011 జనవరి 13న 243.28 ఎకరాల భూములున్నట్లు తప్పుడు ప్రొసిడింగ్స్ తీశారు. వందలాది ఎకరాల భూములను రెవెన్యూ అధికారుల అండదండలతో కొందరు హస్తగతం చేసుకుంటున్న వైనాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో వాటికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్‌లను ఆధారం చేసుకుని బెల్లంపల్లికి చెందిన కొందరు కలెక్టర్ అహ్మద్‌బాబుకు ఇటీవల లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో కెమికల్ ఫ్యాక్టరీ భూముల రికార్డుల తారుమారుపై విచారణ జరిపి అవకతవకలకు పాల్పడిన ముగ్గురు రెవెన్యూ అధికారులను కలెక్టర్ సస్సెన్షన్ చేయడం సంచలనం సృష్టించింది. ఏం జరిగిందంటే.. బెల్లంపల్లి కన్నాల శివారులోని సర్వే నం.108, 109, 110/1, 111లలో కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన భూములు ఉన్నాయి. 1971లో కెమికల్ ఫ్యాక్టరీ కాయిళా పడటంతో అందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన డబ్బుల కోసం ప్రభుత్వం కెమికల్ ఫ్యాక్టరీ భూములను ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి విక్రయించింది. సింగరేణి, అటవీ, పోలీసు, విద్యుత్, బీఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ రంగ శాఖలు ఆ భూములను కొనుగోలు చేశాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ శాఖల వద్ద రికార్డులున్నా అప్పటి బెల్లంపల్లి తహశీల్దార్ విశ్వంభర్, డిప్యూటీ తహశీల్దార్ రమేష్‌బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రోహిత్‌దేశ్‌పాండే ప్రైవేట్ వ్యక్తులకు ఆ భూములపై అధికారం కట్టబెట్టడానికి అక్రమ రికార్డులు సృష్టించారు. అక్రమాలలో సిద్ధహస్తుడు.. బెల్లంపల్లి తహశీల్దార్‌గా పనిచేసిన విశ్వంభర్ భూ అక్రమాలలో సిద్ధహస్తుడిగా పేరుగాంచారు. లొసుగులను ఆసరా చేసుకొని తన అక్రమాలను యథేచ్ఛగా కొనసాగించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సింది పోయి అక్రమాలకు దిగారు. అడిగినంత ఇస్తే చాలు ఎంతటి పనైనా ఇట్టే చేసిపెట్టడం ఆయన నైజం. బెల్లంపల్లిలో ప్రభుత్వ, అటవీ భూములను తప్పుడు మార్గాన అనేక మందికి పట్టాలు చేసి ఇచ్చారని, రాజకీయ ప్రముఖులకు, ముడుపులు అందించిన వారికి లక్షలు విలువ చేసే భూములు కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. కన్నాల, బుధాకలాన్ శివారులలోని విలువైన వందల ఎకరాల ప్రభుత్వ భూములు విశ్వంభర్ హయాంలోనే అనర్హుల వశమయ్యాయి. విశ్వంభర్కు తోడు డిప్యూటీ తహశీల్దార్ రమేష్ బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రోహిత్‌దేశ్‌పాండే ఆ భూ ఆక్రమాల్లో చేదోడువాదోడుగా మెలిగారు. బెల్లంపల్లి కేంద్రంగా కలకలం రేపిన భూ అక్రమాల్లో ప్రధాన నిందితులుగా ముగ్గురు రెవెన్యూ అధికారులు చివరకు దోషులుగా విచారణలో తేలడంతో అధికారగణం వారిని ఉద్యోగాల నుంచి సస్పెన్షన్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. భూ అక్రమాలను ‘సాక్షి’ వరుసగా వెలువరించినకథనాలు అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. -
గరం.. గరం
అవినీతి, అక్రమాలపై ప్రజాప్రతినిధుల ధ్వజం ఐఎస్ఎల్ పేరిట రూ.17.36 కోట్ల స్కాంపై నిరసన కాంగ్రెస్ ఫ్లెక్సీల ఏర్పాటుపై ఎంపీ, ఎమ్మెల్యేల ఆందోళన కలెక్టర్ బాబు టీమ్‌కు కితాబు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉట్నూరు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పాలక మండలి సమావేశం గరం గరంగా సాగింది. ప్రొటోకాల్ నుంచి మొదలుకుని పలు సంక్షేమ, అభివృద్ధి పనుల అమలులో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై రచ్చ రచ్చ అయ్యింది. సుమారు మూడేళ్ల మూడు నెలల తర్వాత శుక్రవారం ఉట్నూరులోని కొమురం భీమ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వం, అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. అటవీశాఖ, డ్వామా, హౌసింగ్, ఐటీడీఏ ద్వారా అమలవుతున్న పథకాలు, ఐఏపీ, ఆర్ఐడీఎఫ్, ఈజీఎస్ నిధుల కేటాయింపులో వివక్ష జరుగుతోందంటూ ధ్వజమెత్తారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం కింద ఓ ప్రైవేట్ ఏజెన్సీకి రూ.17.36 కోట్లు కట్టబెట్టడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని, వెంటనే తీర్మానం ఆమోదించాలంటూ ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో సభ్యులు పట్టుబట్టారు. సుమారు ఆరు గంటలపాటు జరిగిన సమావేశం ఏజెండాలో 23 అంశాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రధానాంశాలపైనే చర్చ సాగింది. ఈ సందర్భంగా ఎంపీ రాథోడ్ రమేశ్, ముథోల్ ఎమ్మెల్యే ఎస్.వేణుగోపాలాచారి, ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్య మధ్య పలుమార్లు వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి సారయ్య ఫ్లెక్సీలు,{పొటోకాల్పై వివాదం ఐటీడీఏ పాలకమండలి సమావేశం సందర్భంగా కొమురం భీమ్ కాంప్లెక్స్ ఆవరణలో ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్యతోపాటు ప్రభుత్వం, పార్టీ ప్రతినిధుల ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేయడంపై ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీలు రాథోడ్ రమేశ్, జి.వివేక్, ఎమ్మెల్యేలు గోడం నగేశ్, జోగు రామన్న, కావేటి సమ్మయ్య, గడ్డం అరవిందరెడ్డి, నల్లాల ఓదేలు, రాథోడ్ సుమన్‌బాయి తదితరులు నిరసన వ్యక్తం చేశారు. ‘ఫ్లెక్సీలు తొలగిస్తే తప్ప సమావేశానికి హాజరుకామని’ సమావేశ మందిరానికి వెళ్లకుండా సమీపంలోని అతిథి గృహానికి చేరుకున్న వారు సుమారు గంటపాటు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎంపీ రాథోడ్ రమేశ్ ‘ఇది కాంగ్రెస్ పార్టీ సమావేశమా? లేక ఐటీడీఏ పాలకమండలి సమావేశమా? అర్థం కావడం లేదు’ అంటూ కలెక్టర్ అహ్మద్ బాబు, ఐటీడీపీ పీవో జనార్దన్ నివాస్ దృష్టికి తీసుకెళ్లి వారితో వాగ్వాదానికి దిగారు. ఇంతలో సమావేశం మందిరానికి చేరుకున్న ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్య పరిస్థితి తెలుసుకుని ఎంపీలు, ఎమ్మెల్యేలను సమావేశానికి ఆహ్వానించారు. దీంతో సమావేశ మందిరానికి చేరుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫ్లెక్సీల వివాదం తేల్చాకే సమావేశాన్ని ప్రారంభించాలని పట్టుబట్టగా మంత్రి సారయ్య, కలెక్టర్ అహ్మద్ బాబుల ఆదేశం మేరకు పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించడంతో గొడవ సద్దు మణిగింది. ఫ్లెక్సీల వివాదం సద్దుమణిగిన తర్వాత తమ నియోజకవర్గంలోని కడెంలో తాను లేకుండా అభివృద్ధి పనులు మంత్రి సారయ్య ప్రారంభించారని ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ ప్రోటోకాల్ వివాదం లేవనెత్తారు. ఐటీడీఏ అధికారుల ద్వారా ముందే సమాచారం పంపించామని కలెక్టర్ అహ్మద్ బాబు సమాధానం చెప్పారు. రూ.17.36 కోట్ల స్కాంపై విచారణకు డిమాండ్ జిల్లాలో లక్ష మరుగుదొడ్ల నిర్మాణం పేరిట గతంలో పనిచేసిన అధికారులు కొందరు ఎంపీడీవోల ద్వారా ఓ కాంట్రాక్టర్‌కు రూ.17.36 కోట్ల మేరకు చెల్లించి స్కాంకు పాల్పడ్డారంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. మూడు వేలకు దాటని వ్యక్తి మరుగుదొడ్ల(ఐఎస్ఎల్)కు టూల్ కిట్స్ పేరిట ఓ కాంట్రాక్టర్ రూ.17.36 కోట్లు చెల్లించిన అధికారులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని ఎంపీ రాథోడ్ రమేశ్ పట్టుపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హౌసింగ్, ఉపాధి హామీ పథకం కోసం ఏటా రూ. కోట్లు ఖర్చు చేస్తున్న అధికారులు సక్రమంగా ఖర్చు చేయకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఎంపీ అసంతృ ప్తిని వ్యక్తం చేశారు. హౌ సింగ్‌లో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ అహ్మద్ బాబు ఐఎస్ఎల్ల నిర్మాణంపై సర్వే చేసి ప్రభుత్వానికి ఇటీవలే నివేదిక పంపామని పేర్కొనగా, ఇన్చార్జి మంత్రి సారయ్య వి జిలెన్స్ విచారణకు ఆదేశించనున్నట్లు ప్రకటిం చారు. కాగా వామపక్ష తీవ్ర ప్రాబల్యం గల ప్రాంతాల్లో మంజూరు చేసే ఐఏపీ నిధుల విషయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేలు జోగు రామన్న, కావేటి సమ్మయ్య, గోడం నగేశ్, ఆత్రం సక్కు, సముద్రాల వేణుగోపాలాచారి ఆందోళన వ్యక్తం చేశా రు. గిరిజన సమస్యలపై అవగాహన లేకుండా రూ.28 కోట్లతో ఆమోదించిన పనులను తక్షణ మే రద్దు చేసి ఎంపీలు, ఎమ్మెల్యేలు చేసే ప్రతి పాదనలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన పనులు ఆమోదం లభించిందని, వాటిని రద్దు చేసే అవకాశం లేదని కలెక్టర్, పీవో వివరించారు. ఎంపీ వ్యాఖ్యలపై నిరసన మూడేళ్ల తర్వాత జరిగిన ఉట్నూరు ఐటీడీఏ పా లకమండలి సమావేశం సుమారు ఆరు గంటల పాటు వాడివేడీగా సాగింది. హౌసింగ్, అటవీ శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థల్లో అవినీతి పెచ్చుపెరిగిందని, అవినీతి అధికారులపై చర్య లు తీసుకునే వారే లేరని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేశ, రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోతే జిల్లాలో కాంగ్రెస్ నేతలు, అధికారుల కారణంగా అవినీ తి పెచ్చరిల్లిందని, అడవులను సంరక్షించాల్సిన అటవీశాఖ అధికారులు, డీఎఫ్‌వోలు దొంగలు గా మారి స్మగ్లర్లకు సహకరించారంటూ ఎంపీ రాథోడ్ రమేశ్ తీవ్రమైన వ్యాఖ్య లు చేయడంపై డీఎఫ్‌వోలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జన్నారం డీఎఫ్‌వో రామకృష్ణారావు అటవీశాఖ అనుమతులకు సంబంధించి వివరణ ఇస్తున్న సమయంలో ఎంపీ చేసిన వ్యాఖ్యలపై వారు తీ వ్రంగా ప్రతిఘటించి నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ తమను దొంగలంటూ నిరాధారమైన ఆ రోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొనగా... ఆధారాలతో నిరూపిస్తామంటూ ఎంపీ రమేశ్ సవాల్ చేయడంతో ఇరువర్గాల మధ్యన వాగ్వాదం పెరగడంతో మంత్రి సారయ్య జోక్యం చేసుకుని శాంతింప జేశారు. నిజంగానే ఆధారాలుంటే చర్యలు తీసుకుందామని మంత్రి సర్ధిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. మీరొచ్చాకే పరిస్థితి మారింది.. పాలక మండలి సమావేశం ఆద్యంతం నిరసన లు, ఆందోళనలు, విమర్శలు, వాగ్వాదాల మ ధ్యన అవినీతి, అక్రమాలపై చర్చ జరిగినా.. ‘మీరొచ్చాకా జిల్లాలో పరిస్థితి మారింది’ అం టూ చివరకు కొందరు ప్రజాప్రతినిధులు కలెక ్టర్ అహ్మద్ బాబు టీమ్‌కు కితాబు ఇచ్చారు. ఫె ్లక్సీల ఏర్పాటు, ప్రోటోకాల్ వివాదంపై రగిలిన సభ్యులు ప్రజాప్రతినిధులను కలుపుకుని ఇంకా పనిచేయాలంటూ వారికి ధీమా ఇచ్చారు. బ యోడీజిల్ మొక్కల పెంపకం మొదలుకుని, ఐఎస్ఎల్ టూల్‌కిట్స్ పంపిణీ వరకు స్కామ్‌లకు నిలయంగా మారిన సమయంలో రెండున్నర మాసాలుగా పాలన కొంత గాడిన పడినట్లు కనిపిస్తుందని పేర్కొన్నారు. కాగా మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీలు రాథోడ్ రమేశ్, జి.వివేక్, ఎమ్మెల్యేలు గోడం నగేశ్ గడ్డం అరవింద రెడ్డి, జోగు రామన్న, సముద్రాల వేణుగోపాలాచారి, కావేటి సమ్మయ్య, సుమన్ రాథోడ్, ఆత్రం సక్కు, నల్లాల ఓదేలు, గుండా మల్లేశ్, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి హాజరు కాగా ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, నిర్మల్ ఎమ్మెల్యే ఎ.మహేశ్వర్‌రెడ్డి గైర్హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ సుజాత శర్మ, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, డ్వామా, డీఆర్డీఏ పీడీలు వినయ్ కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డిలు, జిల్లా అటవీశాఖాధికారి తిమ్మారెడ్డి, పీఆర్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, ట్రాన్స్‌కో ఎస్ఈలు ఉమా మహేశ్వర్‌రెడ్డి, హంసారెడ్డి, ఇంద్రసేన్, అశోక్‌లు, జేడీఎ రోజ్‌లీల, డీ ఎంహెచ్వో డాక్టర్ స్వామి, డీఎప్వోలు శేఖర్‌రెడ్డి, వినోద్, రామకృష్ణారావులతోపాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.