నార్నూర్‌లో పింఛన్ కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
ఆదిలాబాద్ : ఏ ఆధారం లేని వారికి ప్రభుత్వం ఆసరా పథకం కింద పింఛన్ అందిస్తూ అండగా నిలుస్తోంది. అయితే కొంతకాలంగా ఈ డబ్బులు సకాలంలో అందించకపోవడంతో పథకం అబాసుపాలవుతోంది. మూడు నెలలుగా పింఛన్ నిలిచిపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ఈ పింఛన్‌తోనే జిల్లాలో ఎంతో మంది జీవనం సాగిస్తున్నారు. అయితే నవంబర్ నుంచి ఇప్పటి వరకు పింఛన్ రాకపోవడంతో ఎప్పుడు ఇస్తారో తెలియక లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదల కావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో అధికారులకు కూడా చెప్పడం లేదు. ఈ పింఛన్‌పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పూటగడవక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
అవసరానికి ఆదుకోని ‘ఆసరా’..
ఆదిలాబాద్ జిల్లాలో 69,094 మంది ఆసరా పిం ఛన్‌దారులు ఉన్నారు. ఇందులో వృద్ధాప్య, వికలాంగ, వితంతు, గీత, చేనేత, ఒంటరి మహిళ, బీడీ కార్మికులు ఉన్నారు. గతేడాది నుంచి జిల్లాలో 1,826 మంది ఒంటరిమహిళలకు ఆర్థికభృతి కూడా ఆసరా ద్వారా పంపిణీ చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో బ్యాంకు ఖాతాల్లో, గ్రామీణా ప్రాంతాల్లో పోస్టాఫీసు ద్వారా బయోమెట్రిక్ విధానంలో పింఛన్ పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదలలో జాప్యం చేస్తుండడంతో పింఛన్‌దారులు ప్రతి నెలా ఇబ్బందులు పడుతున్నారు. మొదట్లో 10వ తేది నుంచి పంపిణీ చేసేవారు, ఆ తర్వాత 15 నుంచి 20వ తేదీకి మార్చారు. ఇప్పుడు ఆ సమయానికి కూడా పంపిణీ చేయడం లేదు. దీంతో నెలనెలా పింఛన్‌పై ఆధారపడి అక్కడిక్కడ అప్పు చేసి ఇంట్లో సరుకులు కొనుక్కునే వృద్ధులు, ఒంటరి మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరివద్దనైనా అప్పు తెచ్చుకున్న నెల రోజుల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. పింఛన్ వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి అప్పు తెచ్చుకున్నప్పటికీ పింఛన్ కాస్తా నెలల తరబడి రాకపోవడంతో ఆ భారం కూడా వారిపైనే పడుతోంది. కిరాణా కొట్టులో తెచ్చుకున్న సరుకులకు, అప్పు తెచ్చుకున్న వారికి సొమ్ము ఇద్దామంటే పింఛన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు ఇచ్చేదేదో ఇస్తుంది కానీ.. సమయానికి ఇవ్వకుంటే మాకేం ఉపయోగమని వాపోతున్నారు.
‘ఆన్‌లైన్’ మెలిక..
జిల్లాలో గత డిసెంబర్‌లో ఆదివాసీల ఆందోళనలతో జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్ సేవలు నిలిపివేశారు. ఆ నెలలో పింఛన్ పంపిణీకి ఆన్‌లైన్ పనిచేయడం లేదని చెప్పిన అధికారులు.. ప్రస్తుతం ఆన్‌లైన్ సేవలు పునరుద్ధరించినా కూడా అదే విషయాన్ని వెల్లడించడం గమనార్హం. గ్రామాల్లో లబ్ధిదారులు పింఛన్ ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తే ఆన్‌లైన్ సరిగా లేదంటూ దాటవేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇటు ప్రభుత్వం, అటు అధికారులు తమను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పింఛన్ మీదనే ఆధారం..
నేను ఏం పనిచేసేంత శక్తి లేదు. ప్రతి నెలా అవసరాలన్నీ పింఛన్‌తోనే తీర్చుకుంటా. మూడు నెలల సంది పింఛన్ కోసం ఎదురుచూస్తున్నా. సార్లు మా ఊరికి ఎప్పుడస్తారో, ఆ పింఛన్‌లు ఎప్పుడిస్తారో తెల్వడం లేదు. నెలనెలా పంచాయతీ ఆఫీస్‌కు పోతున్న.. అస్తున్నగానీ పింఛన్ ఇస్తలేరు.
– సాత్‌గరే గంగుబాయి, బేల
టైంకు ఇస్తే బాగుండు
ప్రతి నెల పింఛన్ టెంకు ఇస్తేనే మా అవసరాలు తీర్చుకుంటాం. లేకుంటే అప్పులు చేయక తప్పడం లేదు. అధికారులను అడిగితే ప్రభుత్వం నుంచి రావడం లేదంటారు. నెలచ్చిందంటే పింఛన్ అస్తదెమోనని ఆశగా ఎదురుచూసిన ప్రయోజనం ఉండడం లేదు. ప్రభుత్వం పింఛన్‌లు ప్రతి నెల ఇచ్చేలా చూస్తే మంచిగుంటది.
– రాథోడ్ ఆనంద్, నార్నూర్
నెలనెలా పరేషానే..
నెలనెలా పింఛన్ కోసం పరేషనవుతున్నాం. గతంలో నెలచ్చిందంటే పింఛన్ తీసుకునేటోళ్లం. ఇప్పుడు పింఛన్ డబ్బులు ఎప్పుడొస్తాయో తెల్వట్లేదు. ప్రతి నెలా ఆఫీస్‌కాడికి పోతున్నాం.. వస్తున్నాం. కానీ పాయిద లేదు. పింఛనొచ్చినంక ఇద్దామని ఎవల దగ్గర్ననన్న పైసల్ తీసుకుందామను కున్నా ఆ పింఛన్ ఎప్పుడిస్తరో తెల్వదు. నెలనెలా అవసరాలు తీర్చుకునుడు తిప్పలైతంది.
– లతీఫ్,(నార్నూర్)
Comments
Please login to add a commentAdd a comment