65.30 లక్షల మంది లబ్దిదారులకు రూ.1,939.39 కోట్లు విడుదల
47.74 లక్షల మందికి 1వ తేదీనే పింఛను డబ్బు బ్యాంకు ఖాతాల్లో జమ
మిగిలిన 17.56 లక్షల మందికి ఇంటివద్దే పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అవ్వాతాతలకు వచ్చే నెల నుంచి పంపిణీ చేసే పింఛన్‌ను కూడా ప్రభుత్వం లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనుంది. మే నెలలో ఇంటివద్ద పింఛను పొందిన వారికి ఈసారి కూడా 1–5 తేదీల మధ్య ఇంటివద్దే ఆ డబ్బు అందిస్తారు. జూన్ ఒకటికి కొత్తగా 80 ఏళ్లు వచ్చిన వారికి కూడా ఇంటి వద్దే పింఛన్ డబ్బు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ బుధవారం మార్గదర్శకాలు జారీ చేశారు.
ఐదేళ్లుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతినెలా 1వ తేదీనే ఠంచన్‌గా పింఛన్ లబ్ధిదారులందరికీ వలంటీర్ల ద్వారా ఇంటివద్దే అందించేది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేప«థ్యంలో ఎన్నికల కోడ్ పేరుతో టీడీపీ చేసిన ఫిర్యాదులతో వలంటీర్లను ఎన్నికల సంఘం ఈ కార్యక్రమం నుంచి దూరంగా ఉంచింది. దీంతో రెండు నెలలుగా అవ్వాతాతలు, దివ్యాంగులు, తదితరులకు అందించే పింఛన్ల పంపిణీలో మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. పింఛన్లను లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్‌చైర్‌లకు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రం ఇంటి వద్దనే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలో పింఛను డబ్బులను పంపిణీ జరిగింది. జూన్ నెలలోనూ ఇదేవిధంగా జరగనుంది.
73% లబ్దిదారులకు బ్యాంకు ఖాతాల్లో జమ
రాష్ట్రవ్యాప్తంగా 65,30,808 మందికి పింఛన్లు పంపిణీ చేస్తారు. ఇందుకోసం రూ.1,939.35 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. లబి్ధదారుల్లో 47,74,733 మంది (73.11 శాతం)కి డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాల్లో ఒకటో తేదీనే జమ చేస్తారు. మిగిలిన 17,56,105 మంది (26.89 శాతం)కి ఇంటి వద్దే పంపిణీ చేయనున్నారు.
ఎన్నికల నియమావళిని పాటిస్తూ పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా పెన్షన్ పంపిణీ చేయాలని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు అందాయి. ఇతర రాష్ట్రాల కోఆపరేటివ్ బ్యాంకులలో బ్యాంకు ఖాతా ఉన్న లబ్దిదారులకు కూడా డీబీటీ రూపంలో కాకుండా జూన్ 1 – 5 తేదీల మధ్య ఇంటి వద్దనే పంపిణీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment