కలెక్టర్ బదిలీపై నిరసనలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పాలనను గాడిలో పెట్టి జిల్లావాసుల మన్ననలను పొందిన కలెక్టర్ అహ్మద్‌బాబు ఆకస్మిక బదిలీపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ అధికార యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేసిన కలెక్టర్‌ను సర్కారు ఆకస్మికంగా బదిలీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది కాలం పనిచేయగా, మరో ఏడాదిపాటు ఇక్కడే పనిచేస్తారని భావించిన తరుణంలో ఆకస్మిక బదిలీ జిల్లావాసులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది.
పలుచోట్ల నిరసనలు
కలెక్టర్ అహ్మద్‌బాబును బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రైతు, జేఏసీ, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పలు మండలాల్లో రాస్తారోకో నిర్వహించారు. నిర్మల్‌లో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందజేశారు. కలెక్టర్‌గా బాబును కొనసాగించాలంటూ మంచిర్యాలలో రైతు కూలీ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. చెన్నూరు రహదారిపై ఓవర్‌బ్రిడ్జి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దండేపల్లిలో బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తాంసి మండల కేంద్రంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తలమడుగులో జేఏసీ, రైతులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాలను చేపట్టారు.
అజయ్‌మిశ్రాను కలిసిన కలెక్టర్
బదిలీ ఉత్తర్వులు వెలువడిన వెంటనే అహ్మద్‌బాబు శు క్రవారం హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి ప్రభుత్వ కా ర్యదర్శి అజయ్‌మిశ్రాను కలిశారు. కాగా మరోవైపు తన బదిలీని నిలిపివేయాలని కోరుతూ కలెక్టర్ పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ ఈ విషయాన్ని కలెక్టర్ కొట్టి పారేశారు. అలాంటి యోచన తనకు లేదని అహ్మ ద్‌బాబు ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు.జిల్లాలో విద్య, వైద్య రంగాల అభివృద్ధి పకడ్బందీ ప్రణాళిక రూపొం దించామని, ఈ ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలు చే సేందుకు మరో ఆరునెలల సమయం ఇచ్చినా బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా కొత్తగా జిల్లా కలెక్టర్‌గా నియమితులైన డాక్టర్ ఎం.జగన్మోహన్ మరో రెం డు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి.