‘ఘన’తంత్రం | 65th republic day celebrations | Sakshi
Sakshi News home page

‘ఘన’తంత్రం

Published Mon, Jan 27 2014 2:38 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

65th republic day celebrations

ఆదిలాబాద్, న్యూస్‌లైన్ :  సమైక్యత, సమగ్రత పరిరక్షణకు, దేశ, జిల్లాభివృద్ధికి అందరూ సంఘటితంగా పునరంకితమవుదామని కలెక్టర్ అహ్మద్‌బాబు పేర్కొన్నారు. 65వ గణతంత్య్ర వేడుకలు ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా జరిగాయి.

 మొదట ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. వివిధశాఖల శకటాల ప్రదర్శన జరిగింది. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు కలెక్టర్ అహ్మద్‌బాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

 రైతులకు రూ.1,138 కోట్ల రుణాలు
 జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పరచాలని, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని కలెక్టర్ బాబు పేర్కొన్నారు. జిల్లాలోని రైతులకు రూ.1,138 కోట్ల పంట రుణాలు అందించామన్నారు. రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన పథకం ద్వారా రూ.2.31 కోట్లతో 1,495 యూనిట్ల మేలుజాతి పాడిపశువుల పెంపకం లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

 రాష్ట్రంలోనే ప్రథమంగా మన జిల్లాలోని అన్ని మార్కెట్‌యార్డుల్లో కంప్యూటరైజ్డ్ తక్‌పట్టీలను ఉపయోగించి తద్వారా రైతులకు వేగంగా చెల్లింపులు జరిగే చూశామన్నారు. రూ. 2.24 కోట్లతో విద్యుత్‌లేని గిరిజన గ్రామాలకు సౌర విద్యుత్ కల్పించడం జరుగుతుందన్నారు.

 అంతర్రాష్ట్ర రహదారికి రూ.59 కోట్లు
 ఆసిఫాబాద్ నుంచి ఉట్నూర్ వరకు అంతర్రాష్ట్ర రహదారిలో రూ. 59 కోట్లు రాష్ట్ర రహదారుల కోర్నెట్ నిధులతో రెండులేన్‌ల రహదారుల నిర్మాణానికి పనులు టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. రూ.72.61 కోట్లతో 6,170 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏఐబీపీ పథకం ద్వారా 27 పనులు గుర్తించి పరిపాలన ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఐటీడీఏ పరిధిలోని 12 మండలాల్లో సాగు విస్తీర్ణం పెంపుదల, జీవనోపాధి కల్పన, సమగ్రాభివృద్ధి, భూజలాల పెంపుదల కోసం రూ.115 కోట్లతో 16 సమగ్ర నీటిపరివాహక అభివృద్ధి పథకం మెగా ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు.

 ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం
 జిల్లాలో మాతా శిశు మరణాలు తగ్గించడానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జననీ సురక్ష పథకం ద్వారా జిల్లాలో 9,918 మంది పేర్లు నమోదు చేసి 7,366 మందికి ఆధార్ విధానంలో రూ.60.82 లక్షలు జమ చేయడం ద్వారా జిల్లా జాతీయస్థాయిలో రెండో స్థానంలో ఉందన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా జిల్లాశాఖ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో 190 రక్తదాన శిబిరాలు నిర్వహించి 5, 800 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందన్నారు. స్త్రీనిధి కింద 2,414 స్వయం సహాయక సంఘాల్లోని 9,678 మంది సభ్యులకు రూ.16 కోట్లు, వడ్డీలేని రుణాల కింద 25,504 స్వయం సహాయక సంఘాలకు రూ.1.86 కోట్లు విడుదల చేశాం. గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రూ.22.27 కోట్లతో 5,150 మందికి చేకూర్చాం.

 ‘ఉపాధి’లో రెండోస్థానం
 ఉపాధి పథకం ద్వారా జిల్లాలో 2.72 లక్షల కుటుంబాలకు పని కల్పించడం ద్వారా జిల్లా రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాను జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డుకు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మార్చి మాసం వరకు 219 ఆవాస ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గృహ నిర్మాణంలో అక్రమాలు జరగకుండా జీవో మ్యాపింగ్ విధానం ద్వారా పర్యవేక్షణ పెంచడంతో అసలైన లబ్ధిదారులకే ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

 ‘బంగారు తల్లి’ మూడోస్థానం
 ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ద్వారా 2,831 మంది లబ్ధిదారులకు రూ.20.71 కోట్లు, స్వయం ఉపాధి రుణాలు బ్యాంక్ ప్రమేయం లేకుండా 800 మంది లబ్ధిదారులకు రూ.2.29 కోట్ల రుణాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై అందజేయనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా 2013-14 సంవత్సరానికి రూ.14.71 కోట్లతో 112 యూనిట్ల స్థాపనకు లబ్ధిదారులను ఎంపిక చేసి బ్యాంకులకు పంపించినట్లు తెలిపారు. బంగారుతల్లి పథకం అమలులో జిల్లా రాష్ట్రస్థాయిలో మూడోస్థానంలో నిలిచిందన్నారు.

 నాగోబాకు రూ.10 లక్షలు
 ఈనెల 30న ప్రారంభం కానున్న కేస్లాపూర్ నాగోబా జాతరకు రూ.10 లక్షల పర్యాటక శాఖ నిధులతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 26.20 లక్షల మందికి ఆధార్‌కార్డులు జారీ చేయడం ద్వారా 98 శాతం లక్ష్యం సాధించినట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 20,593 మరుగుదొడ్లు పూర్తిచేసి రాష్ట్రస్థాయిలో జిల్లా నాల్గోస్థానంలో నిలిచినట్లు తెలిపారు.

22,532 నిర్మాణ దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి నూతనంగా 2,03,624 మందికి ఓటు హక్కు నమోదు చేయడం ద్వారా జిల్లా రాష్ట్రస్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి గోపాలకృష్ణమూర్తి, ఎస్పీ గజరావు భూపాల్, ఐటీడీఏ పీవో జనార్ధన్ నివాస్, డీఆర్వో ఎస్‌ఎస్ రాజ్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు రోజ్‌లీలా, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మహేందర్, న్యాయమూర్తులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement