జిల్లా అంతటా పింఛన్ల సమస్యే. ఇందుకోసం రోజూ ధర్నాలు, రాస్తారోకోలు.
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా అంతటా పింఛన్ల సమస్యే. ఇందుకోసం రోజూ ధర్నాలు, రాస్తారోకోలు. చివరకు గ్రీవెన్స్‌కు సెల్‌కు కూడా వీటిపైనే అధిక మొత్తంలో అర్జీలు అందాయి. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగంలో కలెక్టర్ ఎం.జగన్మోహన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అందులో సగానికి పైగా పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులే రావడం చర్చనీయాంశమైంది.
ఆసరా పథకంలో అర్హులకు పింఛన్ రాకపోవడం, కొత్త వారికి మంజూరు కావడం, భర్త ఉన్నా భార్యకు వితంతువు పింఛన్ రావడం, 80 ఏళ్లు ఉన్నా వృద్ధులకు మంజూరు కాకపోవడం, ఇన్ని రోజులు పింఛన్ ఇచ్చి ఇప్పుడు నిలిపివేయడం వంటి తదితర కారణాలతో దరఖాస్తులు రావడంతో అధికారులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తామని, ప్రతీ అర్జీని పరిశీలించి అర్హులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు జేసీ ఎస్‌ఎస్.రాజు, జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డీఈవో సత్యనారాయణరెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.