‘ప్రత్యేక’ పండుగ | today telangana formation celebrations | Sakshi
Sakshi News home page

‘ప్రత్యేక’ పండుగ

Published Mon, Jun 2 2014 3:52 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

today telangana formation celebrations

 సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ :  ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. కలెక్టర్ అహ్మద్ బాబు సంబంధిత శాఖల అధికారులతో వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం సమీక్షించారు. జూన్ 2 అపాయింటెడ్ డేను పురస్కరించుకుని పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు.

 స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల మాదిరిగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో ప్రభుత్వ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆటల పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి వారం రోజులపాటు ఈ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 రాజకీయ పార్టీలు..
 ప్రధాన పార్టీలు కూడా ‘తెలంగాణ’ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాయి. టీఆర్‌ఎస్ శ్రేణులు ఈ ఏర్పాట్లలో మునిగి తేలుతున్నాయి. అధినేత కేసీఆర్ జూన్ 2 నాడే ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో మరింత ఉత్సాహంగా సంబరాలు నిర్వహించాలని భావిస్తున్నాయి. ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వెనుక తమ పార్టీ అధినేత్రి సోనియా కృషి ఎంతో ఉం దని, తెలంగాణ కల సాకరమైన వేళ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. బీజేపీ ఆధ్వర్యంలో కూడా సంబ రాలు నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయిం చింది. జాతీయ జెండాల ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ శ్రేణులు సమాయత్తమయ్యాయి.

 టీఎన్జీవోలు.. ప్రజాసంఘాలు..
 టీఎన్జీవో, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలను  ఘనంగా నిర్వహించాలని ఆయా సంఘాల నేతలు సంసిద్ధమయ్యారు. టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవాలని నిర్ణయించారు. సోమవారం ఉదయం పట్టణంలో ర్యాలీ నిర్వహించి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించాలని భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జేఏసీ నాయకులు పేర్కొన్నారు.  

 వారం రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు
 వారం రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ కళాకారులు భావిస్తున్నారు. తెలంగాణవాదుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ధూం ధాం కార్యక్రమాలను పలు చోట్ల నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంతోపాటు, అన్ని పట్టణాల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల వారు సిద్ధమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement