ఇక ఈ-గ్రీవెన్స్ | now grievance cell in adilabad district | Sakshi
Sakshi News home page

ఇక ఈ-గ్రీవెన్స్

Published Wed, Jan 1 2014 2:58 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

now grievance cell in adilabad district

కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజా సమస్యల పరిష్కారం.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన నిరుపేదలకు అందేవిధంగా కలెక్టర్ అహ్మద్‌బాబు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో తీసుకునే అర్జీలకు పరిష్కారం చూపడానికి మార్పులు తీసుకొచ్చారు. ఆరు నెలలు శ్రమించి గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(జీఎంఎస్)ను రూపొందించారు. ఈ పద్ధతిని జనవరి 1 నుంచి అంటే బుధవారం నుంచి అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా కలెక్టరేట్‌లో శాఖలవారీగా 12 కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించనున్నారు. ఈ ఫిర్యాదులను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. 30 రోజుల్లో సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. మండల స్థాయిలోనూ ఇదే విధమైన సిస్టమ్‌ను అమలు చేయనున్నారు. ఇంతకాలం పరిష్కారానికి నోచుకోని ప్రజావాణి దరఖాస్తులు ఇప్పుడు వెబ్‌సైట్‌తో పరిష్కారమవుతాయని కలెక్టర్ భావిస్తున్నారు.
 
 నూతన విధానం ఇలా..
 జీఎంఎస్‌పై కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించారు. అర్జీదారు నేరుగా కలెక్టరేట్‌లోగాని, మండల కేంద్రంలోగాని వివరాలు నమోదు చేసుకోవాలి. పేరు, చిరునామా, ఏ సమస్య, రేషన్ కార్డు, ఆధార్ నంబరు, ఫోన్ నంబర్‌ను తప్పని సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సమస్యలకు రేషన్, ఆధార్, ఇతర వాటిని స్కాన్‌చేసి అప్‌లోడ్ చేస్తారు. ఈ వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేస్తారు. నమోదు చేసినవెంటనే సంబంధిత అధికారికి, అర్జీదారునికి ఫోన్ ద్వారా సమాచారం వెళ్తుంది. దీని కోసం ఒక ఎస్‌ఎంఎస్‌కు 13 పైసల చొప్పున(వెయ్యి ఎస్‌ఎంఎస్‌లకు రూ.130) ఖర్చు చేస్తున్నారు. చెప్పిన వివరాలు దరఖాస్తు రూపంలో వచ్చే కాపీని అర్జీదారుడికి అందజేస్తారు. సరైన సమయంలో సంబంధిత అధికారి సమస్యను పరిష్కరించని యెడల, ఆర్డీవోకు, ఆయన స్పందించకపోతే జేసీకి, జేసీ స్పందించకపోతే కలెక్టర్ వద్దకు సమస్య వెళ్లే విధంగా రూపొందించారు. ఈ పద్ధతిని కలెక్టర్ మానిటరింగ్ చేస్తున్నారు.
 
 అమలుకు ఆటంకాలు
 గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(జీఎంఎస్)ను బుధవారం నుంచి అమలుకానుంది. మొదటగా కలెక్టరేట్, ఐటీడీఏ, సబ్ కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాలవారీగా అమలు చేయాలని అధికారులు భావించారు. అనంతరం మున్సిపల్, మండలాల్లో అమలు చేయనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖలు, సెక్షన్లవారీగా వివరాలు, సబ్జెక్టు, సబ్‌సబ్జెక్టు, కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు పేరు, హోదా, సెల్ నంబరు కంప్యూటర్‌లో పొందుపర్చాలి. ఆయా శాఖల అధికారులు ఈ వివరాలను జీఎంఎస్‌లో అప్‌లోడ్ చేసే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ వివరాలను కంప్యూటర్‌లో అప్‌లోడ్ చేస్తేనే సమస్య పరిష్కరించే సదరు అధికారికి గ్రీవెన్స్‌కు వచ్చిన సమస్య సమాచారం వెళ్తుంది. ప్రధానంగా సుమరు 85 ప్రభుత్వ శాఖల వివరాలను నమోదు చేయల్సి ఉంది. ప్రస్తుతం మాస్టర్ ఎంట్రీ, సీట్ ఎంట్రీ, ఎంప్లాయి డాటా, సెక్షన్ల వారీగా సబ్జెక్టు వివరాలు కంప్యూటర్‌లో పొందుపరుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement