కలెక్టర్ బదిలీ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :కలెక్టర్ అహ్మద్ బాబు బదిలీ అయ్యారు. ఆయనను హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న ఎం.జగన్‌మోహన్‌ను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. కలెక్టర్ బదిలీపై అధికార, రాజకీయ వర్గాల్లో వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ప్రభుత్వం ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బాబు బదిలీ వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. 1999 బ్యాచ్‌కు చెందిన జగన్‌మోహన్ తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉంది. మెదక్ జిల్లా సిద్దిపేటతోపాటు, నల్గొండ జిల్లాలో ఆర్డీవోగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) ప్రాజెక్టు డెరైక్టర్‌గా పనిచేశారు. 2005 నుంచి 2008 వరకు విజయనగరం, రంగారెడ్డి జేసీగా పనిచేశారు.
పాలనపై బాబు ముద్ర
2013 జూన్ 18న కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న అహ్మద్‌బాబు జిల్లా పాలనపై తనదైన ముద్ర వేశారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. బాధ్యతలు స్వీకరించిన కొత్తలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పలువురు అధికారులను, ఆరోపణలు ఎదుర్కొన్న సిబ్బందిని సరేండర్ చేస్తూ తీసుకున్న నిర్ణయాలు అప్పట్లో అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆదిలాబాద్, భైంసా వంటి పట్టణాల్లో ఆక్రమణల తొలగింపు విషయంలో సహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
ఐరీష్ విధానం ద్వారా బోగస్ లబ్ధిదారుల ఏరివేతకు చర్యలు తీసుకున్నారు. వివిధ పథకాలకు ఆధార్ అనుసంధానంలో దేశంలోనే ప్రముఖ స్థానంలో జిల్లాను నిలపడానికి కృషి చేశారు. ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని జీఎంఎస్ విధానం అమలు చేయడంతో ప్రజలకు కొంత మేలు జరిగింది. ఇటీవల జరిగిన మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలతోపాటు గతేడాది జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వహించారు. రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం లోను కాకుండా తనదైన శైలిలో పాలన కొనసాగించారు.
ఉద్యోగుల్లో కొంత వ్యతిరేకత
కలెక్టర్ వ్యవహారశైలిపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. సమీక్షా సమావేశాల్లో కలెక్టర్ మాట తీరుతో పలువురు జిల్లా ఉన్నతాధికారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా కేవలం సమీక్షలకే పరిమితమయ్యారనే విమర్శలు ఉన్నాయి. కలెక్టర్ వ్యవహార శైలిని నిరసిస్తూ పలుమార్లు నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి.